
వరి, చిరుధాన్యాలు పండించే రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాలను అయినకాడికి అమ్మేసుకుంటే మిగిలేది అరకొర లాభాలు లేదా నికర నష్టాలే! అవే ధాన్యాలను కొని, మరపట్టించి అమ్ముకునే వ్యాపారులు బాగుపడతారు. రైతే ఈ పని కూడా చేసుకుంటే నికరంగా లాభాలు పొందడానికి అవకాశం ఉందని రుజువు చేసే విజయగాథలు ఎక్కడ వెతికినా కనిపిస్తాయి. అయితే, మన దేశంలో వ్యవసాయం చేసే వారిలో 80–90 శాతం మంది చిన్న, సన్నకారు రైతులు లేదా కౌలు రైతులే. ధాన్యాలను పండించి అలాగే అమ్మేసుకోవటం వల్ల రావాల్సినంత ఆదాయం రావటం లేదు.
ఇటువంటి రైతుల నికరాదాయం పెరగాలంటే ధాన్యాన్ని బియ్యంగా మార్చి అమ్మాలి. పెద్ద రైస్ మిల్లులు చాలా దూరంలో ఉంటాయి. రవాణా ఖర్చు ఎక్కువ అవుతుంది. కాబట్టి అంత లాభదాయకం కాదు. వారికి కావాల్సింది చిన్న రైస్ మిల్లు. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే చిన్న మిల్లులు కావాలి. విద్యుత్తు కట్ ఎక్కువగా ఉంటుంది ఆ ప్రాంతాల్లో. అందుకే వారికి కావాల్సింది సౌర విద్యుత్తుతో నడిచే చిన్న/మధ్య తరహా రైస్ మిల్లు!
చిన్న, సన్నకారు రైతుల ఆదాయం పెంచడానికి ఇదొక్కటే మార్గమని సరిగ్గా గుర్తించిన బెంగళూరుకు చెందిన ‘సెమా ఆల్టో’ అనే వ్యాపార సంస్థ సౌర విద్యుత్తుతో నడిచే చిన్న రైస్ మిల్లును, ఇతర అనుబంధ యంత్రాలను రూపొందించింది. సెల్కో ఫౌండేషన్ సహకారంతో రైతులకు అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే 150 సౌర విద్యుత్తుతో నడిచే చిన్న రైస్ మిల్లులను దక్షిణాది రాష్ట్రాల్లో నెలకొల్పి సత్ఫలితాలు సాధిస్తోంది. సౌరశక్తితో పనిచేసే ఆవిష్కరణలతో వ్యవసాయోత్పత్తుల వ్యాపార చిత్రంలో గుణాత్మక మార్పునకు దోహదం చేస్తోందీ సంస్థ. సోలార్ మినీ రైస్ మిల్లుల ద్వారా రైతులకు (ధాన్యం: బియ్యం నిష్పత్తి) నికర బియ్యం దిగుబడి 30 శాతం పెరిగింది. ఆదాయం రెట్టింపైందని సెమ ఆల్టో చెబుతోంది. ప్రకృతిని కలుషితం చేయని సౌర విద్యుత్తు ద్వారా ఈ సంస్థ గ్రామీణ జీవనోపాధిని విజయవంతంగా పునర్నిర్మిస్తోంది.
2017లో ప్రారంభం
‘సెమ(ఎస్‌ఈఎంఏ)’ అంటే ‘సోలార్ పవర్డ్ ఎఫిషియంట్ మెషినరీ ఫర్ అగ్రికల్చర్’. వరి ధాన్యం, చిరుధాన్యాలను మరపట్టటం, బియ్యాన్ని మార్కెట్‌కు అందించడానికి అవసరమైన అనేక పనులు చెయ్యటం ఒక్క యంత్రంతో అవ్వదు. ధాన్యాలను శుభ్రపరచటం, మర పట్టటం, పాలిష్ చెయ్యటం, గ్రేడింగ్ వరకు మొత్తం 4 వేర్వేరు యంత్రాలు అందుకు కావాలి. వీటన్నిటినీ సెమ ఆల్టో సంస్థ రూపొందించింది.
సౌరశక్తితో పనిచేసే మల్టీ–స్టేజ్ మినీ మిల్లు ఎండ్–టు–ఎండ్ బియ్యం ప్రాసెసింగ్‌ను నిర్వహిస్తోంది. 3.7–5 కిలోవాట్ల విద్యుత్తుతో ఇది నడుస్తుంది. 2017లో బెంగళూరులో అసద్ జాఫర్ ఈ కంపెనీని ప్రారంభించారు. తక్కువ ఖర్చుతో గ్రామీణులు తమ వ్యవసాయోత్పత్తులను రూపం మార్చి అధిక ధరకు విక్రయించుకునే మార్గాన్ని సుగమం చెయ్యటమే ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో ఇప్పటికే సెమ రైస్ మిల్లులు 150 యూనిట్ల వరకు ఏర్పాటయ్యాయి.
65% రికవరీ రేటు
పాతకాలపు డీజిల్‌తో నడిచే పెద్ద రైస్ మిల్లుల్లో 500 కిలోల ధాన్యాన్ని మరపట్టిస్తే 275–300 కిలోల బియ్యం వస్తే, ఇప్పుడు అది 320–350 కిలోలకు పెరిగింది. ఈ సోలార్ మినీ రైస్ మిల్లు ఏర్పాటు చేసుకోవటం ద్వారా నికర బియ్యం దిగుబడి 30% పెరిగింది. రవాణా ఖర్చులు తగ్గాయి. ఆదాయం రెట్టింపైంది. పదెకరాల్లో వరి పండించినా అప్పట్లో నా కుటుంబాన్ని పోషించుకోవటానికి కూడా ఆదాయం సరి΄ోయేది కాదు. ఇప్పుడు ఈ మిల్లుతో బియ్యం నాణ్యత, రికవరీ రేటు, ఆదాయం పెరిగింది..’ అని తమిళనాడుకు చెందిన సేంద్రియ వరి రైతు గోపి చెబుతున్నారు.
సోలార్ మినీ రైస్ మిల్లులో 100 కిలోల ధాన్యాన్ని మరపట్టిస్తే 65 కిలోల బియ్యం రైతుల చేతికి వస్తున్నాయి. మిల్లు సామర్థ్యం మెరుగ్గా ఉండటం వల్ల రైతులకు ఎక్కువ బియ్యం వస్తున్నాయి, వృథా తగ్గింది. ధాన్యాన్ని కిలో రూ. 45–50కి అమ్మే రైతు గోపి ఇప్పుడు సోలార్ రైస్ మిల్లులో మరపట్టి బియ్యాన్ని రూ. 80–100లకు కిలో అమ్ముతున్నారు. తద్వారా ఆదాయం రెట్టింపైందని గోపి తెలిపారు. వరి ధాన్యంతోపాటు చిరుధాన్యాలు, మొక్కజొన్నలు, గోధుమలను కూడా సౌర రైస్ మిల్లుల్లో మరపట్టే అవకాశం ఉండటం విశేషం.
సోలార్ రైస్ మిల్లులను రైతుల దగ్గరకు తీసుకెళ్లే కృషిలో సీఈఈడబ్లు్య, విల్‌గ్రో సంస్థలతో కలసి సెమ ఆల్టో పనిచేస్తోంది. ఆస్తిపాస్తులు లేని పేద రైతులకు రుణ సదుపాయం కల్పించడం ద్వారా అందుబాటు బడ్జెట్‌లో ఈ మిల్లులను అందిస్తున్నారు. ప్రధాన మంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్‌ప్రైజెస్ స్కీమ్ వంటి ప్రభుత్వ పథకాలతో ఇటువంటి యంత్రాలను అనుసంధానం చేయగలిగితే రుణ సంబంధిత సబ్సిడీలను గ్రామీణ చిరువ్యాపారులకు అందించటం సాధ్యమవుతుందని ఆశిస్తున్నారు.