
మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి
సాక్షి, ఉరవకొండ(అనంతపురం) : ఉరవకొండ నియోజకవర్గంలో దౌర్జన్యాలకు, హత్యా రాజకీయాలకు టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ కుటుంబం కేరాఫ్ అడ్రస్ అని, ఇప్పుడు ఫ్యాక్షన్ రాజకీయాలంటూ ఆయన నీతులు చెప్పడం దయ్యాలు వేదాలు వళ్లించినట్లుందని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి విమర్శించారు. ఉరవకొండ మండలం రాకెట్లలో సోమవారం సుంకలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం ఆయన కౌకుంట్ల గ్రామ ప్రజలతో కలిసి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన పయ్యావుల కేశవ్‌పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి కోసం పరిపాలన సౌలభ్యం కోసం పెద్ద కౌకుంట్ల పంచాయతీని విభజించేందుకు పెట్టిన గ్రామసభలో కేశవ్ వ్యవహరించిన తీరు సరైంది కాదన్నారు. ప్రజలు స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను తెలియజేయకుండా ప్రజలను భయపెట్టారన్నారు. దాదాపు 8500 మంది జనాభా ఉన్న పంచాయతీలో కనీసం 1500 మంది కూడా పాల్గొనకపోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.
ఎమ్మెల్యేగా కేశవ్ ఎన్నికే అప్రజాస్వామ్యం అని, కోట్లు ఖర్చుచేసి ప్రలోభాలకు గురిచేసి రిగ్గింగ్‌తో గెలుపొందిన ఆయన ఇప్పుడు ప్రజాస్వామ్యం, అభివృద్ధి గురించి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. ఉరవకొండ నియోజకవర్గంలో గత ఐదు దశాబ్ధాలుగా ఎవరు ఫ్యాక్షన్ రాజకీయాలు చేశారో, ఎవరు ఎవరు ఎవర్ని హత్యలు చేయించారో ప్రజలందరికీ తెలుసున్నారు. కేశవ్ గత ప్రభుత్వంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని అటు అమరావతిలో, ఇటు కియా కార్ల కంపెనీ వద్ద దాదాపు వందల ఎకరాల భూమిని కొనుగోలు చేసిన విషయం వాస్తవం కాదా ? అని ప్రశ్నించారు. గడిచిన ఐదేళ్లలో సాగునీటి ప్రాజెక్టులలో వందల కోట్లు రూపాయలు దోపిడీ చేసిన అతి పెద్ద దోపిడీ దొంగ కేశవ్ అని మండిపడ్డారు. సోమవారం కౌకుంట్లలో ప్రజాస్వామ్యం కచ్చితంగా అపహాస్యం అయిందన్నారు.