బాత్‌రూంలు, టాయిలెట్లు లేని ఇళ్లలో మీరుంటారా..?

Tribal welfare department officer Checks in Government Hostels - Sakshi

అలాంటి భవనాన్ని అద్దెకు ఎందుకు తీసుకున్నారు..?

వసతి గృహాల్లో పిల్లల్ని మన పిల్లలుగా చూసుకోవాలి

వెంటనే భవనాన్ని ఖాళీ చేయించండి

ట్రైబల్‌ హెచ్‌డబ్ల్యూఓలు, హెచ్‌ఎంల సమావేశంలో గిరిజన సంక్షేమ శాఖ అధికారి హెచ్చరిక

ఒంగోలు టూటౌన్‌ :‘బాత్‌ రూములు, టాయిలెట్స్‌ లేకుండా మీరు ఉంటున్నారా..? మనం ఉంటున్నామా చెప్పండి.. మరి అలాంటి భవనాన్ని ఎందుకు అద్దెకు తీసుకున్నారు. బయటకు వెళ్లాలంటే పిల్ల్లలు ఎంత భయపడతారు, బాధ్యత లేకుండా ప్రవర్తిస్తే ఎలా’ అంటూ గిద్దలూరు మండలంలోని క్రిష్టింశెట్టిపల్లె గిరిజన సంక్షేమశాఖ వసతి గృహ అధికారిపై జిల్లా డీటీడబ్ల్యూఓ      మండిపడ్డారు. వెంటనే ఆ భవనాన్ని మార్చాలని ఆదేశించారు. వసతి గృహాల్లో పిల్లలను మన పిల్లలుగా చూడాలని హితవు పలికారు. స్థానిక ప్రగతి భవనంలోని గిరిజన సంక్షేమశాఖ, వెల్ఫేర్‌ కార్యాలయంలో వసతి గృహాల వార్డెన్లు, ఆశ్రమ పాఠశాలల హెచ్‌ఎంలతో జిల్లా ట్రైబల్‌ వెల్ఫేర్‌ అధికారి వెంకట సుధాకర్‌ మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వసతి గృహ వార్డెన్, గురుకుల పాఠశాలల హెచ్‌ఎంలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

అదే విధంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు పదో తరగతి పరీక్ష ఫలితాల వివరాల గురించి ఆరా తీశారు. ముఖ్యంగా వసతిగృహాల్లో ఎంత మంది పిల్లలు ఉంటున్నారనే విషయంపై చర్చించారు. తక్కువగా ఉంటే పిల్లలను ఎందుకు చేర్పించలేకపోయారంటూ ప్రశ్నించారు. ఎక్కువ మంది వార్డెన్లు వర్కర్స్‌ లేరని, గతంలో పనిచేసిన వర్కర్స్‌కు జీతాలు ఇవ్వాల్సి ఉందని డీటీడబ్ల్యూఓ దృష్టికి తీసుకువచ్చారు. కొన్ని చోట్ల ప్రస్తుతం ఉన్న వసతి గృహాలు సరిపోవడం లేదని తెలిపారు. అదనపు రూములకు నిధులు మంజూరైనా చాలా ప్రాంతాల్లో ఇంత వరకు పనులు ప్రారంభించలేదని తెలిపారు. మార్కాపురం వసతి గృహంలో పిల్లలు ఎక్కువ మంది ఉన్నారని, అయితే వర్కర్స్‌ లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నారని వసతిగృహం హెచ్‌డబ్ల్యూఓ తెలిపారు. గిద్దలూరు బాయ్స్‌ హాస్టల్‌ కట్టలేదని సమీక్ష దృష్టికి వార్డెన్‌ తీసుకువచ్చారు. వసతి గృహాల్లో పిల్లలను పెంచమని అడుగుతుంటే సౌకర్యాలు లేవని చెబుతారేంటని అసహనం వ్యక్తం చేశారు. ఒంగోలులో ఉన్న రెండు కళాశాల వసతి గృహాల్లో తక్కువ మంది పిల్లలు ఉండటంపై వార్డెన్లను నిలదీశారు. వందమంది పిల్లలకు అవకాశం కల్పిస్తుంటే 40 నుంచి 50 మంది పిల్లలు ఉండటం ఏంటని ప్రశ్నించారు. ఈ సారి సమావేశానికి కల్లా ఒక్కో వసతి గృహంలో 80 మంది పిల్లలు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కరపత్రాలు ముద్రించి ప్రచారం చేయడంతో పాటు ప్రసార మాద్యమాల్లో ప్రచారం కల్పించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రెండు రోజుల్లో వసతి గృహాలను తనిఖీ చేస్తామన్నారు.

మంచి ఫలితాలు సాధించాలి..
పదో తరగతి పరీక్షల్లో మంచి ఫలితాలు వచ్చేలా విద్యార్థులను బాగా చదివించాలని ఆయన సూచించారు. ముఖ్యంగా పిల్లలకు ఉపకార వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. పోస్ట్‌మెట్రిక్‌ ఉపకార వేతనానికి 3,533 దరఖాస్తులు రిజిస్ట్రేషన్‌ అవ్వగా, ప్రీ మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌లకు 900 రిజిస్ట్రేషన్‌ అయినట్లు తెలిపారు. ప్రీ మెట్రిక్‌ స్కాలర్‌ షిప్‌లలో ఇంకా 242 మంది పిల్లల దరఖాస్తులకు సంబంధించి రిపోర్టు రావాల్సి ఉందని తెలిపారు. ప్రతి ఒక్కరికీ ఉపకార వేతనం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమస్యలన్నింటినీ నెల రోజుల్లో పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సారి సమీక్షా సమావేశం నాటికి ఉద్యోగులకు సంబంధించిన ఇంక్రిమెంట్‌లు ఏ ఒక్కటీ పెండింగ్‌లో ఉండకూడదని సంబంధిత సెక్షన్‌ ఉద్యోగిని హెచ్చరించారు. ఉంటే మాత్రం చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ ట్రైబల్‌ అధికారి జోజయ్య, కార్యాలయ సూపరింటెండెంట్లు, సిబ్బంది పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top