వంచనకూ, విశ్వాసానికి మధ్య...

Vijayawada Central Constituency Review - Sakshi

విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గ ప్రజల తీర్పు విభిన్నం

హోరాహోరీగా విష్ణు, బొండా మధ్య పోటీ

సాక్షి, గాంధీనగర్‌ (విజయవాడ సెంట్రల్‌): విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గం నగరంలో అత్యంత కీలకమైనది. నగరం నడిబొడ్డులో ఉన్న ఈ నియోజకవర్గంలో గవర్నర్‌పేట, లెనిన్‌సెంటర్, బీసెంట్‌ రోడ్డు వ్యాపార, వాణిజ్య కేంద్రాలుగా భాసిల్లుతున్నాయి. వైద్యశాలలకు కేంద్రంగా ఉంది. జాతిపిత మహాత్మాగాందీ నడయాడిన గాంధీనగరం ఈ నియోజకవర్గంలోనే ఉంది. ఎంతో చరిత్ర కలిగిన స్వరాజ్‌మైదానం, జింఖానా మైదానాలు ఈ నియోజకవర్గంలోనివే. రాష్ట్ర విభజన తర్వాత హైకోర్టు, సీఎం క్యాంప్‌ కార్యాలయం ఇక్కడికి తరలివచ్చాయి. దీంతో నియోజకవర్గం ప్రాధాన్యత సంతరించుకుంది. నియోజకవర్గ పరిధిలోని ఘంటసాల సంగీత కళాశాల సుప్రసిద్ధమైనది, 107 సంవత్సరాల కిందట నిర్మించిన కాశీవిశ్వేశ్వర దేవాలయం ప్రసిద్ధికెక్కింది. సెంట్రల్‌ నియోజకవర్గానికి తూర్పు, దక్షిణం హద్దులుగా తూర్పు నియోజకవర్గం, పశ్చిమ సరిహద్దుగా పశ్చిమ నియోజకవర్గం, దక్షిణ హద్దుగా మైలవరం, గన్నవరం నియోజకవర్గాలు ఉన్నాయి.

పోలింగ్‌  బూత్‌లు : 236
మొత్తం ఓట్లు : 2,35,723
పురుషులు : 1,15,752
స్త్రీలు : 1,19,905
ఇతరులు : 66
మొత్తం డివిజన్లు : 20
మొత్తం జనాభా : 3,64,149

నియోజకవర్గ విశిష్టత
స్వాతంత్రోద్యమం నుంచి నియోజకవర్గానికి ఎంతో చరిత్ర ఉంది. విశ్వనాథ సత్యనారాయణ, మంగళంపల్లి బాలమురళీకృష్ణ వంటి వారు ఈ ప్రాంతానికి చెందిన వారే . ఘంటసాల సంగీత కళాశాల, రామకోటి మైదానం ఎంతో ప్రసిద్ధి చెందినవి.

వీరే మన ఎమ్మెల్యేలు
2008 నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఏర్పాటైంది. అంతకు ముందు విజయవాడ తూర్పులో భాగంగా ఉండేది. నియోజకవర్గానికి 2009లో తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా మల్లాది విష్ణు విజయం సాధించారు. మల్లాది విష్ణుకు 52,426 ఓట్లు, ప్రత్యర్థి వంగవీటి రాధాకృష్ణకు 51,578 ఓట్లు రాగా 848 ఓట్ల మెజార్టీతో మల్లాది విష్ణు గెలుపొందారు. 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బొండా ఉమామహేశ్వరరావు విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో బొండా ఉమామహేశ్వరరావుకు 82,669 ఓట్లు పోలవ్వగా ప్రత్యర్థి పూనూరు గౌతంరెడ్డికి 55,508 ఓట్లు రాగా, బొండా ఉమా 27,161 ఓట్ల మెజార్టీ సాధించారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పూనూరు గౌతంరెడ్డిపై బొండా ఉమామహేశ్వరరావు 27,161 ఓట్ల తేడాతో గెలుపొందారు. నియోజకవర్గానికి మొత్తం రెండు సార్లు ఎన్నికల జరగగా ఇక్కడి ప్రజలు వేర్వేరు పార్టీలను గెలిపించారు.

రెండు పార్టీల మధ్యే పోటీ
నియోజకవర్గానికి 2009లో తొలి సారిగా జరిగిన ఎన్నికల్లో ప్రధాన పోటీ కాంగ్రెస్‌ పార్టీ, ప్రజారాజ్యం మధ్యే పోటీ. 2014 ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ, టీడీపీల మధ్య ప్రధాన పోటీ. 2019 ఎన్నికల్లోనూ వైఎస్సార్‌సీపీ, టీడీపీల మధ్యే ప్రధాన పోటీ ఉండబోతోంది. జనసేన నామమాత్రపు పోటీ ఇస్తుందని భావిస్తున్నారు. నియోజకవర్గంలో బ్రాహ్మణ, కాపు సామాజిక వర్గాల ఓట్లు అధికంగా ఉన్నాయి.

వైఎస్సార్‌ చొరవతో ...
నగరంతో వైఎస్‌ రాజశేఖరరెడ్డికి అవినాభావ సంబంధం ఉంది. వైఎస్‌ రాజశేఖరరెడ్డి చొరవతో మల్లాది విష్ణు ఎమ్మెల్యేగా పోటీ చేసి 2009లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు. బుడమేరు ముంపు సమయంలో  వైఎస్‌ సెంట్రల్‌ నియోజకవర్గంలో పర్యటించారు. ముంపు నివారణకు కరకట్ట నిర్మాణం చేపట్టారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top