సీఎం ప్రతిపాదన ఉత్తరాంధ్రకు వరం | Uttarandhra Development Committee Discussion Forum | Sakshi
Sakshi News home page

సీఎం ప్రతిపాదన ఉత్తరాంధ్రకు వరం

Jan 19 2020 7:57 AM | Updated on Jan 19 2020 7:57 AM

Uttarandhra Development Committee Discussion Forum - Sakshi

విశాఖను ఎగ్జిక్యూటివ్‌ రాజధాని చేయాలన్న ప్రతిపాదనకు సంఘీభావం తెలుపుతున్న ఉత్తరాంధ్ర మేధావులు, పారిశ్రామిక వేత్తలు

అల్లిపురం(విశాఖ దక్షిణ): రాష్ట్రానికి పరిపాలనా రాజధానిగా ఉండే అన్ని అర్హతలు విశాఖపట్నానికే ఉన్నాయని మేధావులు, పారిశ్రామిక వేత్తలు స్పష్టం చేశారు. తక్షణమే రాజధాని ఏర్పాటు చేసుకునేందుకు కావాల్సిన 5 లక్షల చదరపు అడుగుల నిర్మాణాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. పరిపాలన వికేంద్రీకరణతో రాష్ట్రం సమగ్రాభివృద్ధి చెందుతుందన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మూడు రాజధానుల ప్రతిపాదనకు తమ వంతు మద్దతు ఉంటుందన్నారు. రాజకీయాలకు అతీతంగా ఈ తీర్మానం చేస్తున్నామని వారు స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి సమితి ఆధ్వర్యంలో శనివారం అల్లిపురంలోని ఓ హోటల్‌లో మేధావులు, పారిశ్రామిక వేత్తలు, పలు రంగాలకు చెందిన ప్రముఖులతో ‘విశాఖ ఎగ్జిక్యూటివ్‌ రాజధాని–సీఎం ప్రతిపాదన’కు మద్దతుగా చర్చ జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశాఖపట్నంకాస్మోపాలిటన్‌ నగరంగా ఇప్పటికే అభివృద్ధి చెందిందన్నారు. కానీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు కొంతమంది నాయకులు విశాఖపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

 ‘విశాఖ ప్రజలు సౌమ్యులు.. ఎవరినీ ఏమీ అడగరు.. ఎవరు వచ్చినా స్వాగతించి.. ఆదరించి అన్నం పెడతారు’అని అన్నారు. బౌద్ధ భిక్షువులకు, వ్యాపార నిమిత్తం వచ్చిన ఎందరికో అన్నం పెట్టిన నేల ఉత్తరాంధ్ర అని కొనియాడారు. పావురాల కొండ, తొట్ల కొండ, బొజ్జన్నకొండ వంటి 12 బౌద్ధారామాలు కలిగిన కొండలు విశాఖ పరిసర ప్రాంతాల్లో ఉన్నాయన్నారు. గొప్ప చరిత్ర కలిగిన విశాఖకే పరిపాలనా రాజధానిగా ఉండే అర్హత ఉందని వక్తలు నొక్కివక్కాణించారు. పరిపాలన వికేంద్రీకరణ వల్ల రాష్ట్రం సమగ్రాభివృద్ధి చెందుతుందన్నారు. అమరావతి పేరుతో ఆందోళన చేస్తున్న వారు రైతులు కారని, నిజమైన రైతులు 150 కిలోమీటర్ల దూరం వెళ్లి కూలి పనులు చేసుకుంటున్నారని ఓ అధ్యయనంలో తేలిందన్నారు. రైతుల పేరుతో దీక్షలు, ధర్నాలు చేసి రాష్ట్ర అభివృద్ధిని చంద్రబాబు అడ్డుకుంటున్నాడని ఆరోపించారు. ఉత్తరాంధ్ర వాసులకు రాజధాని ఎందుకని పదే పదే మాట్లాడటం ఆందోళనకు గురి చేస్తోందన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు తన వైఖరిని మార్చుకుని మూడు రాజధానులకు మద్దతివ్వాలని కోరారు. ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా, వారి వాక్కును వినిపించేందుకుగానూ.. రాజకీయాలకు అతీతంగా ఉత్తరాంధ్ర అభివృద్ధి సమితిని ఏర్పాటు చేసినట్లు కన్వీనర్‌ పీవీ సాంబమూర్తి తెలిపారు.  

విభజన చట్టంలో అంశాలను టీడీపీ అనుసరించలేదు 
విభజన చట్టంలోని అంశాలను టీడీపీ ప్రభుత్వం అనుసరించలేదు. హైదరాబాద్‌ను రాజధానిగా పదేళ్లు మనం ఉపయోగించుకోవచ్చు. అక్కడ ఉండే హక్కును వదులుకుని రాజధాని అభివృద్ధి చేయకుండానే అమరావతికి తరలిరావడం సమంజసం కాదు. కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రాల బాగోగులు చూడాల్సి ఉన్నా పట్టించుకోలేదు. ఇవ్వాల్సిన నిధులు ఇవ్వలేదు. విశాఖను ఎగ్జిక్యూటివ్‌ రాజధానిగా సీఎం చేసిన ప్రతిపాదనను అందరూ స్వాగతించాలి. 
–ఆచార్య సత్యనారాయణ, విశ్రాంత ఆచార్యులు, ఏయూ

ముఖ్యమంత్రి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం 
రాష్ట్రం సమగ్రాభివృద్ధి చెందాలంటే పరిపాలన వికేంద్రీకరణ అవసరం. ఈ విషయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాను. విశాఖ ఒక విశిష్ట నగరం. రాజధానికి కావాల్సిన అన్ని హంగులు, అర్హతలు ఉన్నాయి. ప్రత్యేకంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం లేదు. నేరుగా పరిపాలన జరిపేందుకు అవసరమైన ప్రభుత్వ భవనాలు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతానికి పాలనా పరమైన ఇబ్బందులు లేకుండా, ఖర్చు తగ్గించుకునేందుకు ఇదే మంచి నిర్ణయం. ఈ నిర్ణయాన్ని అందరూ ఆహ్వానించాలి.
– ఆచార్య తిమ్మారెడ్డి 

ధర్నాలు చేస్తోంది నిజమైన రైతులు కాదు 
అమరావతి రాజధాని కావాలని ధర్నాలు చేస్తున్నవారు నిజమైన రైతులు కారు. మా బృందం 15 గ్రామాల్లో 1,500 మంది రైతులను స్వయంగా కలిసి మాట్లాడింది. నిజమైన రైతులు, రైతు కూలీలు రోజూ ఉపాధి నిమిత్తం కిలోమీటర్ల దూరం వెళ్లిపోతున్నారు. ధర్నాల్లో పాల్గొంటున్న వారు దళారులు, భూస్వాములే. వారికి ప్రభుత్వం నష్ట పరిహారం అందజేసింది. నిజమైన రైతులకు విద్యా, ఉపాధి అవకాశాలు లేవు. వారిని ఆదుకుని సరైన న్యాయం చేయాలి. రాజధానికి కావాల్సిన అన్ని అర్హతలు విశాఖకే ఉన్నాయి. 
– ఆచార్య ఎం.వి.రామరాజు, సైకాలజిస్ట్‌  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement