ఈత సరదా ప్రాణలు తీసింది

Two Members Died By Dipped Into Check Dam In Konakanamitla Prakasam - Sakshi

సాక్షి, ప్రకాశం : ఇటీవల మంచి వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం వాతావరణం అహ్లాదకరంగా ఉంది. ఐదుగురు స్నేహితులు సరదా అలా ఊరి బయటకు వెళ్లి కాసేపు కాలక్షేపం చేసి వద్దామనుకున్నారు. సమీపంలోని చెక్‌ డ్యాంలో నీరు పుష్కలంగా ఉండటం చూసి వారికి ఈత కొట్టాలనిపించింది. ఒకరి తరువాత ఒకరుగా ఈతకు దిగారు. అప్పటిదాకా ఉల్లాసంగా గడిపిన వారు ఒక్కసారిగా ప్రమాదంలో పడ్డారు. వారిలో ఇద్దరు నీట మునిగి మృతి చెందగా మిగిలిన ముగ్గురూ ప్రాణాలతో బయటపడ్డారు. వివరాల్లోకి వెళితే..

కొనకనమిట్ల మండలం పెదారికట్ల గ్రామానికి చెందిన సోమా రవి, మద్దూరి ఓబులకొండారెడ్డి, ఇళ్లూరి మహేంద్రరెడ్డి, మీనిగ నరేంద్ర, వసంతపురం బాలకృష్ణలు వీరంతా మంచి స్నేహితులు.. బుధవారం వాతావరణం చల్లగా ఉండటంతో సరదాగా గడుపుదామనుకొని స్నేహితులంతా ఊరి బయట పొలాల్లోకి వెళ్లారు. కొద్ది సేపు సరదాగా గడిపి కొండకు దగ్గర్లోని జంగమూడిశెల చెక్‌డ్యాం దగ్గరకు వెళ్లారు. చెక్‌డ్యాంలో పుష్కలంగా నీరు ఉండటంతో ఈత కొడదామనుకున్నారు. ఇళ్లూరి మహేంద్ర లోతుకు వెళ్లి మునిగి పోతున్నాడని గమనించిన మిగతా నలుగురు అతడిని కాపాడే యత్నం చేశారు. వీరిలో రవి(24), ఓబులకొండారెడ్డి(23) ఇద్దరు లోతుకు వెళ్లి నీట మునిగిపోయారు. మిగిలిన ముగ్గురూ ఒకరికొకరు చేయి అందించుకొని ఎలాగో బతికి బయట పడ్డారు. సమాచారం తెలుసుకున్న గ్రామస్తులు చెక్‌డ్యాం దగ్గరకు వెళ్లి రవి, కొండారెడ్డిల మృతదేహాలను వెలికితీసి గ్రామంలోకి తీసుకొచ్చారు.

ఒంటరి అయిన చిన్నారులు..
ప్రమాదంలో మృతి చెందిన సోమా రవి గ్రామంలో వెల్డింగ్‌ షాపు పెట్టుకొని జీవనం సాగిస్తున్నాడు. రవికి భార్య నాగలక్ష్మి, మూడేళ్ల పాప తేజశ్రీ, ఏడాదిలోపు బాబు నరేంద్రలు ఉన్నారు. రవి మృతితో నాగలక్ష్మి దిక్కుతోచని స్థితిలో ఉంది. నాన్న లేరని తెలియని చిన్నారులు ఏమి తెలియక అమాయకంగా చూస్తున్నారు. రవి తల్లిదండ్రులు, సోదరుడు కూడా ఇటీవలే మృతి చెందడం, ఇప్పుడు రవి కూడా చనిపోవడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. 

కుటుంభాన్ని పోషిస్తున్న ఓబులకొండారెడ్డి..
గ్రామానికి చెందిన మద్దూరి ఓబులరెడ్డి, తిరపతమ్మ దంపతుల ఏకైక కుమారుడు ఓబులకొండారెడ్డి కొద్దిగా చదువుకొని బేల్దారి పని చేస్తూ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. కొన్నాళ్లు హైదరబాద్‌లో బేల్థారి పని చేసి ఇటీవల గ్రామానికి వచ్చి ఇంటి దగ్గర ఉంటూ బేల్దారి పని చేస్తున్నాడు. వివాహం చేద్దమనుకున్న సమయంలో సరదాగా వెళ్లి ప్రాణాలు కోల్పోయిన ఓబులకొండారెడ్డి మృతితో తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. 

అదృష్టవంతులు వీరు..
తోటి స్నేహితులతో సరదాగా గడుపుదామని ఈతకు వెళ్లి ఇద్దరు స్నేహితులు కళ్లముందే మృత్యువడికి చేరటం, అదృష్ట వశాత్తు బతికి బయటపడిన ఇళ్లూరి మహేంద్రరెడ్డి, మీనిగ నరేంద్ర, వసంతపురం బాలకృష్ణలు అదృష్టవంతులు.. మహేంద్రరెడ్డి లారి డ్రైవర్‌గా పని చేస్తుండగా, నరేంద్ర బేల్థారి పని చేస్తుంటాడు. బాలకృష్ణ మాత్రం డిగ్రీ చదువుతున్నాడు. తమ కళ్ల ముందే తోటి స్నేహితులు మృతి చెందారని వారు విలపించటం కనిపించింది.

ప్రమాద విషయం తెలుసుకున్న గ్రామస్తులు హుటావుటిన చెక్‌డ్యాం దగ్గరకు వెళ్లారు. లోపల ఉన్న మృత దేహాలను వెళికి తీసేందుకు గ్రామానికి చెందిన ఎదురు కొండారెడ్డి, బాపతు ఎర్రారెడ్డి మరికొంతమంది సాహసించి చెక్‌డ్యాంలోకి దిగారు. లోపల ఉన్న మృతదేహాలను వెళికి తీసి ఒడ్డుకు చేర్చారు. అనంతరం మృతదేహాలను గ్రామంలోని మృతుల నివాసాలకు చేర్చారు. ఒకే రోజు గ్రామంలో ఇద్దరు యువకులు మృతి చెందటంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. కాగా జరిగిన సంఘటన తెలుసుకున్న కొనకనమిట్ల ఎస్‌ఐ వెంకటేశ్వరనాయక్‌ తన సిబ్బందితో గ్రామంలోకి వెళ్లి మృతదేహాలను పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. జరిగిన సంఘటనపై విచారించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని, మృతేహాలను పోస్టుమార్టం నిమిత్తం పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలిస్తామని ఎస్‌ఐ అన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top