చిల్లంగి నెపంతో హత్య!

Tribal Man Assassination In Vijayanagar District - Sakshi

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వైనం

ఏజెన్సీలో మూఢనమ్మకాలకు మరో ప్రాణం బలి

17 మంది అనుమానితులపై కేసు   

ప్రపంచం అంతా శాస్త్ర, సాంకేతిక, విజ్ఞాన రంగాల్లో దూసుకుపోతుంటే మారుమూల ఏజెన్సీ గ్రామాల్లో మాత్రం నేటికీ మూఢనమ్మకాలను వీడడం లేదు. చిల్లంగి, దెయ్యం పట్టింది వంటి మూఢనమ్మకాలను గిరిజనులు నమ్ముతూనే ఉన్నారు. ఫలితంగా వారి అనుమానాలు హత్యకు దారి తీస్తున్నాయి. తాజాగా గుమ్మలక్ష్మీపురం మండలంలో  చిల్లంగి పేరిట జరిగిన హత్యే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ!

గుమ్మలక్ష్మీపురం: ఏజెన్సీలో మూఢనమ్మకానికి మరో ప్రాణం బలైంది. చిల్లంగి నెపంతో ఓ గిరిజనుడిని అతికిరాతకంగా రాళ్లతో కొట్టి చంపిన సంఘటన మండలంలో చోటు చేసుకొంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించి ఎలి్వన్‌పేట సీఐ రమేష్‌కుమార్‌ విలేకరులకు బుధవారం వివరాలు వెల్లడించారు. మండలంలోని నెల్లికెక్కువ పంచాయతీ కొండకూనేరు గ్రామానికి చెందిన పల్లెరిక ప్రసాద్‌(23) అనే యువకుడు అనారోగ్యంతో ఈ నెల 11న మృతి చెందాడు. యువకుడి కుటుంబ సభ్యులు అదే రోజు అంత్యక్రియలు గ్రామంలో జరిపారు. అయితే ప్రసాద్‌ చిల్లంగి పెట్టడం వల్లే చనిపోయాడని, చిల్లంగి పెట్టింది అదే గ్రామానికి చెందిన పల్లెరుక మిన్నారావు అలియాస్‌ బారికి(46) అని కుటుంబ సభ్యులు అనుమానించారు. బారికిని ఎలాగైన మట్టుబెట్టాలని భావించిన ప్రసాద్‌ కుటుంబీకులు అదే రోజు మధ్యాహ్నం బారికి ఇంటికి వెళ్లి ప్రసాద్‌ మృతదేహం దహనమైందో..లేదో చూసి వద్దామని మాయమాటలు చెప్పి శ్మశాన వాటిక వద్దకు తీసుకువెళ్లారు.

అక్కడ రాళ్లతో అతి కిరాతకంగా కొట్టి చంపారు. అనంతరం బారికి మృతదేహాన్ని ప్రసాద్‌ అంత్యక్రియలు జరిగిన చోటే నిప్పు పెట్టి ఖననం చేసి ఇంటికొచ్చేశారు. తరువాత గ్రామంలో బారికి కనిపించకపోవడంతో పక్క గ్రామమైన డొంగరికెక్కువ గ్రామంలో నివసిస్తున్న బారికి మేనల్లుడు మండంగి వెంకటరావు పరిసర గ్రామాల్లో వెదికాడు. దీన్ని గమనించిన ప్రసాద్‌ బంధువు వెంకటరావు ఈ నెల 21న కొండకూనేరు గ్రామానికి పిలిపించి  ప్రసాద్‌ను చిల్లంగి పెట్టి చంపినందునే బారికిని తాము చంపేశామని వెల్లడించారు. దీన్ని వివాదం చేయొద్దని పరిష్కరించుకుందామని వెంకటరావుతో మాట్లాడగా అందుకు నిరాకరించిన ఆయన ఎలి్వన్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అందిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ పి.నారాయణరావు ఆధ్వర్యంలో హెచ్‌సీ ఎన్‌.నాగేశ్వరరావు ఇతర సిబ్బంది గ్రామానికి వెళ్లి విచారణ చేపట్టారు. అనుమానితులైన 17 మందిపై కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు. కొండకూనేరులో బారికి ఒంటిరిగా జీవిస్తుండడంతో సమాచారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని సీఐ తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ఇదిలా ఉండగా ఈ ఏడాది మే 26న ఇదే మండలంలో డుమ్మంగి పంచాయతీ టెంకసింగి గ్రామంలో  చిల్లంగి నెపంతో జరిగిన హత్యను మరువక ముందే మళ్లీ అటువంటి సంఘటనే పునరావృతం కావడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top