ఏడాదిలో ఒక్కరే మరణించారట

Vizag Health Department Says Only One Death Due To Un Health - Sakshi

స్పష్టం చేసిన జిల్లా యంత్రాంగం

ప్రజలను మోసం చేస్తున్న ప్రభుత్వం

తీవ్రతను గుర్తించకపోతే పరిస్థితి చేయి దాటిపోయే ప్రమాదం 

విశాఖ జిల్లాలో ఆరోగ్యం సుభిక్షంగా ఉందని జిల్లా యంత్రాంగం చెబుతోంది. గడచిన ఏడాదిలో మలేరియా, డయేరియా, చికున్‌గున్యా, డెంగ్యూ, స్వైన్‌ఫ్లూ, ఆంత్రాక్స్, టైఫాయిడ్, పచ్చకామెర్లు వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన 10,902 మంది పడగా వారిలో ఒక్కరంటే ఒక్కరే చనిపోయారని తేల్చింది.

సాక్షి, విశాఖపట్నం : ఏటా మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ, పచ్చకామెర్లతో పెద్దసంఖ్యలో చనిపోతున్నారు. ఇలా మరణించే వారి సంఖ్య మైదానం, పట్టణ ప్రాంతాలకంటే మన్యంలోనే ఎక్కువగా ఉంటోంది. కానీ జిల్లా మొత్తమ్మీద స్వైన్‌ఫ్లూతో ఒక్కరే చనిపోయారని పేర్కొనడం విడ్డూరంగా ఉంది. అలాగే 2018 జనవరి నుంచి ఇప్పటివరకు 753 మంది వ్యాధులకు గురవ్వగా వీరిలోనూ ఒక్కరే మరణించినట్టు చూపించారు. ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం పట్ల ఎంతో శ్రద్ధ చూపుతోందని, నిర్లక్ష్యం వహించడం లేదని అందరూ భావించాలన్న ఎత్తుగడతోనే మరణాల సంఖ్యను తక్కువగా చూపిస్తున్నట్టు తెలుస్తోంది.

వేసవికాలంలో డయేరియా ఉధృతమవుతోంది. వర్షాకాలం ఆరంభానికి ముందే వ్యాధుల (ఎపిడమిక్‌) సీజన్‌ మొదలవుతుంది. అలా అక్టోబరు దాకా ఆ సీజను     ప్రభావం, ప్రతాపం చూపుతుంది. అప్పట్నుంచి దోమల బెడద తీవ్రమవుతుంది. ఎపిడమిక్‌ సీజన్‌లోను, శీతాకాలంలోనూ దోమలు కుట్టడంతో మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ వంటి ప్రాణాంతక జ్వరాలు విజృంభిస్తాయి. వీటి బారిన పడిన వారు సకాలంలో సరైన వైద్యం చేయించుకోకపోతే మృత్యువాత పడుతుంటారు. ఇలా ఏటా ప్రతి మండలంలోనూ వివిధ ప్రమాదకర వ్యాధులతో పదుల సంఖ్యలో మరణిస్తున్నారు.

వైద్యం అందుబాటులో ఉండని గిరిజన (ఏజెన్సీ) ప్రాంతాల్లో అయితే మరణాల సంఖ్య మరింత అధికంగా ఉంటుంది. మారుమూల మన్యం గూడేల్లో పిట్టల్లా రాలిపోతుంటారు. ప్రధానంగా మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూలతో ఎక్కువ మంది చనిపోతుంటారు. అయినప్పటికీ ఇవేమీ రికార్డుల్లోకి ఎక్కకుండా అధికారులు జాగ్రత్త పడుతున్నారు. ఇళ్ల వద్దో, ఆస్పత్రుల్లోనో చనిపోయిన వారికి వేర్వేరు కారణాలు చూపుతున్నారు. ఫలితంగా నామమాత్రంగా ఒకటి, అరా మరణాలను నమోదు చేస్తున్నారు.  

అంకెల గారడీ
ఇలా అంకెలతో మోసం చేయడం వల్ల ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వం వ్యాధి తీవ్రత లేదన్న నిర్ధారణకు వస్తుంది. ఫలితంగా అక్కడ శ్రద్ధ చూపడం మానేస్తుంది. దీంతో ఆయా ప్రాంతాల్లో పేదలు అనారోగ్యం బారిన పడడం, కొన్నాళ్లకు తగిన చికిత్స అందక చనిపోవడం జరుగుతోంది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top