విద్యార్థినికి న్యాయం చేయాల్సిందే..

Vijay Sai Reddy Complaint To Collector Harassments On Student - Sakshi

కరస్పాండెంట్, ప్రిన్సిపాల్‌పై చర్యలకు డిమాండ్‌

కలెక్టర్, పోలీస్‌ కమిషనర్‌కు ఫిర్యాదు

న్యాయం జరగకుంటే పోరాటం తప్పదు

వైఎస్సార్‌ సీపీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయి రెడ్డి

విశాఖ క్రైం/బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): విద్యాబుద్ధులు నేర్పించాల్సిన కళాశాల యాజమాన్యం, అధ్యాపకులే.. విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడటం అత్యంత హేయమని వైఎస్సార్‌ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పిల్లలతో సమానంగా చూడాల్సిన వారే ఇలా అరాచకాలకు పాల్పడితే విద్యార్థులకు రక్షణ ఎక్కడుంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల డాబాగార్డెన్స్‌లోని విశాఖ ఒకేషనల్‌ కాలేజీ కరస్పాండెంట్‌ గాది వెంకటసత్య నరసింహకుమార్‌ అలియాస్‌ కుమార్‌ తనను వేధించినట్లు బాధిత విద్యార్థిని ప్రజాసంకల్పయాత్ర చేపడుతున్న వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లింది. బాధితురాలికి న్యాయం జరిగేలా కలెక్టర్, నగర కమిషనర్‌కు ఫిర్యాదు చేయాలని ఎంపీ విజయసాయిరెడ్డిని ఆయన ఆదేశించారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి సోమవారం ఉదయం కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. కుమార్‌పై చర్యలు తీసుకొని బాధిత విద్యార్థినికి న్యాయం చేయాలని కోరారు.

నగర పోలీస్‌ కమిషనర్‌కు ఫిర్యాదు
లైంగిక వేధింపులకు పాల్పడిన కళాశాల కరస్పాండెంట్‌ కుమార్‌పై చర్యలు తీసుకోవాలని విజయసాయిరెడ్డి సోమవారం మధ్యాహ్నం నగర పోలీస్‌ కమిషనర్‌ మహేష్‌చంద్ర లడ్డాను కోరారు. ఈ మేరకు బాధితురాలతో కలిసి సీపీకి వినతిపత్రం అందజేశారు. ఇప్పటికే కుమార్‌ను అరెస్ట్‌ చేసినట్లు సీపీ తెలిపారని విజయసాయిరెడ్డి చెప్పారు. ఈ కేసులో రాజకీయ నాయకులు ఉన్నారని సీపీ దృష్టికి తీసుకువెళ్లగా ఎవరైనా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారన్నారు.

కరస్పాండెంట్, ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోవాలి
ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ కరస్పాండెంట్‌ కుమార్, ప్రిన్సిపాల్‌ గ్లోరీ విద్యార్థినులను లైంగికంగా వేధిస్తున్నారన్నారు. తమ చేతుల్లో మీ భవిష్యత్‌ ఉందని విద్యార్థినులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని తెలిపారు. వారిని తక్షణమే అరెస్టు చేయాలని కలెక్టర్‌ను కోరామని తెలిపారు. అలాగే కాలేజీకి అనుమతులు లేకుండా వందల మంది విద్యార్థులను చేర్చుకొని వారి జీవితాలతో ఆటలాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వేరే కాలేజీలో చదువుకునేలా చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. అలాగే బాధితుల పక్షాన నిలవాల్సిన పోలీసులే నిందితులకు కొమ్ముకాసేలా వ్యవహరించడం శోచనీయమన్నారు. బాధిత మహిళ ఫిర్యాదును వెంటనే స్వీకరించి తగు చర్యలు తీసుకోవల్సిన పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదన్నారు. బాధిత విద్యార్థినికి న్యాయం చేయటానికి కొంత సమయం పడుతుందని కలెక్టర్‌ చెప్పారని, ఆ సమయంలోగా న్యాయం చేయకపోతే వైఎస్సార్‌ సీపీ పోరాటం చేస్తుందన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని ఆరోపించారు. కళాశాల విద్యార్థులు మాట్లాడుతూ బాధిత విద్యార్థి చదువు పూర్తిచేసేంత వరకు యాజమాన్యం ఖర్చులు భరించాలని డిమాండ్‌ చేశారు. పెళ్లి చేసి అత్తారింటికి పంపించేంత వరకు అండగా ఉండాలన్నారు. సీపీ, కలెక్టర్‌ను కలిసిన వారిలో పార్టీ నగర అధ్యక్షుడు మళ్ల విజయప్రసాద్, దక్షిణ సమన్వయకర్త కోలా గురువులు, విశాఖ పార్లమెంట్‌ విద్యార్థి విభాగం అధ్యక్షుడు బి.కాంతారావు, నగర యువజన విభాగం అధ్యక్షుడు కొండా రాజీవ్‌గాంధీ, అధిక సంఖ్యలో విద్యార్థులు ఉన్నారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top