
కొరిటెపాడు (గుంటూరు): గుంటూరు నగరంలోని నగరంపాలెం ప్రాంతంలో ఉన్న స్థలం ఆర్థిక లావాదేవీల విషయంలో గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు (టీడీపీ) బావమరిదినంటూ బెదిరించి బలవంతంగా సంతకాలు చేయించుకుని, రూ.3 కోట్లు డిమాండ్ చేస్తున్నాడని బాధిత మహిళ గడ్డం ప్రసన్న లక్ష్మి సోమవారం జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై విలేకరులతో మాట్లాడుతూ తాను చారిటబుల్ ట్రస్ట్ ద్వారా గ్రామీణ పేదలకు పలు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
తన బంధువులకు చెందిన నగరంపాలెంలోని ఒక స్థలాన్ని నగరానికి చెందిన పచ్చిపులుసు రామనాథం అనే వ్యక్తికి విక్రయించామని, ఈ స్థలం విక్రయం విషయంలో వివాదం తలెత్తడంతో కోర్టు ఉత్తర్వుల ద్వారా కొనుగోలుదారుడు స్థలాన్ని హస్తగతం చేసుకున్నారన్నారు. అయితే ఈ విషయంలో గత జూన్‌లో చిరుమామిళ్ల వెంకటేశ్వరరావు అనే వ్యక్తి తాను గురజాల ఎమ్మెల్యే బంధువునంటూ తనను ఆయన ఆఫీసుకు పిలిపించి అక్రమంగా బంధించి ఖాళీ చెక్కులు, స్టాంప్ పేపర్‌లు, ప్రామిసరీ నోట్లపై సంతకాలు తీసుకున్నారన్నారు. వారు డిమాండ్ చేసిన డబ్బు కట్టలేనని చెబుతున్నా చంపుతానంటూ తనపై దౌర్జన్యం చేశారని వాపోయారు. ఈ విషయంలో డీజీపీకి ఫిర్యాదు చేస్తే జిల్లా పోలీసులకు సిఫార్సు చేశారని, అయినా తనకు న్యాయం జరగడం లేదని ఆరోపించారు.