అతను కన్నేస్తే.. టీవీఎస్‌ ఎక్సెల్‌ మాయం..!

TVS Excel theft arrest in Prodduturu - Sakshi

ప్రొద్దుటూరు క్రైం : అతను టీవీఎస్‌ ఎక్సెల్‌ వాహనాలను మాత్రమే నడపగలడు.. గేర్‌ బైక్‌లను నడపడం చేతకాదు.. ఈ తరహా బైక్‌లను చోరీ చేసినా తీసుకెళ్లడం కష్టమనుకున్న అతను టీవీఎస్‌ ఎక్సెల్‌ వాహనాలను చోరీ చేయడం ప్రారంభించాడు. ఈ క్రమంలోనే పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. బుధవారం టూ టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో డీఎస్పీ శ్రీనివాసరావు విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. చాపాడు మండలం, వెదురూరు గ్రామానికి చెందిన షేక్‌ హుస్సేన్‌బాషా సైకిల్‌లో పండ్లు పెట్టుకొని గ్రామాలు తిరుగుతూ వ్యాపారం చేసుకునేవాడు. మద్యం తాగనిదే అతనికి నిద్ర వచ్చేది కాదు. పండ్ల వ్యాపారంతో వచ్చే ఆదాయం తాగుడుకు, కుటుంబ పోషణకు సరిపోయేది కాదు.

 దీంతో అతను గ్రామంలోని పలువురి వద్ద అప్పు చేశాడు. అతనికి వి.రాజుపాళెం గ్రామానికి చెందిన గాలం శ్రీనివాసులుతో ఏడాది క్రితం పరిచయం ఏర్పడింది. అతను వ్యవసాయం చేస్తాడు. షుగర్‌ వ్యాధి ఉన్నందున వ్యయసాయ పనులకు వెళ్లడం మానేశాడు. గూడ్స్‌ ఆటో తీసుకొని ఇద్దరు కలసి కూరగాయల వ్యాపారాన్ని చేసుకునేవారు. సంసారం విషయంలో మనస్పర్థలు రావడంతో హుస్సేన్‌బాషా కొన్ని రోజుల నుంచి భార్యతో విడిపోయి వేరుగా ఉంటున్నాడు. దీంతో ఇటీవల తాగుడుకు బానిస అయ్యాడు. తాగడానికి డబ్బు లేకపోతే శ్రీనివాసులు వద్ద అప్పు తీసుకునేవాడు. ఈ క్రమంలోనే టీవీఎస్‌ ఎక్సెల్‌ వాహనాలను దొంగిలించి  సులభంగా డబ్బు సంపాదించాలని అతను భావించాడు.

టీవీఎస్‌ ఎక్సెల్‌ మోటార్‌ సైకిళ్లను చోరీ చేయాలని..
పెద్ద మోటార్‌ బైక్‌ అయితే పోలీసులకు రికార్డులు చూపించాల్సి వస్తుందని, చిన్న వాహనం అయితే పోలీసులు రికార్డు అడగరని అతను ఈ నిర్ణయానికి వచ్చాడు. అదీగాక అతనికి టీవీఎస్‌ ఎక్సెల్‌ మాత్రమే నడపడం వస్తుంది, పెద్ద బైక్‌ నడపలేడు. టీవీఎస్‌ ఎక్సెల్‌లను మాత్రమే చోరీ చేయడానికి అది కూడా కారణమని డీఎస్పీ తెలిపారు. రికార్డులు లేకున్నా చిన్న వాహనాలను పల్లెల్లో సులభంగా అమ్ముకోవచ్చనుకున్న అతను ఈ విషయాన్ని శ్రీనివాసులుకు చెప్పాడు. అందుకు శ్రీనివాసులు కొన్ని సలహాలు కూడా ఇచ్చాడు. సైడ్‌ లాక్‌ వేయని టీవీఎస్‌ ఎక్సెల్‌ మోటార్‌ సైకిళ్లను మాత్రమే ఎంచుకోవాలని అతను హుస్సేన్‌బాషాకు సూచించాడు. అంతేగాక వైర్లను కట్‌ చేసి ఎలా స్టార్ట్‌ చేసుకొని వెళ్లాలో కూడా అతను నేర్పించాడు. అప్పటి నుంచి హుస్సేన్‌బాషా శ్రీనివాసులుతో కలిసి చోరీలకు పాల్పడ్డాడు.

పలు స్టేషన్ల పరిధిలో చోరీలు
జిల్లాలోని పలు స్టేషన్ల పరిధిలో ఇద్దరు టీవీఎస్‌ ఎక్సెల్‌ వాహనాలను చోరీ చేశారు. ప్రొద్దుటూరు టూ టౌన్‌లో మూడు, వన్‌టౌన్‌లో రెండు, త్రీ టౌన్‌లో నాలుగు, జమ్మలమడుగులో రెండు, ఎర్రగుంట్లలో రెండు, పోరుమామిళ్లలో మూడు,బద్వేల్‌లో రెండు వాహనాలను చోరీ చేశారు. వాహన యజమానుల ఫిర్యాదు మేరకు ఆయా పోలీస్‌స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో బుధవారం మోడంపల్లె బైపాస్‌రోడ్డులో డీఎస్పీ ఆదేశాల మేరకు టూ టౌన్‌ ఎస్‌ఐ మధుమళ్లేశ్వరరెడ్డి సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీ చేస్తున్న సమయంలో మైదుకూరు వైపు నుంచి హుస్సేన్‌బాషా, శ్రీనివాసులు వేర్వేరు టీవీఎస్‌ ఎక్సెల్‌ వాహనాలపై వచ్చారు. రికార్డులు చూపించమని పోలీసులు అడుగగా తడబడుతూ లేవని చెప్పారు. వారిని అదుపులోకి తీసుకొని విచారించగా పలు ప్రాంతాల్లో చోరీ చేసినట్లు అంగీకరించారు. ఇద్దరిని అరెస్ట్‌ చేసి వారి వద్ద నుంచి చోరీ చేసిన 18 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. విలేకరుల సమావేశంలో సీఐ ఓబులేసు పాల్గొన్నారు. ఈ కేసులో మంచి ప్రతిభ చూపించిన ఎస్‌ఐ, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top