సన్నగా బియ్యం.. తిన్నగా నల్లబజార్‌కు! | Hyderabad Ration Rice Scam: Dealers Push Cash Instead of Free Fine Rice to Beneficiaries | Sakshi
Sakshi News home page

సన్నగా బియ్యం.. తిన్నగా నల్లబజార్‌కు!

Sep 10 2025 8:53 AM | Updated on Sep 10 2025 11:22 AM

Illegal Ration Rice Danda in Hyderabad

పాతబస్తీకి చెందిన మహమూద్‌కు కొత్త రేషన్‌ కార్డు మంజూరైంది. సెప్టెంబర్ నెలవారీ రేషన్‌ కోటా విడుదలైంది. రేషన్‌ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ జరుగుతుండటంతో కోటా డ్రా చేసి తెచ్చుకునేందుకు డీలర్‌ వద్దకు హుషారుగా వెళ్లాడు. కార్డు నెంబర్‌ చెప్పి ఈ–పాస్‌ యంత్రంపై బయోమెట్రిక్‌ పెట్టాడు. కార్డులో నలుగురు సభ్యులు ఉండటంతో 24 కిలోల బియ్యంపై తీసుకొవచ్చని భావించాడు. కానీ, డీలరు అందరి మాదిరిగానే నగదు కావాలా? బియ్యం కావాలా? అడిగాడు. అలోచిస్తున్న లోపే ‘బియ్యం వండుకొని తినలేరు. ముద్దముద్ద అవుతుంది. వృథా ఎందుకు? నగదు తీసుకోండి’అంటూ కిలోకు రూ.12ల చొప్పున లెక్కకట్టి రూ.288 చేతిలో పెట్టాడు. నెలవారీ కోటా డ్రా కోసం వచ్చిన మిగతా కార్డుదారుల్లో మెజార్టీ పరిస్థితి ఇదే. చేసేదేమీ లేక చేతిలో పెట్టిన నగదును జేబులో పెట్టుకొని ఇంటిముఖం పట్టక తప్పడంలేదు. ఇలాంటి ఉదంతాలు ప్రతిరేషన్‌ షాపులో నిత్యకృత్యం.

సాక్షి, హైదరబాద్‌: ఇది రేషన్‌ బియ్యం కథ.. బియ్యం మారినా డీలర్ల తీరు మారలేదు. అదే చేతివాటం.. అదే తప్పుదారి.. సాక్షాత్తు రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ప్రభుత్వ చౌకధరల దుకాణాల ద్వారా పంపిణీ చేస్తున్న ‘ఉచిత సన్న బియ్యం’నగదు దందా బాహాటంగా కొనసాగుతోంది. ఆహార భద్రత (రేషన్‌) కార్డుదారులు సన్న బియ్యంపై కూడా అనాసక్తి కనబర్చడం డీలర్లకు కలిసివస్తోంది. కొందరు కార్డుదారులు ఈ–పాస్‌ యంత్రంపై బయోమెట్రిక్‌ (వేలిముద్ర) పెట్టి నెలవారీ బియ్యం కోటాను డీల్లకు అప్పగించి నగదు పుచ్చుకోవడం, డీలర్లు కూడా కిలో ఒక్కంటికి రూ.12ల చొప్పున లెక్క కట్టి నగదు అందించడం సర్వసాధారణమైంది. 

సన్నబియ్యంపై కూడా.. 
పూట గడవని అత్యంత నిరుపేద కుటుంబాలు మినహా మిగతా కుటుంబాలు పీడీఎస్‌ బియ్యం వండుకొని తినడానికి పెద్దగా ఆసక్తి కనబర్చరు. మొన్నటి వరకు బియ్యం దొడ్డుగా, నాసిరకం, ముక్కి పోయి ఉండటం, వండి తిన్న తర్వాత జీర్ణం కాకపోవడం లాంటి కారణాలతో పెద్దగా ఆసక్తి కనబర్చేవారు కాదు. కొన్ని కుటుంబాలు మాత్రం రేషన్‌ బియ్యాన్ని కేవలం ఇడ్లీ, దశలు, పిండి వంటలకు వినియోగిస్తున్నారు. ప్రతినెలా ఉచితంగా అందుతుండటం, అవసరానికి మించి వస్తుండటంతో డీలర్లకు అప్పగిస్తూ వచ్చేవారు. తాజాగా సన్నబియ్యం పంపిణీ జరుగుతున్నా లబి్ధదారులను డీలర్లు తప్పుదోవ పట్టిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. 

ఒక యూనిట్‌ బియ్యమే... 
కొందరు కార్డుదారులు తమ నెలవారీ కోటాలో ఒక యూనిట్‌ బియ్యమే తీసుకొని మిగతా యూనిట్ల కోటాను డీలర్ల వద్ద నగదు రూపంలో బదిలీ చేసుకుంటున్నారు. వాస్తవంగా ప్రభుత్వ చౌకధరల దుకాణాల్లో ఈ–పాస్‌ (బయోమెట్రిక్‌) అమలు కంటే ముందు రేషన్‌ డీలర్లు చేతివాటం ప్రదర్శించి డ్రా చేయని లబి్ధదారుల సబ్సిడీ సరుకులు గుట్టుచప్పుడు కాకుండా బ్లాక్‌ మార్కెట్‌కు తరలించి సొమ్ము చేసుకునేవారు. సంస్కరణలో భాగంగా ఈ– పాస్‌ అమలుతో లబ్ధిదారులు బయోమెట్రిక్, ఐరిస్, ఓటీపీ తప్పనిసరి కావడంతో డీలర్లు లబి్ధదారుల ప్రమేయంతో చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు.  

పౌరసరఫరాల శాఖ అధికారుల నిర్లక్ష్యం  
పీడీఎస్‌ బియ్యం అక్రమ దందాకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. అడపాదడప విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్, పోలీసుల దాడుల్లో పీడీఎస్‌ బియ్యం క్వింటాళ్ల కొద్దీ పట్టుబడుతోంది. స్పెషల్‌ డ్రెవ్‌ సమయంలో బియ్యం వ్యాపారులు ఎక్కడి దొంగలు అక్కడే గప్‌చుప్‌గా.. మౌనం దాల్చుతున్నారు. అ తర్వాత తిరిగి దందాను కొనసాగించడం సర్వసాధారణంగా మారింది.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement