వెలిచేరులో రంగా విగ్రహం ధ్వంసం

Vangaveeti Mohana Ranga Statue Brokened In East Godavari - Sakshi

రోడ్డుపై బైఠాయించిన  ఆందోళనకారులు

భారీగా మోహరించిన పోలీసులు

తూర్పుగోదావరి ,ఆత్రేయపురం: గుర్తు తెలియని వ్యక్తులు మంగళవారం అర్ధరాత్రి సమయంలో వెలిచేరు సెంటర్‌లో నూతనంగా ఏర్పాటు చేస్తున్న వంగవీటి మోహన్‌రంగా విగ్రహాన్ని ధ్వంసం చేశారు. పోలీసు జాగిలాలు గుర్తుపట్టకుండా విగ్రహం చుట్టూ కారం చల్లారు. విగ్రహం మెడ భాగం నుంచి తలను వేరు చేసేందుకు విఫలయత్నం చేశారు. బుధవారం తెల్లవారు జామున విగ్రహాన్ని గమనించిన స్థానికులు ఆందోళనకు దిగారు. కాపు సంఘం నాయకులు వెలిచేరు గ్రామానికి చేరుకుని రోడ్డుపై బైఠాయించి దోషులను అరెస్టు చేయాలని ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న రావులపాలెం సీఐ పెద్దిరాజు, ఆత్రేయపురం ఎస్సై నాగార్జునరాజు తమ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని పరీస్థితిని సమీక్షించారు. ఇంతలో ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని దోషులు ఎంతటివారైనా వదలొద్దని పోలీసులను ఆదేశించారు. దోషులు ఎంతటి వారైనా వదిలి పెట్టవద్దని పోలీసులను ఆదేశించారు. ఇతరుల మనోభావాలను దెబ్బతీసేలా ఎవరు ప్రయత్నించినా ఉపేక్షించేది లేదన్నారు. కులాల వారీగా కాకుండా మహానుభావులను అందరూ స్మరించుకునేందుకే విగ్రçహాలను ఏర్పాటు చేస్తారని, వాటిని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.

అతి త్వరలో రంగా నూతన విగ్రహాన్ని ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఇలాంటి ఘాతుకానికి పాల్పడిన వారికి పడే శిక్షను చూస్తే మరెవరైనా భవిష్యత్‌లో ఇలాంటి నేరం చేయాలంటే భయపడే పరిస్థితి నెలకొనేలా చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. గతంలో మెర్లపాలెంలో విగ్రహం ధ్వంసానికి సంబంధించి సీసీ టీవీ ఫుటేజీ ఉన్నా నేటికీ ఆ కేసు కొలిక్కిరాలేదన్నారు. అలాగే వెలిచేరు గ్రామంలో అంబేడ్కర్‌ విగ్రహం, ఉచ్చిలిలో రంగా విగ్రçహాలు ధ్వంసం వల్ల గొడవలు పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులు పూర్తి స్థాయిలో దోషులను పట్టుకుని శిక్షించడంలో విఫలమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరితగతిన ఇలాంటి కేసుల్లో దోషులను పట్టుకుంటే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉంటాయని అదశగా చర్యలు తీసుకోవాలని పోలీసులను జగ్గిరెడ్డి కోరారు.

అలాగే కాంగ్రెస్‌పార్టీ నియోజక వర్గ ఇన్‌చార్జి ఆకుల రామకృష్ణ, ప్రముఖ పారిశ్రామికవేత్త బండారు శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనందరావు తనయుడు సంజీవ్‌ తదితరులు మాట్లాడుతూ తెలుగుజాతికి వంగవీటి మోహన్‌రంగా ఎన్నో సేవలు చేశారని, అలాంటి మహానేత విగ్రహన్ని ధ్వంసం చేయడం అమానుషమన్నారు. జరిగిన ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి దోషులను కఠినంగా శిక్షించేందుకు చర్యలు తీసుకుంటామని సీఐ పెద్దిరాజు, తహసీల్దారు వరదా సుబ్బారావు ఆందోళనకారులకు హామీ ఇచ్చారు. వివిధ పార్టీల నాయకులు, మండల వైఎస్సార్‌సీపీ కన్వీనర్‌ కనుమూరి శ్రీనివాసరాజు, జెడ్పీటీసీ మద్దూరి సుబ్బలక్ష్మి, ఏఎంసీ చైర్మన్‌ వేగేశ్న చంద్రరాజు, రావులపాలెం ఎంపీపీ కోటచెల్లయ్య, ప్రముఖ న్యాయవాది పెద్దింటి వేణుగోపాల్, వైఎస్సార్‌సీపీ నాయకులు కునాధరాజు రంగరాజు, శ్రీనివాసరాజు, ఎంపీటీసీ వేముల నాగలక్ష్మి,  గాదిరాజు రామకృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top