మా వెతలు తీర్చండి మహాప్రభో

victims gives letter to collector - Sakshi

గ్రీవెన్స్‌లో అర్జీదారుల ఆవేదన

కొరిటెపాడు(గుంటూరు): సమస్యల పరిష్కారం కోసం అధికారులకు వినతిపత్రాలు సమర్పించినా మా వెతలు తీరడం లేదని అర్జీదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో నిర్వహించిన మీ కోసం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు జిల్లా నలుమూలల నుంచి అధిక సంఖ్యలో అర్జీదారులు తరలివచ్చారు. జిల్లా కలెక్టర్‌ కోన శశిధర్, జాయింట్‌ కలెక్టర్‌ కృతికా శుక్లా, జాయింట్‌ కలెక్టర్‌–2 ముంగా వెంకటేశ్వరరావు, డీఆర్‌వో నాగబాబు తదితరులు వినతి పత్రాలను స్వీకరించారు.

బీటీ విత్తనాలతో నష్టపోయాం..
జిల్లాలో బీటీ పత్తి విత్తనాలు వేసి పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలంటూ సీపీఐ, ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో సోమవారం చలో కలెక్టరేట్‌ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో నిర్వహించిన మీ కోసం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్‌ కోన శశిధర్‌కు వినతిపత్రం అందజేశారు.
 

ఏ రుణమైనా ఆన్‌లైన్‌లో  దరఖాస్తు చేసుకోవాల్సిందే..
ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీ, కాపు, బ్రాహ్మణ కార్పొరేషన్‌ల ద్వారా రుణాలు పొందగోరు అభ్యర్థులు మీ సేవ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ కోన శశిధర్‌ సూచించారు. జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో సోమవారం జరిగిన మీ కోసం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో రుణాల కోసం అర్జీలను ఇస్తున్న అభ్యర్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. జిల్లా నలుమూలల నుంచి అనేక మంది ఫిర్యాదుదారులు మీ సేవలో దరఖాస్తు చేసుకునే విధానం తెలియక గుంటూరు జిల్లా కేంద్రానికి వచ్చి మీ కోసం కార్యక్రమంలో దరఖాస్తులు ఇస్తున్నారని, ఏ ప్రాంతం వారు ఆ ప్రాంతంలోని మీ సేవలో ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం నిర్దేశించిన గడువు ముగిసిందని, 2018–19 ఆర్థిక సంవత్సరానికి వచ్చే జూన్‌ మాసంలో ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉంటుందని తెలిపారు. ఏ రుణం కావాల్సినా కూడా ఆన్‌లైన్‌ ద్వారా మీ సేవలో దరఖాస్తు చేసుకోవాలని ఆయన స్పష్టం   చేశారు.
 

సైనికుడి కుటుంబానికి ఊరట
తెనాలి: 1965 ఇండో–పాకిస్తాన్‌ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయి, ప్రభుత్వ నిరాదరణతో నైరాశ్యంలో ఉన్న  సైనికుడి కుటుంబానికి ‘మీకోసం’లో కొంత ఊరట కనిపించింది. గుంటూరులో జిల్లా కలెక్టర్‌ కోన శశిధర్‌ అధ్యక్షతన సోమవారం జరిగిన సమావేశంలో తెనాలికి చెందిన వృద్ధురాలు తోట వెంకాయమ్మ, సుదీర్ఘకాలంగా తమ పట్ల ప్రభుత్వం చూపుతున్న నిరాదరణ, తమ ఆవేదనను తెలియజేస్తూ అర్జీనిచ్చారు. తన నలుగురు కుమారుల్లో ఒకరైన తోట వీరనాగప్రసాద్‌ ఆర్మీలో పనిచేస్తూ 1965లో పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధంలో వీరమరణం పొందారు. 1966లో ప్రభుత్వం చినగంజాంలో వర్షాధారమైన 2.5 ఎకరాల (సర్వే నెం.701/1) భూమిని వీరసైనికుడి తల్లి వెంకాయమ్మ పేరిట కేటాయించింది. కొంతకాలానికి మళ్లీ తీసేసుకుంది. మరోచోట ఇచ్చినట్టే ఇచ్చి, మళ్లీ తీసేసుకుని వేరొక చెరువు భూమిని కేటాయించారు. కోర్టు వివాదంతో ఆ భూమీ దక్కలేదు. ప్రత్యామ్నాయంగా వేరొకచోట భూమిని ఇవ్వాల్సిన ప్రభుత్వం ఇన్నేళ్లుగా పట్టించుకోలేదు. వెంకాయమ్మ భర్త 30 ఏళ్ల క్రితమే మరణించారు. అప్పట్నుంచి బిడ్డల దగ్గర ఉంటూ వస్తోంది. దీనిపై విచారించిన కలెక్టర్‌ జిల్లాలో అనువైన భూమి అన్వేషణ కోసం చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా రెవిన్యూ అధికారికి అప్పగించినట్టు ఆమె కుమారుడు హనుమంతరావు చెప్పారు.
 

రైతులకు పరిహారం చెల్లించాలి
ఖరీఫ్‌ సీజన్‌లో నాగార్జునసాగర్‌ కుడి కాలువకు నీరు రాకపోవటంతో మాగాణి భూముల్లో కంది పంటను సాగు చేశాం. గత మూడేళ్లగా ప్రభుత్వం ప్రోత్సహించి ఏపీ సీడ్స్‌ ద్వారా సబ్సిడీ కంది విత్తనాలు సరఫరా చేస్తుంది. ఆ విత్తనాలను తీసుకుని కందిపంట సాగు చేస్తున్నాం. ఈ ఏడాది మండలంలో సుమారు 3 వేల ఎకరాల్లో వైరస్‌ సోకి గూడ, పూత లేకుండా చెట్టు ఏపుగా పెరిగింది. ఇప్పటివరకు కౌలు కాకుండా ఎకరాకు రూ.10 వేలు పెట్టుబడి పెట్టాము. కానీ పంట పూర్తిగా దెబ్బతిని, కాయలు లేవు. ఉన్నతాధికారులు స్పందించిఎకరాకు రూ.10 వేలు నష్టపరిహాం చెల్లించి ఆదుకోవాలి.
– ముండ్రు వెంకట్రావు, తైదల కృపారావు, సోమేపల్లి వీరాంజనేయులు, మోహన్‌చంద్, భువనగిరి వెంకటేశ్వర్లు, శావల్యాపురం మండలం, పిచుకులపాలెం, మతుకుమల్లి, బొందిలపాలెం గ్రామాల రైతులు
 

సామాజిక భద్రతా పింఛన్లు మంజూరు చేయాలి
గురజాల మండలం, అంబాపురం గ్రామానికి సామాజిక భద్రతా పింఛన్లు 16 మంజూరయ్యాయి. ఆ 16 పింఛన్లుకు గ్రామంలో ఉన్న 6గురు జన్మభూమి కమిటీ సభ్యుల్లో 4గురు సభ్యులు ఆమోదం తెలిపారు. అర్హులను గుర్తించి పింఛన్ల దరఖాస్తు ఫారాలను పూర్తి చేసి గ్రామ పంచాయితీ కార్యదర్శికి ఐదు నెలల క్రితం అందజేశాం. కానీ ఇంతవరకు ఆన్‌లైన్‌లో పొందుపరచలేదు. తాము ఆమోదం తెలిపిన పేర్లు పంపకుండా రాజకీయ ఒత్తిడితో వేరే పేర్లు మంజూరు చేసేందుకు పంచాయితీ కార్యదర్శి, ఎంపీడీవో ప్రయత్నం చేస్తున్నారు. తాను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎస్సీసర్పంచిని అనే కించపరుస్తూ ఈ విధంగా వ్యవహరిస్తున్నారు. విచారణ జరిపి అర్హులకు పింఛన్లు మంజూరు చేయాలి.
– ఎం.పార్వతి, అంబాపురం సర్పంచి, ఎం.రమణ, అల్లూరి రాములమ్మ, అర్లి లక్ష్మీ, పింఛన్ల బాధితులు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top