రాయల తెలంగాణ చేస్తామంటే మీ ఖర్మ | TRS will not cooperate to rayala telangana, warns KCR | Sakshi
Sakshi News home page

రాయల తెలంగాణ చేస్తామంటే మీ ఖర్మ

Dec 3 2013 1:44 AM | Updated on Sep 2 2017 1:11 AM

రాయల తెలంగాణ చేస్తామంటే మీ ఖర్మ

రాయల తెలంగాణ చేస్తామంటే మీ ఖర్మ

‘రాయల తెలంగాణ చేస్తామని అనుకుంటే మీ ఖర్మ. మేమైతే ఆ ప్రతిపాదనకు సహకరించపోగా వ్యతిరేకంగానే ఉండాల్సి ఉంటుంది’ అని టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు కాంగ్రెస్ అధిష్టానానికి హెచ్చరికలను పంపారు.

సాక్షి, హైదరాబాద్: ‘రాయల తెలంగాణ చేస్తామని అనుకుంటే మీ ఖర్మ. మేమైతే ఆ ప్రతిపాదనకు సహకరించపోగా వ్యతిరేకంగానే ఉండాల్సి ఉంటుంది’ అని టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు కాంగ్రెస్ అధిష్టానానికి హెచ్చరికలను పంపారు. కాంగ్రెస్ అధిష్టానానికి సన్నిహితంగా ఉండే ఒక నాయకునికి టీఆర్‌ఎస్ మాజీ ఎంపీ వినోద్‌కుమార్ ద్వారా ఈ హెచ్చరికను పంపినట్టుగా పార్టీ వర్గాలు తెలిపాయి. ‘హైదరాబాద్‌పై ఎలాంటి ఆంక్షల్లేకుండా 10 జిల్లాలతో కూడిన తెలంగాణ ఇవ్వాలని అడుగుతున్నాం. అంతకుమించి మరే ప్రతిపాదనా మాకు అంగీకారయోగ్యం కాదు.
 
  తెలంగాణకు కర్నూలు, అనంతపురం జిల్లాలను కలపాలని మేం కోరుకోవడం లేదు. అలా చేస్తే రాష్ట్రాన్ని విభజించినట్టుగానే ఉంటుంది తప్ప తెలంగాణ వచ్చిందనే భావన తెలంగాణవాదులకు రాదు. తెలంగాణ కోసం రాయలసీమ అస్తిత్వాన్ని దెబ్బతీయాలనే ఆలోచన కూడా మాకు లేదు. తెలంగాణ ఏర్పాటుతో రాజకీయంగా మన్ననలు పొందాల్సిన మీరు ప్రతిఘటనను ఎదుర్కోవాల్సి ఉంటుంది’ అని కేసీఆర్ అభిప్రాయాన్ని పంపినట్టు పార్టీ వర్గాలు చెప్పాయి.
 
 ‘రాయల’పై రణంకు సిద్ధం కండి: శ్రేణులకు కేసీఆర్ ఆదేశాలు
 రాయల తెలంగాణ ప్రతిపాదన అధికారికంగా వస్తే ఉద్యమించడానికి సిద్ధం కావాలని పార్టీశ్రేణులను టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. మెదక్ జిల్లాలోని ఫాంహౌస్‌లో పార్టీ ముఖ్యులతో ఆయన సోమవారం సమావేశమయ్యారు. రాయల తెలంగాణ అనేది పుకార్లు మాత్రమే కావచ్చునని కేసీఆర్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. కాగా, సంపూర్ణ తెలంగాణ ఏర్పాటులో ఏమాత్రం తేడా వచ్చినా మరో ఉద్యమానికి  కేసీఆర్ సిద్ధంగా ఉన్నారని టీఆర్‌ఎస్ నేతలు జగదీశ్‌రెడ్డి, సుభాష్‌రెడ్డి తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement