వైఎస్సార్‌సీపీ ఉద్యమాల ఫలితమే ‘రైల్వేజోన్‌’ 

Visakha Railway Zone is the result of YSRCP Movements - Sakshi

నాలుగేళ్లుగా అలుపెరగని పోరు  

రైల్వే జోన్‌ వస్తే కలిగే ప్రయోజనాలపై యువభేరీల్లో గళమెత్తిన వైఎస్‌ జగన్‌ 

పార్టీ ఆదేశాలతో గుడివాడ అమర్‌నాథ్‌ ఆమరణ దీక్ష 

మండుటెండలో 201 కిలోమీటర్ల పాదయాత్ర 

దీక్షలు, మహా ధర్నాలు, జాతీయ రహదారి దిగ్బంధనాలు.. రైల్‌రోకోలు  

సాక్షి, విశాఖపట్నం/అమరావతి: ఉత్తరాంధ్రవాసుల దశాబ్దాల నాటి కల ఎట్టకేలకు నెరవేరింది. విశాఖ కేంద్రంగా సౌత్‌ కోస్ట్‌ రైల్వే జోన్‌ ఇస్తున్నట్టు కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్‌గోయల్‌ ప్రకటించారు. విజయవాడ, గుంటూరు, గుంతకల్‌ డివిజన్లతో ఏర్పాటవుతున్న ఈ కొత్త రైల్వే జోన్‌ సాధన విషయంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అలుపెరగని పోరాటం ఎంతో ఉంది. కేకే లైన్‌తో కూడిన విశాఖ రైల్వే జోన్‌ ఏర్పాటు కోరుతూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గడిచిన నాలుగున్నరేళ్లుగా ఎన్నో పోరాటాలు చేసింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు.. విశాఖ రైల్వే జోన్‌ కోసం ఆ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నో పోరాటాలు చేశారు. పార్టీ శ్రేణుల్లో ఉద్యమ స్ఫూర్తిని నింపారు. 

వైఎస్‌ జగన్‌ అలుపెరుగని పోరు
హోదా, విభజన హామీల అమలు కోసం వైఎస్‌ జగన్‌ ఎన్నో పోరాటాలు చేశారు. రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ప్రాణాలను సైతం లెక్కచేయక ఆమరణ నిరాహార దీక్ష చేసిన ప్రతిపక్ష నేత.. గడిచిన నాలుగున్నరేళ్లుగా హోదా, రైల్వేజోన్‌ సాధన కోసం ఢిల్లీ నుంచి గల్లీ వరకు పోరు సాగిస్తూనే ఉన్నారు. విభజన సమస్యల పరిష్కారం, హోదా కోరుతూ ప్రధాని సహా కేంద్ర మంత్రులను కలుస్తూ వచ్చారు. ప్రతి వినతిపత్రంలోనూ రైల్వే జోన్‌ను ప్రముఖంగా ప్రస్తావించారు. విశాఖ నుంచి శ్రీకారం చుట్టిన యువభేరీలలో హోదాతో పాటు ప్రత్యేక రైల్వే జోన్‌ వస్తే ఉత్తరాంధ్రకు కలిగే ప్రయోజనాలను యువతకు వివరించారు. రైల్వేలో ఉద్యోగాల కోసం పొరుగునున్న భువనేశ్వర్‌కు వెళ్తున్నారని, అక్కడ మన యువతను స్థానికేతరులుగా చూస్తున్నారని, జోన్‌ వస్తే మన యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలొస్తాయని, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని జోన్‌ ఆవశ్యకతను నొక్కి చెప్పారు. ఆ తర్వాత జై ఆంధ్రప్రదేశ్‌ అంటూ విశాఖ ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో నిర్వహించిన సభలో కూడా ఉత్తరాంధ్రుల రైల్వే జోన్‌ కాంక్షపై గళమెత్తారు. 

ఎన్నో పోరాటాల ఫలితం
ఇక ప్రత్యేక హోదా, రైల్వే జోన్‌ సాధన కోసం వైఎస్సార్‌సీపీ ఇచ్చిన ప్రతి పిలుపునకు ఆ పార్టీ శ్రేణులు ఉద్యమ కెరటాలయ్యారు. వైఎస్‌ జగన్‌ను స్ఫూర్తిగా తీసుకుని పార్టీ జిల్లా అ«ధ్యక్షుడిగా పనిచేసిన అనకాపల్లి కో–ఆర్డినేటర్‌ గుడివాడ అమర్‌నాథ్‌ తన ప్రాణాలను సైతం లెక్కచేయక ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు. 2016 ఏప్రిల్‌ 14న రైల్వే జోన్‌ సాధన కోసం అమర్‌నాథ్‌ ఆమరణ దీక్ష చేపట్టారు. ఏప్రిల్‌ 17న పోలీసులు దీక్షను భగ్నం చేసినా కేజీహెచ్‌లో సైతం దీక్ష కొనసాగించారు. ఏప్రిల్‌ 18న పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ నేరుగా కేజీహెచ్‌కు వెళ్లి అమర్‌నాథ్‌తో దీక్షను విరమింపజేశారు. ఇదే డిమాండ్‌తో అమర్‌నాథ్‌ మళ్లీ 2017 మార్చి 30వ తేదీన ఆత్మగౌరవయాత్ర పేరిట సుదీర్ఘ పాదయాత్ర చేపట్టారు. అనకాపల్లి నుంచి భీమిలి నియోజకవర్గం తగరపువలస వరకు సుమారు 201 కిలోమీటర్ల మేర సాగిన ఈ పాదయాత్ర ద్వారా రైల్వేజోన్‌ కాంక్షను బలంగా వినిపించారు. అదే విధంగా పలుమార్లు రైల్వే డీఆర్‌ఎం కార్యాలయాన్ని ముట్టడించారు. రైల్‌రోకోలు, జాతీయ రహదారి దిగ్బంధనాలు, వంటావార్పులంటూ వినూత్న రీతిలో నిరసనలతో హోరెత్తించారు.

హోదా కోసం తమ పదవులను తృణప్రాయంగా త్యజించిన పార్టీ ఎంపీలకు సంఘీభావంగా పదిరోజుల పాటు రిలే దీక్షలు చేయగా.. రోజుకో రీతిలో నిరసనలతో హోరెత్తించారు. ధర్నాలు, రాస్తారోకోలు, మానవహారాలు, కాగడాల ప్రదర్శనలు, కొవ్వొత్తుల ర్యాలీలు, రైల్‌రోకోలు, హైవేల దిగ్బంధనాలు.. ఇలా హోదా, రైల్వే జోన్‌ల కోసం గర్జించారు. ఏయూ విద్యార్థి సంఘ నేతలైతే ఏకంగా ఐదు రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష కూడా చేశారు. పాత జైలు రోడ్డులోని ఉమెన్స్‌ కళాశాల ఎదురుగా చేపట్టిన ఈ వంచన దీక్షలో కూడా రైల్వే జోన్‌ కోసం గర్జించారు. ఇలా అనేక పోరాటాల ఫలితంగానే విభజన హామీల్లో ఒకటైన రైల్వే జోన్‌ను ఎట్టకేలకు కేంద్రం ప్రకటించింది. ప్రత్యేక హోదాను కూడా సాధించగల సత్తా, సత్తువ, పోరాట స్ఫూర్తి వైఎస్సార్‌సీపీకి మాత్రమే ఉన్నాయని ఉత్తరాంధ్రవాసులు బలంగా నమ్ముతున్నారు. అలుపెరగని పోరాట యోధుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సారథ్యంలో హోదా కల కూడా నెరవేరుతుందని ప్రజలు విశ్వాసం వ్యక్తంచేస్తున్నారు. 

పాలకుల తీరువల్లే జాప్యం 
రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టి రాజకీయ పబ్బం గడుపుకోవడమే పరమావధిగా నాలుగేళ్లకు పైగా పాలకులు వ్యవహరించిన తీరు వల్లే విశాఖ రైల్వే జోన్‌ రాక ఆలస్యమైంది. ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి.. ప్యాకేజీని స్వాగతించడంతో పాటు ‘చేయాల్సిన దానికన్నా కేంద్రం ఎక్కువే చేస్తోంద’ని చెప్పుకొచ్చిన రీతిలోనే చంద్రబాబు ఆయన కోటరీ విశాఖ రైల్వేజోన్‌ విషయంలోనూ వ్యవహరించింది. రాష్ట్రంలో, కేంద్ర మంత్రివర్గాల్లో నాలుగేళ్లకు పైగా అధికారాన్ని పంచుకున్న టీడీపీ, బీజేపీలు విశాఖ రైల్వేజోన్‌ను పక్కదారి పట్టించే యత్నాలు చేశాయి. రైల్వేజోన్‌ విశాఖలో వద్దు విజయవాడలో ఏర్పాటుచేయాలని నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు డిమాండ్‌ చేయడం వెనుక చంద్రబాబు డైరెక్షన్‌ ఉందనే అభిప్రాయాలు అప్పట్లోనే వ్యక్తమయ్యాయి. బీజేపీలోని బాబు అనుకూలురు ఇందుకు వంతపాడారన్న విమర్శలొచ్చాయి. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top