వైజాగ్‌కు ఇక సెలవు | Vizag Prasad Died With Heart Stroke In Visakhapatnam | Sakshi
Sakshi News home page

వైజాగ్‌కు ఇక సెలవు

Oct 22 2018 8:00 AM | Updated on Oct 30 2018 2:05 PM

Vizag Prasad Died With Heart Stroke In Visakhapatnam - Sakshi

ఆనాటి ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి నుంచి నంది అవార్డు అందుకుంటున్న వైజాగ్‌ ప్రసాద్‌ (ఫైల్‌)

తెలుగు కళారంగంలో మరో ధ్రువతార రాలిపోయింది.  ప్రముఖ సీనియర్‌ నటుడు వైజాగ్‌ ప్రసాద్‌ ఆదివారం తెల్లవారుజామున గుండెపోటుతో మరణించారన్న వార్తప్రసార మాధ్యమాల ద్వారా వ్యాపించడంతో నగరమంతా విషాదఛాయలు అలుముకున్నాయి. రంగస్థలం నుంచి వెండితెరకు వచ్చి ఆ తర్వాత బుల్లితెరపై కూడా నటించి ఆయన ఎందరో మనసులు గెలుచుకున్నారు. రెండేళ్ల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇంటికే పరిమితమయ్యారు. వైజాగ్‌ ప్రసాద్‌ ఇక లేరన్న వార్తను ఆయనఅభిమానులు, బంధుమిత్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన లేని లోటును తలచుకుని దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన స్వస్థలం గోపాలపట్నం విషాదంతో మూగబోయింది.

గోపాలపట్నం (విశాఖ పశ్చిమ)/విశాఖ కల్చరల్‌: వైజాగ్‌ ప్రసాద్‌ అసలు పేరు కొర్లాం పార్వతీ వరప్రసాద్‌. విశాఖ నగరం గోపాలపట్నం యల్లపువానిపాలెంలో ఆయన జన్మించారు. పాతగోపాలపట్నం మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం రామ్మూర్తి మాస్టారి అబ్బాయిగా సుపరిచితులు. ముగ్గురు అక్కలు తర్వాత సంతానం ప్రసాద్‌. చిన్నతనంలోనే తల్లి మరణించడంతో అన్నీ నాన్నే అయ్యారు. ప్రాథమిక చదువుల నుంచీ ఎస్‌ఎస్‌ఎల్‌సీ వరకూ ప్రసాద్‌ను తన మేనమామ వద్ద చదివించారు. తర్వాత విశాఖలో పీయూసీ చదివారు. తర్వాత బీఏ చదివారు. ఆరు దశాబ్దాలుగా ప్రసాద్‌ గోపాలపట్నం మెయిన్‌రోడ్డులో నివాసం ఉంటున్నారు. సినీ రంగనేప«థ్యంలో ప్రసాద్‌ భార్య విద్యావతితో హైదరాబాద్‌లో ఉంటున్నారు. ఆయన కుమార్తె రత్నప్రభ, కుమారుడు రత్నకుమార్‌ ఇద్దరూ ఇంజినీర్లుగా అమెరికా, లండన్‌లో స్థిరపడ్డారు.

నాటకాల మోజులో డాక్టర్‌ సీటు వదిలేసి...
ప్రసాద్‌కు నాటకాల పిచ్చి అంతా ఇంతా కాదు. చిన్నతనంలో మునిమాణిక్యం నరసింహారావు అనే రచయిత నాటకానికి ఇద్దరబ్బాయిలు కావాలని కోరితే నాలుగొతరగతి చదువుతున్న ప్రసాద్‌కు అవకాశం కల్పించారు. అప్పటి నుంచీ నాటకాల మోజు పెరిగింది. ప్రసాద్‌ ఎస్‌ఎస్‌ఎల్‌సీ తర్వాత వైజాగ్‌లో తండ్రి రామ్మూర్తి మాస్టారి  వద్దకు వచ్చినా నాటకాల వ్యామోహం తీరలేదు. అప్పట్లో  పీయూసీ తర్వాత ప్రీప్రొఫెషనల్‌ కోర్సు చేశాక ఎంబీబీఎస్‌ సీటు వచ్చినా అందులో చేరాల్సిన రోజు నాటకాల ప్రదర్శనలో పడి సీటు వచ్చిందన్న సంగతి మర్చిపోయారు. తర్వాత డాక్టర్‌ అవ్వాలని ప్రయత్నించినా కాలేకపోయానని, తర్వాత బీఏ చదివానని అçప్పుడపుడు ఆయన సన్నిహితుల వద్ద అలనాటి నాటకాల మోజును గుర్తు చేసుకుంటుండేవారు.

ఉద్యోగం చేస్తున్నా నాటకాలే...
ప్రసాద్‌ బీహెచ్‌పీవీలో ఉండగా విద్యావతితో వివాహం జరిగింది. అనకాపల్లి పరిషత్‌ పోటీల్లో ప్రసాద్‌కు పావలా నాటికతో ఉత్తమ ప్రొడక్షన్‌ అవార్డు అందుకున్నారు. తర్వాత కాలంలో ఆయన  షిప్‌యార్డుల్లో ఉద్యోగం చేశారు. అప్పట్లో అక్కడి సంçస్థలో ప్రముఖనటుడు వంకాయల సత్యనారాయణ తదితర కళాకారులతో ఆయన నాటకాలు వేస్తుండేవారు. వంకాయల సత్యనారాయణతో విజయభారతి సంస్థ నెలకొల్పి మొట్టమొదటిగా గరీభీహటావో నాటిక ప్రదర్శించారు. చిలకలూరిపేట, బాపట్ల, కోల్‌కతా, అలహాబాద్‌ తదితర ప్రాంతాల్లో ఈనాటకానికి జాతీయస్థాయిలో విశేష ఆదరణ లభించింది. హాస్యనటుడు, విలన్, ఇంకా అనేక క్యారెక్టర్‌ ఆర్టిస్టు పాత్రల్లో గుర్తింపు పొందారు. నేనూ మనిషినే నాటికలో హీరోగా వేశారు. కాలధర్మం నాటికలో వృద్ధుడి పాత్ర...ఇలా ఎన్నో పాత్రల్లో మెప్పించారు. సినిమాల్లోనూ అవకాశాలు పెరగడంతో 2002లో షిప్‌యార్డులో ఉద్యోగానికి స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు.

170కిపైగా సినిమాలు...మూడునందులు
1983లో ప్రముఖ హాస్య చిత్రాల దర్శకుడు జంధ్యాల దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించిన బాబాయ్‌ అబ్బాయ్‌ చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యారు. ప్రసాద్‌ నాటక ప్రదర్శనలే సినీ అవకాశాలిచ్చాయి. ఆయా నాటకాలు చూసి సినీ దర్శకులు జంధ్యాల, కె.విశ్వనాథ్, గొల్లపూడి మారుతీరావు వంటి ప్రముఖుల ప్రోత్సాహించడంతో ప్రసాద్‌ వెండితెరపై మెరిశారు. ముద్దమందారం, మొగుడూపెళ్లాలు, ప్రతిఘటన, శృతిలయలు, ఊరికిమొనగాడు, ప్రేమపుస్తకం చిత్రాల్లో ప్రసాద్‌కు అవకాశాలు వచ్చాయి. దర్శకుడు తేజ పిలుపు మేరకు నువ్వు..నేను చిత్రంలో ప్రసాద్‌ క్యారెక్టర్‌కు మంచి గుర్తింపు రావడంతో అప్పటి నుంచీ ఒక్క వెండితెరపై నిలదొక్కుకున్నారు. ఇలా భద్ర, జైచిరంజీవ, గౌరి, జానికివెడ్స్‌ శ్రీరామ్‌ మంచి పాత్రల్లో నటించారు. సుమారు 170 సినిమాలకు పైగా నటించారు. ఇలా ఉత్తమ క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మూడు మార్లు ప్రతిష్టాత్మకమైన నంది అవార్డులను అందుకున్నారు. ఇంకా ఆయనకు నాటక, సినీరంగాల్లో ఉగాది పురస్కారాలు, సన్మానాలు, అభినందన పతకాలు, ప్రశంసాపత్రాలూ లెక్కలేదు.

సేవల్లో ప్రత్యేక శైలి...
వైజాగ్‌ ప్రసాద్‌ది విలక్షణ శైలి. ఒక చేత్తో చేసింది మరో చేతికి తెలియకుండా చేయాలన్న ఆకాంక్ష ఆయనది. గోపాలపట్నంలో షిర్డీ సాయినాథుని వెండి మకరతోరణం, వెంకటాపురం రామాలయానికి గంటస్తంభం ఏర్పాటుకు ఆయన సహకరించారు. హైదరాబాద్‌ నుంచి విశాఖ వచ్చినపుడు ఆయన ఏదో సేవాసంస్థను సందర్శించి సంతోషం పొందుతుంటారు. పాపాహోమ్‌లో చిన్నారులకు దుస్తులు ఇవ్వడం, ఎయిడ్స్‌బారిన పడ్డ వారి పిల్లలకు దుస్తులు కుట్టించి ఇవ్వడం, ఆర్థ్ధిక సాయం చేయడం ద్వారా సంతృప్తి చెందుతుండేవారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement