బడుగుల మెడపై సర్వే కత్తి! | Sakshi
Sakshi News home page

బడుగుల మెడపై సర్వే కత్తి!

Published Wed, Sep 17 2014 1:39 AM

బడుగుల మెడపై సర్వే కత్తి! - Sakshi

 సాక్షి, రాజమండ్రి :కొత్త పథకం అమలవ్వాలి, పాత బడ్జెట్ దాటకూడదు! పాతవారిని తొలగించాలి, మన వాళ్లకూ చోటివ్వాలి! ఇలా ఒకే దెబ్బకు రెండు పిట్టలు పట్టాలంటే ‘ఏరివేత’ తప్పనిసరి అంటూ.. ఇదే పంథాను అవలంబిస్తోంది తెలుగుదేశం ప్రభుత్వం. అక్టోబర్ రెండు నుంచి కొత్తగా పెంచిన పింఛనును అమలు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. టీడీపీ ఎన్నికల వాగ్దానాల్లో ప్రతిష్టాత్మకంగా చెప్పుకొన్న ఈ కార్యక్రమానికి రూపాయి పెట్టుబడి పెట్టకుండా అమలుచేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటోం ది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 19, 20 తేదీల్లో ఓ సమగ్ర సర్వే చేసేందుకు రంగం సిద్ధం చేసింది. అధికారులు, ప్రజాప్రతినిధులతో కూడిన బృందాలు నేరుగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి జాబితాలు సరిచూస్తారట. వారికి అనర్హులనిపిస్తే పేరు తొలగిస్తారట. ఈ పథకం ద్వారా తమ అనుయాయులకు లబ్ధి చేకూరేలా మలుచుకునేందుకు.. బినామీల ఏరివేత ముసుగులో లబ్ధిదారులను జల్లెడ పట్టేందుకు సిద్ధమవుతున్నారు.
 
 సర్వే ఇలా..
 గ్రామాల వారీగా సర్వే బృందాల ఏర్పాటుకు కసరత్తు జరుగుతోంది. సర్పంచ్, ఎంపీటీసీ సభ్యుడు, పంచాయతీ కార్యదర్శి, ఇద్దరు సామాజిక కార్యకర్తలు, డ్వాక్రా సంఘాల సభ్యులతో గ్రామ స్థాయిలో కమిటీలు నియమిస్తున్నారు. వీరు ఇంటింటికీ తిరిగి, లబ్ధిదారుల జాబితా ప్రకారం తనిఖీలు నిర్వహిస్తారు. లబ్ధిదారుడి ఆచూకీ లేకపోయినా, ఆ సమయానికి ఇంట్లో అందుబాటులో లేకపోయినా, గ్రామం విడిచి వేరే ప్రాంతానికి వెళ్లినా, అనివార్య కారణాలతో సర్వే రోజున కమిటీ దృష్టిలో పడకపోయినా వారి పింఛను తొలగిస్తారు. గ్రామ స్థాయి కమిటీలు ఇచ్చిన నివేదికలను మండల స్థాయి కమిటీ పరిశీలించి, కలెక్టర్‌కు సమర్పిస్తారు. మండల స్థాయి కమిటీలో ఎంపీడీఓ, తహశీల్దార్, ఎంపీపీ, జెడ్పీటీసీ సభ్యుడు, ఇద్దరు ఎంపీటీసీ సభ్యులు, ఇద్దరు సర్పంచ్‌లు, సామాజిక కార్యకర్తలు, డ్వాక్రా సంఘాల సభ్యులు ఉంటారు. మున్సిపాలిటీల్లో డివిజన్ కార్పొరేటర్, వార్డు కౌన్సిలర్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ లేదా బిల్లు కలెక్టర్‌తో పాటు మిగిలిన సభ్యులు ఉంటారు.సర్వేపై ఇప్పటికే ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేయగా, కమిటీల కూర్పు కోసం అధికారులు కసరత్తు చేస్తున్నారు.
 
 నేతలదే హవా
 గ్రామ, మండల స్థాయి కమిటీల్లోను ప్రజాప్రతినిధులకు కీలక స్థానం కల్పించారు. దీంతో వీరు కాదన్న వారి పేర్లు తొలగించడం, కావాలన్న వారి పేర్లు చేర్చడం వంటి చర్యలకు అడ్డులేకుండా పోతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. పింఛనుదారులను కూడా రాజకీయ కోణంలో చూస్తున్న తెలుగు తమ్ముళ్లు.. సర్వే పేరుతో వారికి కావాల్సిన వారికి ప్రయోజనం చేకూర్చేందుకు ఇప్పటినుంచే ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. కాగా ఈ సర్వేపై అధికారులు ఇంకా విస్తృత ప్రచారం చేయడం లేదని, గ్రామాల్లో ప్రజలకు తెలియదని ప్రజా సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
 
 పింఛన్ల తీరిలా..
 జిల్లాలో సుమారు 5.30 లక్షల మంది అర్బన్, రూరల్ ప్రాంతాల్లో వివిధ రకాల పింఛన్లు అందుకుంటున్నారు. వీరికి నెలకు సుమారు రూ.14.50 కోట్లు చెల్లిస్తున్నారు. కొత్తగా ప్రభుత్వం ప్రకటించిన వెయ్యి రూపాయల పింఛను ఇవ్వాలంటే అదనంగా సుమారు రూ.38 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో ఈ మొత్తాన్ని ఎంతవరకు తగ్గించాలో చేపట్టే కసరత్తులో భాగమే ఈ సమగ్ర సర్వే అని విమర్శలు వినిపిస్తుండగా,ఎవరికి కొత్త పింఛను దక్కుతుందో, మరెవరికి కోత పడుతుందో అని లబ్ధిదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
 

Advertisement
Advertisement