
ప్రభాస్ తొలి సినిమాలో హీరోయిన్ శ్రీదేవి.. చాలా ఏళ్ల తర్వాత తెలుగులో హీరోయిన్‌గా చేసిన మూవీ 'సుందరకాండ'. నారా రోహిత్ హీరో కాగా, వృతి వాఘని మరో కథానాయిక. చాన్నాళ్ల క్రితమే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. ఇన్నాళ్లకు థియేటర్లలోకి వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? హిట్టా ఫట్టా అనేది రివ్యూలో చూద్దాం.
కథేంటి?
సిద్ధార్థ్ (నారా రోహిత్) 30 ఏళ్ల వయసు దాటిపోయి చాన్నాళ్లయినా పెళ్లి చేసుకోడు. స్కూల్‌లో చదువుకునేటప్పుడు తన సీనియర్ వైష్ణవి(శ్రీదేవి)ని ప్రేమిస్తాడు. ఆమెలోని కొన్ని లక్షణాలు నచ్చుతాయి. పెద్దయిన తర్వాత అలాంటి లక్షణాలున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని రూల్ పెట్టుకుంటాడు. సంబంధాలు వస్తుంటాయి, అమ్మాయిల్ని చూస్తుంటాడు కానీ ప్రతి ఒక్కరిని రిజెక్ట్ చేస్తుంటాడు. ఓసారి ఎయిర్‌పోర్ట్‌లో ఐరా(వృతి వాఘని) అనే అమ్మాయిలో తను అనుకున్న క్వాలిటీస్ ఉన్నాయని ఆమె వెంటపడతాడు. తనని ప్రేమించేలా చేస్తాడు. మరి ఈ ప్రేమకథ సుఖాంతమైందా? సిద్ధార్థ్ మళ్లీ వైష్ణవిని ఎందుకు కలవాల్సి వచ్చిందనేది మిగతా స్టోరీ.

ఎలా ఉందంటే?
టాలీవుడ్‌లో ఇప్పటికే వందలాది ప్రేమకథ సినిమాలు వచ్చాయి, వస్తున్నాయి. కానీ ఇందులోనూ కొత్తగా చెప్పేందుకు ఆస్కారం ఉంటుంది. అలాంటి పాయింట్స్‌ని స్టోరీగా రాసి మూవీగా తీస్తుంటారు. ఇది కూడా అలాంటి ఓ చిత్రమే. కాన్సెప్ట్ వినడానికే విడ్డూరంగా ఉంటుంది గానీ గీత దాటకుండా బాగానే తీశారు. కామెడీ బోనస్.
సిద్ధార్థ్ పెళ్లి చేసేందుకు అతడి కుటుంబం.. అమ్మాయిల్ని చూడటంతో సినిమా మొదలవుతుంది. అలా తను అనుకున్న లక్షణాలు లేవవి రిజెక్ట్ చేస్తూ వెళ్తుంటాడు. ఓ సందర్భంలో ఎయిర్‌పోర్ట్‌లో ఐరాని చూస్తాడు. ఆమెలో క్వాలిటీస్.. తను అనుకున్న వాటికి మ్యాచ్ అవుతున్నాయని తెలిసి ఆమె వెంటపడి తనని ప్రేమించేలా చేస్తాడు. అంతా సుఖాంతం అనుకునే టైంలో ఓ ట్విస్ట్. అలా ఇంటర్వెల్ పడుతుంది. సిద్దార్థ్ చిన్నప్పుడు ఇష్టపడ్డ వైష్ణవి అనే క్యారెక్టర్ ఈ కథలోకి ఎంటర్ అవుతుంది. తర్వాత ఏమైంది? సిద్ధార్థ్ తన ప్రేమకథకి ఎలా ముగింపు ఇచ్చాడనేది మూవీ చూసి తెలుసుకోవాలి.
సినిమా ఎలా ఉంది అంటే జస్ట్ బాగుంది. ఫస్టాప్ అంతా పెద్దగా మెరుపులేం ఉండవు. హీరో పరిచయం, అతడికో ఫ్లాష్ బ్యాక్, హీరోయిన్‌తో లవ్ ట్రాక్.. ఇలా బోర్ కొట్టకుండా సాగిపోతుంది. ఇంటర్వెల్‌లో ఓ ట్విస్ట్ ఉంటుంది. అయితే ఫస్టాప్ చూస్తున్నప్పుడే దీన్ని చాలామంది ఊహించేస్తారు. అయితే ఈ ట్విస్ట్‌కి తగ్గట్లు సెకండాఫ్‌లో సీన్లు ఉన్నాయా అంటే కొన్ని ఉన్నాయి అంతే. మిగతా అంతా సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. క్లైమాక్స్ అయితే హడావుడిగా అనిపిస్తుంది.
ఇలాంటి కాన్సెప్ట్ సినిమాలో చాలానే డ్రామా నడిపించొచ్చు. కావాల్సినంత స్కోప్ కూడా ఉంది. కానీ ఎందుకో చేయలేకపోయారు అనిపించింది. కొంతలో కొంత సత్య కామెడీ ట్రాక్ రిలీఫ్‌గా అనిపిస్తుంది. పాటలు, ఫైట్స్ లాంటివి సినిమాటిక్‌గా ఉన్నాయి తప్పితే కథలో సెట్ కాలేదనిపించింది.

ఎవరెలా చేశారు?
నారా రోహిత్ ఎప్పటిలానే చేశాడు కానీ ఫిజిక్ పరంగా ఇంకాస్త శ్రద్ధ తీసుకోవాలి. డ్యాన్స్ చేశాడు కానీ ఇబ్బందిపడుతున్నట్లు అనిపించింది. చాన్నాళ్ల తర్వాత తెలుగులో చేసిన శ్రీదేవి ఆకట్టుకుంది. ఈమె పాత్రకు ఇంకొన్ని సీన్స్ పడుంటే బాగుండేది. స్కూల్ లవ్ స్టోరీలోనూ ఈమెనే పెట్టేశారు. బదులుగా ఎవరైనా చైల్డ్ ఆర్టిస్టుని పెట్టుంటే బాగుండేదేమో! ఐరా రోల్ చేసిన వృతి చూడటానికి బాగుంది. యాక్టింగ్ కూడా బాగానే చేసింది. సత్య, వాసుకీ, సీనియర్ నరేశ్ ఎవరికి వారు తమ పాత్రలకు న్యాయం చేశారు.
టెక్నికల్ అంశాలకొస్తే సినిమాటోగ్రఫీ రిచ్‌గా ఉంది. లియోన్ జేమ్స్ పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగానే ఉంది గానీ ఎక్కడో విన్న ఫీలింగ్ కలిగింది. దర్శకుడు వెంకటేశ్ తను అనుకున్న పాయింట్ బాగానే ప్రెజెంట్ చేశాడు కానీ ప్రేక్షకులు దీన్ని ఏ మేరకు అంగీకరిస్తారనేది చూడాలి.
- చందు డొంకాన