విజయశేఖరుడు


ఆశయం బలంగా ఉంటే సాధ్యంకానిది లేదు.. ఓటములు ఎన్ని ఎదురైనా పట్టువిడవని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తే విజయం మనదే.. ఇలాంటి వాటిని గట్టిగా నమ్మినట్లున్నాడు శేఖర్. ఒకప్పుడు ఇంగ్లిష్‌లో ప్రావీణ్యం సంపాదించేందుకే ఇబ్బందులుపడిన ఆయన తర్వాత ఇతర దేశ జాతీయభాషను అనర్గళంగా మాట్లాడే స్థాయికి ఎదిగారు. ఆ భాషలో పలు రచనలు చేపట్టి ప్రశంసలు అందుకున్నారు.   - నంద్యాలటౌన్

 

 శేఖర్‌ది జూపాడుబంగ్లా మండలం తూడిచర్ల గ్రామం. తండ్రి కుమ్మరి నారాయణ. రైతు కుటుంబంకావడంతో ఆర్థికంగా, కుటుంబపరంగా శేఖర్ ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. చిన్నప్పటి ఆయనకు ఇంగ్లిష్ అంటే భయం. ఇంటర్‌లో కేవలం 38శాతం మార్కులతో పాసైన ఆయన తర్వాత మేనమామ సలహా మేరకు చెన్నైలోని మెరైన్ రేడియో ఆఫీసర్ కోర్సులో చేరారు. కోర్సు మొత్తం ఇంగ్లిష్‌లోనే. భాష సరిగా రాకపోవడంతో చదువు మధ్యలోనే బ్రేక్ పడింది. ఏడాది పాటు తన తండ్రికి పొలం పనుల్లో సేవలందించారు. తర్వాత మళ్లీ కర్నూలుకు వెళ్లి డిగ్రీ పూర్తి చేశారు. ఇంగ్లిష్‌పై పట్టుకు బెంగళూరుకు..

 శేఖర్ ఏ ఇంటర్వ్యూకు వెళ్లినా ఇంగ్లిష్ మాట్లాడడం సరిగా రాకపోవడంతో అన్నీ ఫెయిల్యూర్ అయ్యేవి. ఎలాగైనా ఆ భాషలో పట్టు సాధించాలని నిర్ణయించుకున్నారు. బెంగళూరుకు ప్రయాణమయ్యాడు. అక్కడ మొత్తం ఏడు స్పోకెన్ ఇంగ్లిష్ కోచింగ్ సెంటర్లకు వెళ్లారు. ఆంగ్లం అనర్గళంగా మాట్లాడే స్థాయికి ఎదిగారు. తర్వాత చెన్నైలోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం రావడంతో కొంత డిపాజిట్ చెల్లించారు. కాని కంపెనీ బోర్డు తిప్పేయడంతో మళ్లీ నిరుద్యోగిగా మారారు.చెన్నై నుంచి హోసూరు చేరి అక్కడ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగంలో చేరారు. అలా చేస్తూ ఉండగానే ఓ స్నేహితుడి ద్వారా స్పోకెన్ ఇంగ్లిష్ కోచింగ్ సెంటర్‌లో టీచింగ్ ఫ్యాకల్టీ జాబ్ వచ్చింది. అక్కడ ఉద్యోగం చేస్తుండగా శేఖర్ ప్రతిభను గుర్తించిన యాజమాన్యం అతనికి కోచింగ్ సెంటర్‌లో భాగస్వామ్యం ఇచ్చింది. కొన్ని రోజుల పాటు ఫ్యాకల్టీగా కొనసాగాక అక్కడ విద్యార్థులు లేకపోవడంతో బెంగుళూరులో సొంతంగా ఇన్సిట్యూట్ ప్రారంభించారు. ఇథియోపియాలో అవకాశం

 బెంగళూరులో స్పోకెన్ ఇంగ్లిష్ ఇన్సిట్యూట్ రన్ చేస్తున్న శేఖర్‌కు 2009లో జనవరిలో ఇథియోపియా దేశంలోని మీజోన్ తేపి విశ్వవిద్యాలయంలో ఇంగ్లిష్ బోధించే అవకాశం వచ్చింది. అక్కడి వెళ్లాక ఇథియోపియా జాతీయభాష అమహారిక్‌ను ఆరు నెలల్లో నేర్చుకున్నారు. ఆ భాషపై పట్టు సాధించాక తొలిసారిగా 2012లో అమహారిక్-థిఎర్త్ ఆఫ్ ఇథోపియన్స్ అనే పుస్తకాన్ని రాశారు.తర్వాత ఆ భాషలలో మొత్తం 15 పుస్తకాలు రాశారు. ఇథియోపియన్స్ హిందీని నేర్చుకునేందుకు అమహారిక్ భాషలో ఒక పుస్తకాన్ని రచించినందుకు ఆ దేశ రాయబారి భగ్వీత్‌సింగ్ భిష్నోయి సన్మానించారు.     {పస్తుతం నంద్యాలలోని ఎన్‌జీఓ కాలనీలో నివాసం ఏర్పరుచుకున్న శేఖర్.. బెంగుళూరులో స్పోకెన్ ఇంగ్లిష్ కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్నారు. త్వరలో కర్నూలు, నంద్యాలలో కూడా బ్రాంచ్‌లను ఏర్పాటు చేసి విద్యార్థులకు, నిరుద్యోగులు ఇంగ్లిష్‌లో పట్టు సాధించేలా చేయాలనేది ఆయన తపన.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top