చిన్న బండి.. లోడు దండి!

Two Wheelers Going With Overload In Anakapalle, Visakapatnam - Sakshi

పేరుకు ద్విచక్ర వాహనాలు.. చుట్టూ భారీ లోడు

అసలే ఇరుకు రోడ్లు.. వీటి కారణంగా మరిన్ని ఇక్కట్లు

సాక్షి, అనకాపల్లి టౌన్‌ (విశాఖపట్నం):  దినదినాభివృద్ధి చెందుతున్న అనకాపల్లి పట్టణంలో నిత్యం ట్రాఫిక్‌ ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.  ప్రధాన రహదారి మినహా మిగతా రహదారులు చిన్నవి కావడంతో ఈ సమస్య తీవ్రంగా ఉంది. విస్తరణకు నోచుకున్న ప్రధాన రహదారిలో వన్‌వే ఆంక్షలు విధించడంతో ఇరుకు వీధి రోడ్లలో కూడా భారీ వాహనాలు వెళ్తున్నాయి. దీంతో ఎదురెదురుగా వాహనాలు వచ్చినప్పుడు తీవ్ర ట్రాఫిక్‌ ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా వీధుల్లో ద్విచక్ర వాహనాలపై కొంతమంది చిరు వ్యాపారులు పెద్దఎత్తున సామగ్రి కట్టుకొని వెళ్తుండడంతో ఆ వాహనం వెళ్తే గాని మరో వాహనం వచ్చే పరిస్థితి లేదు. పాదచారులు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శారదానది వంతెనపై నుంచి వచ్చే ఆటోలను నెహ్రూచౌక్‌ మీదుగా వెళ్లనీయకపోవడంతో పాత సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి ఎదురుగా ఉన్న శ్రీధర్‌లాడ్జి వీధి రహదారి మీదుగా వెళ్లి రామచంద్ర థియేటర్‌ ప్రధాన రహదారికి చేరుకోవాల్సి వస్తోంది. ఇరుకుగా ఉండే ఈ రహదారిపై అధికలోడు వాహనాలతో పాటు ఒక్కో సమయంలో భారీ వాహనాలు వస్తే ట్రాఫిక్‌ ఇబ్బందులు నిత్యం ఏర్పడుతున్నాయి. పట్టణంలో దాదాపు అన్ని వీధి రోడ్లలో ఇదే పరిస్థితి ఉన్నా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.

నంబర్లు కూడా కనిపించని రీతిలో..
కొందరు ద్విచక్రవాహనాలపై అధిక లోడుతో ప్రయాణించే సమయంలో వాహనం నంబర్లు కనిపించడంలేదు. ఏదైనా ప్రమాదం జరిగితే సంబంధిత వాహనదారుడిని పోలీసులుకాని, ఆర్టీవో అధికారులు కాని గుర్తించడం కష్టమే. చూడ్డానికి ద్విచక్ర వాహనమే అయినా రోడ్డంతా ఆక్రమించేలా భారీ సామగ్రితో వెళుతున్నాయి. వీటి కారణంగా ఇతర వాహన చోదకులకు ఇబ్బందుల ఎదురవుతున్నాయి. 

ప్రధాన రహదారిపై ఆంక్షలు ఎత్తివేయాలి
ప్రధాన రహదారులపై ఆంక్షలు ఎత్తివేస్తే ద్విచక్ర, ఆటోరిక్షా వంటి వాహనాలు ఎక్కువగా ఆ రోడ్లపై ప్రయాణిస్తాయి. వీధి రహదారులపై ద్విచక్ర వాహనాలు, పాదచారులు  ప్రయాణించేందుకు వీలుగా ఉంటుంది.  ప్రధాన రహదారిగుండా ఆటోలను వెళ్లనీయకపోవడం, అధికలోడు వాహనాలకు అవే ఆంక్షలు వర్తించడంతో వీధి రహదారుల్లో నిత్యం ట్రాఫిక్‌ ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. తక్షణం ప్రధాన రహదారులపై ఒన్‌వే ఆంక్షలు ఎత్తివేయాలి. 
–రాజు, వాహనచోదకుడు, నర్సింగరావుపేట 

అధిక లోడుతో వెళ్తే కఠిన చర్యలు 
ద్విచక్రవాహనాలపై అధికలోడు వేసుకొని వెళితే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. లోడుకు ప్రభుత్వం కొన్ని వాహనాలు సమకూర్చింది. వాటిని మాత్రమే వినియోగించాలి. నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడుపుతూ ప్రమాదాలు చేసిన వారిపై చర్యలు తప్పవు. 
– కిరణ్‌కుమార్, ట్రాఫిక్‌ సీఐ, అనకాపల్లి

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top