ఆదివాసీ దినోత్సవం.. టీడీపీ ప్రచార ఆర్భాటం

Tribal Students Protest In Chandrababu Naidu World Tribal Day Visakhapatnam - Sakshi

పాడేరు, అరకు నియోజకవర్గాల నుంచి భారీగా బస్సుల్లో జనసమీకరణ

సాక్షి,విశాఖపట్నం/పాడేరు: రాష్ట్ర ప్రభుత్వం గురువారం నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవం తెలుగుదేశం పార్టీ  ప్రచారసభగా సాగింది. జూనియర్‌ కళాశాల మైదానంలో ఆదివాసీ దినోత్సవం నిర్వహణకు భారీ ఏర్పాట్లు చేశారు. ఈ ఆదివాసి దినోత్సవ కార్యక్రమానికి దాదాపు రూ.3 కోట్ల వెచ్చించినట్లు అంచనా. ఏర్పాట్లు చేసిన అధికార యంత్రాంగం సభా ప్రాంగణాన్ని శక్తి వంచన లేకుండా పచ్చదనంతో నింపింది. పాడేరు, అరకు నియోజకవర్గాల 11 మండలాల నుంచి భారీగా జన సమీకరణ చేశారు. డ్వాక్రా రుణాలు, హక్కు పత్రాల పంపిణీ, ట్రైకార్, ఎన్‌ఎస్‌ఎఫ్‌డీసీ పథకాలకు సంబంధించిన లబ్ధిదారులందరినీ సభకు తీసుకువచ్చారు. వెలుగు అ«ధికారులు ద్వారా అన్ని ప్రాంతాలకు బస్సులు ఏర్పాటు చేసి ఉదయం 11గంటలకే సభా ప్రాంగణానికి మహిళల్ని, గిరిజనుల్ని తరలించారు.   మండలాల నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు   పచ్చ జెండాలతో ర్యాలీ నిర్వహించారు. మొత్తం మీద ఆదివాసి దినోత్సవ సభ టీడీపీ ప్రచారవేదికగా సాగింది.

ఎన్నికల్లో ఈ అభిమానంచూపించండి: సీఎం
ఎన్‌టీరామారావును, ఆయన చేసిన అభివృద్ధిని గుర్తు చేసుకోవాలని, తెలుగుదేశం పార్టీపై అభిమానం చూపించాలని, ఆదివాసి దినోత్సవ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కోరారు. తాను పాడేరు చాలా సార్లు వచ్చానని ఇంతటి ఆనందం ఎప్పుడు కలగలేదన్నారు.   ఎన్నికల్లో టీడీపీ పట్ల ఆదరాభిమానాలు చూపించాలన్నారు. గిరిజన సంక్షేమం కోసం తమ ప్రభుత్వం ఎంతో తపన పడుతోందని, గిరిజనుల అభివృద్ధిని, హక్కుల్ని సాధించడంలో ముందుం టానని     గంటన్నరసేపు ప్రసంగం కొనసాగించారు.

విద్యార్థినుల తిప్పలు  
ఆదివాసీ దినోత్సవ కార్యక్రమానికి సాంస్కృతిక, నృత్య ప్రదర్శనలు ఇవ్వడానికి వచ్చిన పలు పాఠశాలల విద్యార్థినులు అవస్థలకు గురయ్యారు. నృత్య ప్రదర్శనలు ఇవ్వడానికి ఉదయం 9గంటలకే ఉత్సాహంగా బాలికలు  సిద్ధమై సభా ప్రాంగణానికి వచ్చారు. మధ్యాహ్నం 2గంటలకు ఈ ప్రదర్శనలు ముగిసినా సీఎం పర్యటన కారణంగా భద్రతా వలయాన్ని దాటుకుని సభా ప్రాంగణం నుంచి ఎటూ కదల్లేకపోయారు. సీఎం ప్రసంగం ముగిసేవరకు దాదాపు నాలుగున్నర గంటల వరకు వారు ఆకలిదప్పులతో సభా ప్రాంగణంలోనే తిప్పలు పడ్డారు. నిర్వాహకులు ఎటువంటి ఏర్పాట్లు చేయకపోవడంతో సుమారు 50 మంది విద్యార్థినులు అవస్థలకు గురయ్యారు.

మూతపడిన దుకాణాలు, షాపులు
సీఎం పర్యటన పుణ్యమాని పాడేరులోని పాతబస్టాండ్, ఆర్టీసీ కాంప్లెక్సులోని షాపులు, దుకాణాలు మూతపడ్డాయి. రోడ్డుకు ఇరువైపులా బారీకేడ్లు వేసి సీఎం పర్యటన ముగిసే వరకు ఈ ప్రాంతంలో షాపులన్నీ మూసివేయించారు.  సీఎం పర్యటన దృష్ట్యా వాహనాల్ని అనుమతించకపోవడంతో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చిన వారు అడారిమెట్ట నుంచి సుమారు 4 కిలోమీటర్లు   నడిచి సభా ప్రాంగణానికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

సీఎం కాన్వాయ్‌ అడ్డగింపు
సీఎం చంద్రబాబు పాల్గొన్న ఆదివాసీ దినోత్సవంలో గిరిజన నాయకులు నల్ల జెండాలతో నిరసన తెలిపారు. సీఎం కాన్వాయ్‌కు అడ్డుకున్నారు. బాక్సైజ్‌ జీవో నంబరు 97ను రద్దు చేయాలని, ప్రత్యేక డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. బోయలను ఎస్టీ జాబితాలో చేర్చవద్దని, గిరిజన వర్సటీ ఏర్పాటు చేయాలని నినదించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top