బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరోమారు బాషలకు సంబంధించిన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేంద్రం పాఠశాలల్లో హిందీని తప్పనిసరి చేస్తూ, కన్నడను నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. ఇంగ్లీష్, హిందీపై అతిగా ఆధారపడుతున్న కారణంగా, రాష్ట్రంలోని పిల్లల సహజ ప్రతిభ క్షీణిస్తున్నదని సిద్దరామయ్య ఆవేదన వ్యక్తం చేశారు. త్రిభాషా విధానంపై కొనసాగుతున్న వివాదం మధ్య సీఎం వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
బెంగళూరులో జరిగిన రాజ్యోత్సవ వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాట్లాడుతూ ఫెడరల్ ప్రభుత్వం కర్ణాటకపై నిర్లక్క్ష్య వైఖరిని చూపుతోందని ఆరోపించారు. తాము కేంద్రానికి రూ. 4.5 లక్షల కోట్ల ఆదాయాన్ని అందిస్తున్నప్పటికీ, ప్రతిఫలంగా చాలా తక్కువ మొత్తాన్ని మాత్రమే పొందుతున్నామని పేర్కొన్నారు. హిందీ, సంస్కృతం ప్రోత్సాహానికి ఉదారంగా గ్రాంట్లు మంజూరు చేస్తున్నప్పటికీ, కన్నడతో సహా ఇతర భారతీయ భాషలను పక్కనపెడుతున్నారని సీఎం ఆరోపించారు.
అభివృద్ధి చెందిన దేశాలలోని పిల్లలు తమ మాతృభాషలోనే ఆలోచిస్తారు.. నేర్చుకుంటారు..కలలు కంటారు.. కానీ ఇక్కడి పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఇంగ్లీష్, హిందీ బాషలు ఇక్కడి పిల్లల ప్రతిభను బలహీనపరుస్తున్నాయని సిద్దరామయ్య పేర్కొన్నారు. ప్రారంభ పాఠశాల విద్యలో మాతృభాష విద్యను తప్పనిసరి చేసేందుకు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సిద్ధరామయ్య పిలుపునిచ్చారు. మాతృభాషను బోధనా మాధ్యమంగా ప్రవేశపెట్టడానికి చట్టాలను తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు.
ఇది కూడా చదవండి: Bengaluru: రోడ్లపై చెత్తవేస్తే.. ‘అంతకన్నా అవమానం ఉండదు’


