రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం

Two Died In Road Accident At Aswaraopeta - Sakshi

అశ్వారావుపేటరూరల్‌ (భద్రాద్రి కొత్తగూడెం జిల్లా):  కారును లారీ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. అశ్వారావుపేట మండలంలో ఆదివారం సాయంత్రం ఈ దుర్ఘటన జరిగింది. ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన పేకేటి సీతారామరెడ్డి(47), ఆయన భార్య అనిత, పెద్ద కుమార్తె నవీన, చిన్న కుమార్తె హైందవి, అనిత పెద్దమ్మ పెద్దింటి పిచ్చమ్మ(70) కలిసి భద్రాచలంలోని బంధువుల ఇంట్లో (కర్మ) కార్యానికి హాజరయ్యారు. తమ కారులో స్వగ్రామానికి తిరుగు ప్రయాణమయ్యారు.

 అశ్వారావుపేట మండలంలోని ఆసుపాక–నందిపాడు మధ్యలోగల గండి ముత్యాలమ్మ ఆలయం సమీపంలోని మూల మలుపు వద్ద, వీరి కారు–అశ్వారావుపేట నుంచి కుక్కునూరు వైపు వెళ్తున్న లారీ ఢీకొన్నాయి. దాంతో కారు నడుపుతున్న సీతారామరెడ్డి, వెనుక సీటులో కూర్చున్న పిచ్చమ్మ అక్కడికక్కడే మృతిచెందారు. అనిత తలకు తీవ్ర గాయాలయ్యాయి. కాలు విరిగింది. ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఈమె పరిస్థితి విషమంగా ఉంది. కుమార్తెలు నవీన, హైందవి కూడా తీవ్రంగా గాయపడ్డారు.

 కారు డ్రైవింగ్‌ సీటులో ఇరుక్కుపోయిన సీతారామరెడ్డి మృతదేహాన్ని స్థానికులు బయటకు తీశారు. ఏపీలోని తణుకు సమీపంలోగల పేరవలి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా సీతారామరెడ్డి పనిచేస్తున్నారు. క్షతగాత్రులను అశ్వారావుపేట ప్రభుత్వ సామాజిక ఆస్పత్రికి స్థానికులు తరలించారు. కారు ముందు భాగం నుజ్జు నుజ్జయింది. ప్రమాద స్థలాన్ని సీఐ అబ్బయ్య, ఎస్‌ఐ వేల్పుల వెంకటేశ్వరరావు పరిశీలించారు. మృతదేహాలను మార్చురీకి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top