సరయూలో ఇద్దరు గల్లంతు | two drown in sarayu river | Sakshi
Sakshi News home page

సరయూలో ఇద్దరు గల్లంతు

Jul 3 2014 1:57 AM | Updated on Sep 2 2017 9:42 AM

సరయూలో ఇద్దరు గల్లంతు

సరయూలో ఇద్దరు గల్లంతు

బియాస్ నది, డిండి ప్రాజెక్ట్ ఉదంతాల నుంచి తేరుకోక ముందే తాజాగా సరయూ నదిలో హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు వేద పండిత విద్యార్థులు గల్లంతయ్యారు.

సాక్షి, హైదరాబాద్/జగ్గయ్యపేట: బియాస్ నది, డిండి ప్రాజెక్ట్ ఉదంతాల నుంచి తేరుకోక ముందే తాజాగా సరయూ నదిలో హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు వేద పండిత విద్యార్థులు గల్లంతయ్యారు. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో జరిగే రామాయణ సుందరకాండ యజ్ఞానికి 48 మంది విద్యార్థులు వెళ్లారు. వీరు బుధవారం తెల్లవారు జామున సరయూ నదిలో స్నానానికి వెళ్లారు. అక్కడ ఫొటోలు దిగుతుండగా ఇద్దరు ప్రమాదవశాత్తు అందులో పడ్డారు. గల్లంతైన వారిలో డబీర్‌పురాకు చెందిన కిరణ్(20), మల్కాజ్‌గిరికి చెందిన చక్రపాణిశర్మ(21)లు ఉన్నారు.

అల్వాల్‌కు చెందిన విశ్వనాథ శాస్త్రి ఆధ్వర్యంలో 48 మంది విద్యార్థుల బృందం సోమవారం వరంగల్ నుంచి అయోధ్యకు రైలులో వెళ్లింది. బుధవారం అయోధ్యలో రామాయణ సుందరకాండ యజ్ఞం జరగాల్సి ఉంది. ఈ యజ్ఞానికి ముందు తెల్లవారు జామున వీరంతా సరయూ నది తీరంలో స్నానాలు చేసేందుకు వెళ్లారు. స్నానాలు చేస్తూ ఫొటోలు దిగేందుకు యత్నించారు.

ఈ క్రమంలోనే నదిలోకి దిగిన వారిలో కిరణ్, చక్రపాణిశర్మలు గల్లంతయ్యారు. చక్రపాణి మెదక్ జిల్లా వర్గల్ గ్రామంలో వేద పాఠశాలలో చదువు పూర్తి చేసుకుని సికింద్రాబాద్‌లోని ఎన్‌ఆర్‌ఐఐ సంస్థలో కంప్యూటర్ కోర్సు నేర్చుకుంటున్నాడు. కిరణ్ తండ్రి గతంలోనే మృతి చెందగా, ఇప్పుడు అతనూ గల్లంతు కావడంతో అతని తల్లికి రోదనే మిగిలింది.

అన్నీ మేమే అయి పెంచాం...
‘తండ్రి మరణించడంతో అన్నీ మేమే అయి పెంచాం. పెళ్లి కూడా చేసేందుకు సంబంధాలు చూస్తున్నాం.. ఇంతలో ఎంత ఘోరం జరిగింది..’ అంటూ గల్లంతైన పెద్దింటి కిరణ్‌కుమార్ శర్మ(25) అక్క, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. జగ్గయ్యపేటకు చెందిన కిరణ్‌కుమార్ శర్మ తండ్రి మరణించడంతో అతని అక్క జయలక్ష్మి, బావ మార్తి ఆదిత్యకుమార్‌శర్మ, మేనమామలు పెంచి పెద్దచేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు తక్షణమే స్పందించి నదిలో మునిగిపోయిన వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేయాలని విజ్ఞప్తిచేశారు.
 
సీఎం కేసీఆర్ సంతాపం
అయోధ్య వద్ద సరయూ నదిలో వేదపాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థుల మరణం పట్ల తెలంగాణ సీఎం కె. చంద్రశేఖర్‌రావు తన సంతాపాన్ని ప్రకటించారు. ఈ మేరకు సీఎం కార్యాలయం బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement