రామచంద్రనగర్‌లో విషజ్వరాలు | viral fevers in ramachandra nagar | Sakshi
Sakshi News home page

రామచంద్రనగర్‌లో విషజ్వరాలు

Aug 18 2013 7:03 AM | Updated on Sep 1 2017 9:54 PM

మండలంలోని కొత్తపాలెం పంచాయతీ రామచంద్రనగర్ మంచం పట్టింది. ప్రజలు వారం రోజుల నుంచి జ్వరాలతో బాధపడుతున్నారు.

చినగంజాం, న్యూస్‌లైన్ : మండలంలోని కొత్తపాలెం పంచాయతీ రామచంద్రనగర్ మంచం పట్టింది. ప్రజలు వారం రోజుల నుంచి జ్వరాలతో బాధపడుతున్నారు. గ్రామంలో మొత్తం 200 కుటుంబాలుండగా 500 మందికిపైగా జనాభా ఉన్నారు. వారిలో సుమారు 100 మంది అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇంటికి ఇద్దరు ముగ్గురు చొప్పున మంచంపట్టారు. గ్రామంలో పడకేసిన పారిశుధ్యమే జ్వరాలకు కారణమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఊరి నడిబొడ్డున పెద్ద మురుగు గుంత ఉంది. దాని నుంచి దోమలు వ్యాప్తి చెందుతున్నాయి. మురుగు గుంత నుంచి తీవ్ర దుర్గంధం వెదజల్లుతోంది. మంచం పట్టిన వారు జ్వరంతో పాటు కాళ్లు, చేతులు, ఒళ్లు నొప్పులతో బాధపడుతున్నారు. స్థానికంగా ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యులు అందుబాటులో లేకపోవడంతో చినగంజాం, చీరాల, ఒంగోలు తదితర ప్రాంతాలకు వెళ్లి చికిత్స చేయించుకుంటున్నారు. ఆరోగ్యం కుదుట పడేందుకు ఆస్పత్రులు తిరిగి వేల రూపాయిలు ఖర్చు చేస్తున్నారు. ప్రజలు జ్వరాలతో ఇబ్బంది పడుతున్నా స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు పట్టించుకోలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
 
 ఇంటిల్లిపాదీ జ్వరాలతోఅల్లాడుతున్నాం:
 మా ఇంట్లో వారందరం వారం నుంచి జ్వరంతో బాధపడుతున్నాం. ముందు మా ఆయనకు, నాకు జ్వరం వచ్చింది. కాళ్లు, చేతులు విపరీతంగా నొప్పి పుడుతున్నాయి. జ్వరం ఇప్పటికీ పూర్తిస్థాయిలో తగ్గలేదు. ఈలోగా మా ఇద్దరు పిల్లలకూ జ్వరం వచ్చింది.
 - కొక్కిలగడ్డ సింగమ్మ
 
 భరించరాని ఒళ్లు నొప్పులు : శరీరమంతా నొప్పులే. ఆ బాధ భరించలేకున్నా. రెండు రోజుల క్రితం జ్వరం వచ్చింది. అప్పటి నుంచి మందులు వాడుతూనే ఉన్నా. అయినా ఫలితం కన్పించడం లేదు. జ్వరం కొంచెం తగ్గినట్లున్నా ఒళ్లు నొప్పులు మాత్రం తీవ్ర ఇబ్బంది పెడుతున్నాయి.
 - పెదసింగు రాజు
 

Advertisement
 
Advertisement
Advertisement