రైస్ మిల్‌పై విజిలెన్స్ దాడి | Vigilance attach on rice mill | Sakshi
Sakshi News home page

రైస్ మిల్‌పై విజిలెన్స్ దాడి

May 15 2015 3:53 AM | Updated on Sep 3 2017 2:02 AM

కృత్తివెన్ను మండలం చినపాండ్రాక గ్రామంలోని శ్రీ జయలక్ష్మి మోడరన్ రైస్‌మిల్‌పై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు గురువారం దాడులు నిర్వహించారు.

- రూ.1.53 కోట్ల విలువైన ధాన్యం, బియ్యం స్వాధీనం  
చినపాండ్రాక(బంటుమిల్లి):
పెడన మండలం నందమూరు గ్రామానికి చెందిన ఓ వ్యాపారి తనవద్ద ఉన్న రేషన్ బియ్యాన్ని రైస్‌మిల్లులో అమ్మేందుకు వెళుతున్నాడని విజిలెన్స్ అధికారులకు సమాచారం అందింది. దీంతో వారు నిఘా ఉంచి, బియ్యం లోడుతో వెళుతున్న ఆటోను వెంబడించారు. ఆటో జయలక్ష్మి రైస్‌మిల్‌లోకి వెళ్లడంతో వారు కూడా లోనికి వెళ్లారు. మిల్లులోని సరుకులను తనిఖీ చేశారు. ఎఫ్‌సిఐకి వెళ్లే లారీల్లోని బియ్యం బస్తాలను అధికారులు కిందకు దింపించారు. మిల్లులో ధాన్యం, బియ్యాన్ని అక్రమంగా నిల్వ ఉంచినట్లు గుర్తించారు. వాటితోపాటు ఆటోను అందులో ఉన్న బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా రైస్‌మిల్లు యజమాని జల్లేపల్లి రవికిషోర్, ఆటోలో రేషన్ బియ్యం తీసుకువచ్చిన వ్యాపారి, ఆటో డ్రైవర్‌ను అరెస్టు చేశారు.

ధాన్యం, బియ్యం స్వాధీనం చేసుకున్నాం : విజిలెన్స్ డీఎస్పీ
చినపాండ్రాక శ్రీ జయలక్ష్మి మోడరన్ రైస్‌మిల్లులో నిర్వహించిన దాడుల్లో అక్రమంగా ఉన్న సుమారు రూ.1.53కోట్లు విలువ చేసే ధాన్యం, బియ్యం స్వాధీనం చేసుకున్నామని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్సుమెంట్ డీఎస్పీ జి.పూర్ణచంద్రరావు పేర్కొన్నారు. తనిఖీల అనంతరం విలేరులతో మాట్లాడుతూ మిల్లులో రేషన్ బియ్యం కొంటున్నారని అందిన ముందస్తు సమాచారం మేరకు దాడులు నిర్వహించామన్నారు. ఈ మేరకు ఆటోలో దాదాపు 20 బస్తాల్లో ఉన్న 10 క్వింటాళ్ల రేషన్ బియ్యం, మిల్లులో ఉన్న దాదాపు 3800 క్వింటాళ్ల ధాన్యం తదితర సరుకులను స్వాధీనం చేసుకుని బందోబస్తు కోసం స్థానిక రైస్‌మిల్లు యజమానులకు అప్పగించామన్నారు. దీనిపై కేసు నమోదు చేసి జాయింట్ కలెక్టర్ కోర్టులో నివేదిక అందజేస్తామన్నారు. అరెస్టయిన వారిని, ఆటోను పోలీస్‌స్టేషన్‌లో అప్పగిస్తామన్నారు.

పథకం ప్రకారం దాడి చేశారు
అధికారులు కావాలనే తమను అల్లరి చేయడానికి ఆటోలో బియ్యం తెచ్చి దాడులు చేశారని శ్రీ జయలక్ష్మి మోడరన్ రైస్‌మిల్లు యజమాని జిల్లేపల్లి రవికిషోర్ ఆరోపించారు. సుమారు  ఉదయం 6.30గంటల సమయంలో లారీ కాటా వేసుకునేందుకు ఆటో వచ్చిందన్నారు. ఆటో వెనుక వచ్చిన విజిలెన్స్ పోలీసులు ఆటోలో ఉన్న బస్తాలను దించారన్నారు. ఏంటని అడిగితే సమాధానం చెప్పకుండా ఏంలేదని మా అధికారులు వచ్చి కేసు పరిష్కరిస్తారని చెప్పారన్నారు.
తాము లెవీ బియ్యం ఆడుతుండగా రేషన్ బియ్యం కొనే వీలు లేదన్నారు. అధికారులు, కొంత మంది వ్యక్తులు కలసి తమని కేసులో ఇరికించడానికి పథకం వేశారని రవి ఆరోపించారు. ఈ ఆరోపణలను డీఎస్పీ పూర్ణచంద్రరావు ఖండించారు. చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు వ్యాపారి అబద్ధం చెబుతున్నారని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement