Viral Fevers With Effect Of Seasonal Diseases In Telangana - Sakshi
Sakshi News home page

జర జాగ్రత్త.. నెలలో రెండు లక్షల మందికి జ్వరాలు

Published Mon, Jul 17 2023 7:25 AM

Viral Fevers With Effect Of Seasonal Diseases In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో సీజనల్‌ వ్యాధులు విజృంభిస్తున్నాయి. జలుబు, దగ్గు, జ్వరాల కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి. డెంగీ, మలేరియా కేసులు కూడా భారీగా వెలుగుచూస్తున్నాయి. గత నెల రోజుల్లోనే రాష్ట్రంలో దాదాపు 2 లక్షల మంది జ్వరాల బారినపడినట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వాతావరణం మారడం, పారిశుద్ధ్య నిర్వహణ సరిగా లేకపోవడంతో దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. దీంతో పట్టణం, పల్లె అనే తేడా లేకుండా జ్వరాలతో బాధపడుతున్నవారి సంఖ్య పెరిగినట్లుగా వైద్య యంత్రాంగం అంచనా వేసింది. వానాకాలమంతా జ్వరాలు కొనసాగే పరిస్థితి ఉందని హెచ్చరిస్తోంది. 

ఆస్పత్రుల్లో రోగుల క్యూ 
సీజనల్‌ వ్యాధులతో రోగులు ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. హైదరాబాద్‌లోని ఫీవర్‌ ఆస్పత్రి, ఉస్మానియా, గాంధీ సహా జిల్లాల్లోని ఆస్పత్రులకు వచ్చే రోగుల సంఖ్య పెరిగింది. ఓపీలో సగం మంది సీజనల్‌ వ్యాధులతో బాధపడుతున్నవారే. 

పీహెచ్‌సీల్లో కానరాని డాక్టర్లు 
కొన్ని చోట్ల వైద్య ఆరోగ్యశాఖ యంత్రాంగ నిర్లక్ష్యం బాధితులకు శాపంగా మారింది. అనేక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో డాక్టర్లు రావడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాస్తవంగా ప్రభుత్వం వేసిన అంచనాలకు మించి జ్వరాలు, డెంగీ, మలేరియా కేసులున్నట్లు వైద్యులు చెబుతున్నారు. 

పగటి పూట కుట్టే దోమతో డెంగీ..
డెంగీ కారక ఈడిస్‌ ఈజిప్ట్‌ దోమ అన్ని దోమల్లాంటిది కాదు. పగటిపూటే కుడుతుంది. ఇళ్లు, కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలల్లో నిల్వ ఉంచే మంచినీటిలోనే పుట్టి పెరుగుతుంది. ఒక వారం రోజులు కదపకుండా దోసెడు నీరున్నా చాలు. అందులో పునరుత్పత్తి ప్రక్రియ కొనసాగిస్తుంది. ఎయిర్‌ కూలర్లలో, డ్రమ్ముల్లో నిల్వ ఉంచిన మంచినీటిలో, వాడకుండా పక్కన పడేసిన పాత టైర్లు, రేకు డబ్బాల్లో వాన నీరు కురిస్తే ఆ చిన్ననీటి గుంతల్లోనూ జీవనం కొనసాగిస్తుంది. అందుకే ఇంట్లో, కార్యాలయాల్లో ఎక్కడైనా కొద్దిపాటి నీటి నిల్వలున్నాయా అని పరిశీలించాలి. డెంగీ వస్తే ఉన్నట్టుండి తీవ్ర జ్వరం, భరించలేని తలనొప్పి వస్తుంది. కళ్లు తెరవడం కష్టంగా ఉంటుంది. చర్మంపై దద్దుర్లు అయినట్లు కనిపించడం, కండరాలు, కీళ్ల నొప్పులు ఉంటాయి. అధిక దాహంతో పాటు రక్తపోటు స్థాయిలు పడిపోతాయి. 

ఐజీఎం పరీక్షతోనే డెంగీ నిర్ధారణ 
డెంగీ నిర్ధారణలో వైద్య పరీక్షలే కీలకం. కేవలం ప్లేట్‌లెట్‌ కౌంట్, డెంగీ స్ట్రిప్‌ టెస్ట్, సీరమ్‌ టెస్ట్‌ వంటి వాటితో దీనిని నిర్ధారించడం శాస్త్రీయం కాదని వైద్య ఆరోగ్యశాఖ చెబుతోంది. విధిగా అందుబాటులో ఉండే ఐజీఎం పరీక్ష చేయించాలి. ప్లేట్‌లెట్లు 20 వేలలోపు పడిపోతే అది ప్రమాదకరంగా భావిస్తారు. 15 వేల కన్నా తగ్గితే డెంగీ షాక్, డెంగీ మరణాలు సంభవిస్తాయి. డెంగీ జ్వరం వస్తే తీవ్రతను తగ్గించేందుకు చల్లని నీటిలో స్పాంజీని ముంచి శరీరాన్ని తుడవాలి. ఎల్రక్టాల్‌ పౌడర్, పళ్లరసాలు రోగికి ఇవ్వాలి. దీనివల్ల జ్వర తీవ్రత తగ్గి ప్లేట్‌లెట్లు అదుపులోకి వస్తాయి. ఇంకా తగ్గకుంటే వైద్యుని వద్దకు తీసుకెళ్లాలని వైద్య ఆరోగ్యశాఖ సూచిస్తుంది. ఇక వైరల్‌ ఫీవర్‌ వస్తే విపరీతంగా మంచినీరు తాగాలి. పండ్ల రసాలు తీసుకుంటే ప్లేట్‌లెట్లు పడిపోకుండా కాపాడుతాయి.  

ఇది కూడా చదవండి: నిరుత్సాహపర్చిన బీసీలకు ‘లక్ష’ సాయం!

Advertisement
Advertisement