కరోనా వైరస్‌: ప్రతి ఇంటిని సర్వే చేస్తున్నాం

Vijayawada Municipal Commissioner Vijay Kumar Talk On Coronavirus Survey - Sakshi

సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో ప్రాణాంతకమైన కోవిడ్‌-19 (కరోనా వైరస్‌) వ్యాప్తి చెందకుండా ప్రతి ఇంటిని సర్వే చేస్తున్నామని విజయవాడ మున్సిపల్‌ శాఖ కమీషనర్‌ విజయ్‌ కుమార్‌ అన్నారు. ఆయన మీడియతో మాట్లాడుతూ.. ఇప్పటి వరకు 96 శాతం ఇళ్లను సర్వే చేశామని వెల్లడించారు. 1.43 కోట్ల ఇళ్లు ఉంటే ఇప్పటికే 1.37 కోట్ల ఇళ్లల్లో సర్వే పూర్తైందన్నారు. ప్రతి గ్రామ సచివాలయంలో ఏఎన్‌ఎంలు ఉన్నారని.. ప్రతి 50 ఇళ్లకు వాలంటీర్‌ ఉన్నారని ఆయన తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇంటింటికి సర్వే చేశామని విజయ్‌ కుమార్‌ పేర్కొన్నారు.

ప్రతి ఇంటికి వెళ్లి వాలంటీర్లు, ఆరోగ్య సిబ్బంది పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తున్నారని విజయ్‌ కుమార్‌ తెలిపారు. 2.80 లక్షల మంది వాలంటీర్లు, 1.18 లక్షల మంది సచివాలయ ఉద్యోగులు పని చేస్తున్నారని ఆయన చెప్పారు. ప్రతి 2 వేల మందికి ఎక్కడా లేని విధంగా ఏఎన్ఎన్‌లు ఉన్నారని ఆయన తెలిపారు. విదేశాల నుంచి రాష్ట్రానికి 6,379 మంది వచ్చినట్టు కేంద్రం జాబితా విడుదల చేసిందని ఆయన  అన్నారు. కానీ వాలంటీర్లు, ఆశ వర్కర్ల సర్వేలో మరో ఆరు వేల మంది విదేశాల నుంచి వచ్చినట్టు తేలిందని విజయ్‌ కుమార్‌ వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన ‘జనతా కర్ఫ్యూ’కి అన్ని పట్టణాల్లో, నగరాల్లో ప్రజలను సిద్ధం చేస్తున్నామని ఆయన తెలిపారు. ప్రభుత్వం నుంచి ముందుగానే అన్ని చర్యలు చేపడుతున్నామని విజయ్‌ కుమార్‌ పేర్కొన్నారు.

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కోవిడ్‌-19(కరోనా వైరస్‌)ను జయించాలని వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్‌ సీఎస్‌ జవహర్‌రెడ్డి అన్నారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు బయటకు వెళ్లాలనుకుంటున్నారా.. ఒక్క క్షణం ఆలోచించాలి అన్నారు. యువతీ యువకులైనా, వ్యాధి నిరోధక శక్తి ఉన్నా, ఎవరైనా సరే ఇంట్లోనే ఉండాలని ఎట్టి పరిస్థితుల్లో అలసత్వం ఉండకూడదని ఆయన తెలిపారు. ఎవరి నుంచైనా  కోవిడ్-19 సంక్రమించవచ్చని జవహర్‌రెడ్డి సూచించారు. 
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top