తిరుమలలో అన్యమత ప్రచారంపై స్పందించిన వెల్లంపల్లి

Vellampalli Srinivas Press Note About Non Hindu Campaign In Tirumala - Sakshi

సాక్షి, తిరుమల: తిరుమలలో బస్‌ టిక్కెట్లపై అన్యమత ప్రచార ఉదంతంపై దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ స్పందించారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రెస్‌ నోట్‌ వెలువరించారు. తిరుపతి నుంచి తిరుమల వెళ్లే బస్సు టిక్కెట్లపై అన్యమత ప్రచారం చేస్తున్నారంటూ వస్తోన్న ఆరోపణలపై విచారణకు ఆదేశించామని తెలిపారు. టిక్కెట్ల టెండర్‌ టీడీపీ హయాంలోనే ఖరారైనట్లు తెలిసిందన్నారు. చంద్రబాబు పేరుతో పథకాలను ప్రచారం చేసేందుకు ఈ కాంట్రాక్టు ఇచ్చారని తెలిపారు. 2018 లోనే ఈ ప్రక్రియ మొత్తం పూర్తయ్యిందన్నారు.

గతంలో టీడీపీ ప్రభుత్వం 60 వేల టిమ్ పేపర్లపై మైనారిటీ సంక్షేమ శాఖ ప్రకటనలు వేయాలని మార్వెన్ క్రియేటివ్ సర్వీసెస్‌కు కాంట్రాక్టు ఇచ్చిందని  వెల్లంపల్లి తెలిపారు. టిమ్ పేపర్లపై చంద్రబాబు పేరుతో పథకాల ప్రచారం చేశారని పేర్కొన్నారు. నూతన ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు పూర్తవుతున్నా ఏపీఎస్‌ ఆర్టీసీ చంద్రబాబు భజన మానలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాక నెల్లూరు డిపోలో ఉండాల్సిన టికెట్లు నిబంధనలకు విరుద్ధంగా తిరుమల డిపోకు వెళ్లినట్లు అధికారులు గుర్తించారని తెలిపారు. ఇందుకు బాధ్యులైన అధికారులు, సంస్థలపై చర్యలకు రంగం సిద్ధం చేస్తోన్నట్లు వెల్లడించారు.

రాష్ట్రంలో ఏం జరిగినా దాన్ని ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఆపాదిస్తూ ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రతిపక్షం ప్రయత్నిస్తుందని వెల్లంపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని టీవీ ఛానెళ్లు కూడా ఈ వ్యవహారాన్ని పెద్దది చేసేందుకు ప్రయత్నిస్తూ.. శ్రీవారి భక్తుల మనోభావాలు గాయపరిచి.. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని కుట్ర పన్నుతున్నాయని మండి పడ్డారు. సదరు వ్యక్తులు, మీడియా సంస్థలపై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

40 దేవాలయాలను కూలగొట్టించినది, సదావర్తి భూములు కాజేసినది, కనకదుర్గమ్మ గుడిలో, కాళహస్తిలో క్షుద్ర పూజలు చేయించినది.. అమ్మవారి భూముల్ని తన వారికి లీజులు ఇచ్చినది తెలుగు దేశం ప్రభుత్వమే అన్నారు. హిందుత్వం మీద చంద్రబాబు చేయని అరాచకాలున్నాయా అని వెల్లంపల్లి ప్రశ్నించారు. తిరుపతిలో కిరీటాల దొంగతనం మొదలు.. శ్రీవారి బంగారాన్ని లారీల్లో తరలించడం వరకు అన్ని దుర్మార్గాలు చేసిన ఏకైక వ్యక్తి చంద్రబాబేనని ఆరోపించారు. కాబట్టే బాబు ఆ దేవదేవుడి ఆగ్రహానికి గురయ్యారని విమర్శించారు. ఇంతా జరిగినా చంద్రబాబుకు బుద్ధి, జ్ఞానం రాలేదని అర్థమవుతోందంటూ ఎద్దేవా చేశారు. మతాలన్నీ అక్కున చేర్చుకున్నందువల్లే జగన్‌ సీఎం అయ్యారు.. మతాలన్ని ఛీకొట్టబట్టే చంద్రబాబు అందరికి దూరమయ్యారని స్పష్టం చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top