పల్లెవెలుగుకు అల్ట్రా బాదుడు

Ultra Express Ticket Prices in Palle Velugu Busses - Sakshi

భద్రాచలం అంతర్రాష్ట సర్వీసుకు ప్యాసింజర్‌ బస్సులు

అల్ట్రా డీలక్స్‌ చార్జీ వసూలు చేస్తున్న ఆర్టీసీ

విశాఖపట్నం, సీలేరు(పాడేరు): ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్లే అంతర్రాష్ట్ర ప్రయాణికులకు ఆర్టీసీలో సుఖమైన ప్రయాణమని, సరైన ధరతో గమ్యస్థానాలకు తీసుకువెళ్తామని చెబుతూ ఆర్టీసీ అధికారులు తమను మోసం చేస్తున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే..

ఆన్‌లైన్‌లో అల్ట్రా.. తీరా చూస్తే ప్యాసింజర్‌
విశాఖపట్నం(మధురవాడ) నుంచి తెలంగాణా రాష్ట్రం భద్రాచలానికి ఆర్టీసీ రోజూ రెండు సర్వీసులను నడుపుతోంది. ఈ బస్సు రాత్రి 7.30 గంటలకు విశాఖలో బయల్దేరి అర్ధరాత్రి 3 గంటలకు సీలేరు వచ్చి, అక్కడి నుంచి ఉదయం 7గంటలకు భద్రాచలం చేరుకుంటుంది. సాయంత్రం 5.30గంటలకు భద్రాచలంలో బయల్దేరిన బస్సు ఉదయం 6గంటలకు విశాఖ చేరుకుంటుంది. ప్రయాణికులకు టిక్కెట్‌ చార్జీ రూ.475. ఆ ధరకు అల్ట్రా డీలక్స్‌లో పుష్‌ బ్యాక్‌ సీట్లు, వినోదానికి టీవీలు ఉండి ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా గమ్యస్థానానికి చేర్చాలి. కాని మధురవాడ డిపో అధికారులు ఎక్స్‌ప్రెస్‌ టికెట్‌ ధర తీసుకుని ఆన్‌లైన్‌లోనూ అల్ట్రా డీలక్స్‌ అని చూపించి తీరా బస్సు బయల్దేరే సమయంలో అది తొలగించి.. పల్లె వెలుగు బస్సులను నడుపుతున్నారు. పది రోజులుగా ఇదే పరిస్థితి.

నివ్వెరపోతున్న ప్రయాణికులు
వందల కిలోమీటర్లు దూరప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో రిజర్వేషన్‌ చేయించుకుని అదే బస్సు కోసం ఎదురు చూస్తున్న ప్రయాణికులు గత్యంతరం లేక పల్లెవెలుగు బస్సే ఎక్కుతున్నారు. రోజూ ఆ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులకు సిబ్బందికి మధ్య వాదోపవాదాలు జరుగుతున్నాయి. సిబ్బంది తమకేమీ సంబంధం లేదని సమాధానం చెబుతున్నారు.

170కి.మీ. ఘాట్‌ రోడ్డే..
విశాఖపట్నం నుంచి భద్రచలానికి వెళ్లాలంటే సుమారు 400 కిలోమీటర్లు దూరం. నర్సీపట్నం నుంచి సీలేరు వరకు దాదాపు 170 కి.మీ. ఘాట్‌రోడ్డు. అదీగాక ఆర్‌వీ నగర్‌ నుంచి సీలేరు వరకు 70కి.మీ రోడ్డు అధ్వానం. అదీ రాత్రి వేళ ప్రయాణం. దీంతో ప్రయాణికులు హడలిపోతున్నారు. గోతుల్లో ఈ బస్సుల్లో ప్రయాణం చేయలేకపోతున్నామని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పండగ వేళ బస్సులేవీ?
విశాఖ నుంచి సీలేరు మీదుగా అంతర్రాష్ట్రాలకు వెళ్లే ఘాట్‌ రోడ్డులో తగినన్ని బస్సు సర్వీసులు లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. సంక్రాంతి పండగ నేపథ్యంలో ఈ మార్గంలో బస్సులు లేకపోవడంతో  ఉన్న రెండు మూడు బస్సుల్లోనే వందలాది కిలోమీటర్లు బస్సుల్లో నిల్చుని ప్రయాణించవలసిన పరిస్థితి. విశాఖ డిపోకు చెందిన బస్సులు రోజు వారీగా రెండు వైపులా ఐదు బస్సులను మాత్రమే నడుపుతున్నారు. ఇవన్నీ దూర ప్రాంతాల నుంచి రావడంతో అక్కడే ప్రయాణికులతో పూర్తిగా నిండిపోతుంది. దీంతో మార్గమధ్యలో ఎక్కే ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. గతంలో విశాఖ నుంచి సీలేరుకు వచ్చే బస్సులను తొలగించారు. మళ్లీ ఆ బస్సు సర్వీసులను పునరుద్ధరించాలని ఈ ప్రాంత ప్రయాణికులు డిమాండ్‌ చేస్తున్నారు.

సీలేరు, మల్కన్‌గిరి సర్వీసు పునరుద్ధరించాలి
ఘాట్‌ రోడ్డులో ఆర్టీసీకి ఏటా కోట్ల రూపాయల్లో ఆదాయం వస్తుంది. ఇలా బస్సు సర్వీసులను తొలగించడం అన్యాయం. సీలేరు నైట్‌హాల్ట్, మల్కన్‌గిరి బస్సు సర్వీసును పునరుద్ధరించి ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చూడాలి.– రాజుచిత్రకొండ, సీలేరు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top