జనాగ్రహం | united agitation become severe in Ananthapur district | Sakshi
Sakshi News home page

జనాగ్రహం

Oct 4 2013 3:13 AM | Updated on Sep 1 2017 11:18 PM

కేంద్ర క్యాబినెట్ గురువారం తెలంగాణ నోట్‌కు ఆమోదం తెలుపడంపై జిల్లా ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం 9 గంటల నుంచే టీ నోట్ వెలువడనుందని ఎలక్ట్రానిక్ మీడియాలో కథనాలు రావడంతో జిల్లా అంతటా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

సాక్షి, అనంతపురం: కేంద్ర క్యాబినెట్ గురువారం తెలంగాణ నోట్‌కు ఆమోదం తెలుపడంపై జిల్లా ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం 9 గంటల నుంచే టీ నోట్  వెలువడనుందని ఎలక్ట్రానిక్ మీడియాలో కథనాలు రావడంతో జిల్లా అంతటా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎక్కడికక్కడ ఒక్కసారిగా సమైక్యవాదులు రోడ్డుపైకొచ్చి నిన్నటి వరకు శాంతియుతంగా సాగిన ఆందోళనలు గురువారం మిన్నంటాయి. టీ నోట్‌పై ముసాయిదా తయారైందని కేంద్రం హోమ్ మంత్రి సుశీల్‌కుమార్ షిండే ప్రకటించడంతో జిల్లాలో సమైక్యవాదులు రోడ్లపైకి వచ్చారు.
 
 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలతో పాటు బ్యాంకులు, వాణిజ్య సముదాయాలను బంద్ చేయించారు. యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ, ప్రధాని మన్మోహన్‌సింగ్‌తోపాటు సుశీల్ కుమార్ షిండే, దిగ్విజయ్ సింగ్, ఆంటోని దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఎక్కడ చూసినా నిరసన ర్యాలీలు హోరెత్తాయి. రహదారులపై ప్రైవేటు వాహనాలను, రైళ్లను సైతం అడ్డుకున్నారు. అయితే ముందస్తు జాగ్రత్తగా పోలీసులు జిల్లాకు అదనపు బలగాలను రప్పించారు.
 
 
 టీ నోట్ ముసాయిదా తయారైందని షిండే ప్రకటించడంతో అనంతపురంలో జేఏసీ నాయకులు రగిలి పోయారు. ఇదే సమయంలో ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి అనంతపురంలోనే ఉన్నారన్న విషయం తెలుసుకున్న ఉద్యోగ , ఉపాధ్యాయ జేఏసీ నాయకులు టవర్‌క్లాక్ సర్కిల్ నుంచి ర్యాలీగా వెళ్లి ఆయన ఇంటిని ముట్టడించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది.
 
 ఆగ్రహించిన జేఏసీ నాయకులు ఎంపీకి వ్యతిరేకంగా నినిదాలు చేశారు. రాజీనామా చేసి ఉద్యమంలో పాలుపంచుకోవాలని డిమాండ్ చేశారు. స్పందించిన ఎంపీ తాను ఇదివరకే రాజీనామా చేశానని స్పష్టం చేసి.. హడావుడిగా ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. పాతూరు పవరాఫీసులో విద్యుత్ ఉద్యోగులు మెరుపు సమ్మెకు దిగారు. సబ్‌స్టేషన్ ఎదుట గంట పాటు రోడ్డుపై బైఠాయించారు. రాష్ట్రం విడిపోతే అన్నం దొరకదని పంచాయతీరాజ్ జేఏసీ నాయకులు గంజి కేంద్రం ఏర్పాటు చేసి నిరసన తెలిపారు. రాష్ట్రం సమైక్యంగా ఉండేలా చూడాలని కోరుతూ మార్కెటింగ్ శాఖ ఉద్యోగులు తెలుగుతల్లి విగ్రహానికి వినతిపత్రం అందజేశారు.

 మునిసిపల్ కార్పొరేషన్ జేఏసీ, మహిళా సంఘాలు, వికలాంగ సమాఖ్య ఆధ్వర్యంలో నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని ర్యాలీ నిర్వహించారు. టీ నోట్‌ను నిరసిస్తూ ఉద్యోగ జేఏసీ నాయకులు 48 గంటల జిల్లా బంద్‌కు పిలుపునిచ్చారు. టీ నోట్ విషయం తెలియగానే ఎస్కేయూలో జేఏసీ నాయకులు రగిలిపోయారు. 205 జాతీయరహదారిపై యూపీఏ ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసి రెండు గంటల పాటు వాహనాల రాకపోకలను స్తంభింపజేశారు. దీంతో వన్‌టౌన్ సీఐ గోరంట్ల మాధవ్ ఎస్కేయూ వద్దకు వెళ్లి.. ఆందోళన విరమించాలని..లేని పక్షంలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీంతో విద్యార్థులు, సీఐ మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది. మరోవైపు టీ నోట్‌పై నిరసన తెలుపుతూ నగరంలోకి ర్యాలీగా వచ్చేందుకు విద్యార్థులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.
 
 ఊరూ..వాడా నిరసనల హోరు
 ధర్మవరంలో జేఏసీ ఆధ్వర్యంలో కాలేజీ సర్కిల్‌లో మానవహారంగా ఏర్పడ్డారు. టీ నోట్‌ను అడ్డుకోవాలని సీమాంధ్ర ప్రజాప్రతినిధులను డిమాండ్ చేశారు. జేఏసీ ఆధ్వర్యంలో రైల్వేస్టేషన్‌కు ర్యాలీగా వెళ్లి రైలురోకో చేశారు. దీంతో యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ అరగంట పాటు ధర్మవరంలో నిలిచిపోయింది. బత్తలపల్లిలో జేఏసీ నాయకులు రాస్తారోకో చేశారు.
 
 గుంతకల్లులో టీ నోట్ ప్రకటనపై సమైక్యవాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు రిలేదీక్షా శిబిరం ఎదురుగా ఉండే సోనియా, రాహుల్, యూపీఏ నాయకుల ఫ్లెక్సీలను, కాంగ్రెస్ జెండాలను దహనం చేశారు. వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో బంద్ పాటించారు. గుత్తిలో జేఏసీ నాయకులు 36 గంటల బంద్‌కు పిలుపునిచ్చారు. హిందూపురంలో రాష్ట్ర విభజనపై ప్రసార మాధ్యమాల్లో వస్తున్న వార్తలను చూడలేమని ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ టీవీలను రోడ్డుపై పగులగొట్టారు. వేర్పాటువాదుల మాస్కులు ధరించి ర్యాలీ చేపట్టారు.
 
 విశాలాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. అనంతరం పట్టణ బంద్ పాటించారు. టీ నోట్‌కు నిరసనగా వైఎస్సార్‌సీపీ నాయకుడు నవీన్‌నిశ్చల్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించి.. పట్టణంలో దుకాణాలు మూసివేయించారు. కదిరిలో జేఏసీ నాయకులు పట్టణ బంద్ నిర్వహించారు. విద్యుత్ ఉద్యోగులు ర్యాలీ నిర్వహించి.. అంబేద్కర్ కూడలిలో మానవహారంగా ఏర్పడ్డారు. వైఎస్సార్‌సీపీ నాయకులు ఫర్హానా ఫయాజ్, అరీఫ్ అలీ ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. కళ్యాణదుర్గంలో టీనోట్‌కు నిరసనగా జేఏసీ నాయకులు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు.
 
 అలాగే రాష్ర్ట రెవెన్యూశాఖ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి ఇంటిని ముట్టడించారు. మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఇంట్లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. చివరకు మంత్రి.. కుటుంబసభ్యులు ఎవరూ ఇంట్లో లేరని తెలుసుకున్న జేఏసీ నాయకులు అక్కడి నుంచి వెనుదిరిగారు. కుందుర్పి, శెట్టూరు, కంబదూరులో జేఏసీ నాయకులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించి బంద్ పాటించారు. మడకశిరలో సమైక్య వాదులు వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాల వాహనాల అద్దాలను ధ్వంసం చేశారు. రోడ్లపై వాహనాల టైర్లను కాల్చి ఆందోళన చేశారు. అనంతరం బంద్ నిర్వహించారు. టీ నోట్‌కు నిరసనగా పుట్టపర్తిలో నలుగురు సమైక్యవాదులు ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. గమనించిన జేఏసీ నాయకులు వారిని వారించి ఆ ప్రయత్నాన్ని విరమింపజేశారు. ఓడీచెరువులో యూపీఏ దిష్టిబొమ్మను దహనం చేశారు.
 
 అమడూరులో జేఏసీ నాయకులు రెండు రోజుల బంద్‌కు పిలుపునిచ్చారు. గోరంట్లలో టీ నోట్ వార్త తెలియగానే సమైక్య వాదులు ఎంపీ నిమ్మల కిష్టప్ప ఇంటిని ముట్టడించారు. పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎంపీ స్పందిస్తూ రాజీనామాలతో లాభం లేదని, విభజన బిల్లును పార్లమెంటులో అడ్డుకోవడానికి తాము తీవ్రంగా ప్రయత్నిస్తున్నామని వారికి నచ్చజెప్పారు.
 
 ఇదొక్కసారి చాన్స్ ఇస్తే.. ఢిల్లీ వెళ్లి బిల్లును అడ్డుకోవడానికి ప్రయత్నిస్తానని, లేని పక్షంలో రాజీనామా చేసి.. మీ ముందుకు వస్తానని చెప్పడంతో జేఏసీ నాయకులు వెనుదిరిగారు. రాయదుర్గంలో టీ నోట్‌కు నిరసనగా జేఏసీ నాయకులు బంద్ పాటించారు. డీహీరేహాళ్‌లో జేఏసీ నాయకులు రాష్ట్ర రహదారిని దిగ్బంధించారు. కణేకల్లులో యాదవులు ర్యాలీ నిర్వహించారు. నార్పలలో జేఏసీ నాయకులు రాస్తారోకో చేశారు. తాడిపత్రిలో టీనోట్‌కు నిరసనగా ఉపాధ్యాయ, ఉద్యోగ, ఆర్టీసీ, విద్యుత్ జేఏసీ ఆధ్వర్యంలో పట్టణ బంద్ నిర్వహించారు. వజ్రకరూరులో విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో రహదారులు దిగ్బంధించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement