పట్టాల పందేరం | Sakshi
Sakshi News home page

పట్టాల పందేరం

Published Sat, Aug 2 2014 3:22 AM

Track racing

తాడిపత్రి : మీకు ఇంటి పట్టా కావాలా? అర్హత లేకున్నా పట్టాను ఆశిస్తున్నారా? ఎక్కడో కొండ గుట్టలు కాదు.. పట్టణానికి సమీపంలోనే స్థలం కేటాయించాలని కోరుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే తాడిపత్రికి వచ్చేయండి. మీరు పేదలు కాకపోయినా, ఇంటి పట్టా తీసుకోవడానికి ఏమాత్రమూ అర్హతలు లేకపోయినా రెవెన్యూ అధికారులు మీకు సహాయపడతారు. వారు నియమించుకున్న దళారులకు అంతో ఇంతో ముట్టజెబితే చాలు..విలువైన స్థలాన్ని రాసిచ్చేస్తారు.
 
 ఇప్పటికే పట్టణానికి అతి సమీపంలో పరిశ్రమలకు ఆనుకొని తాడిపత్రి-పెద్దపప్పూరు రోడ్డు పక్కనే ఉన్న ప్రభుత్వ స్థలాన్ని పంచి పెట్టేశారు. 20 ఏళ్ల క్రితం నాల్గో తరగతి ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన స్థలాలపైనా మళ్లీ పట్టాలిచ్చారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. తాడిపత్రికి సమీపంలో చిన్నపొలమడ గ్రామ సర్వే నంబర్ 369, 371-బీలలో సుమారు 15 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది. ఇక్కడే 1988లో తాడిపత్రి ప్రాంతంలో పనిచేసే నాల్గోతరగతి ఉద్యోగులు 132  మందికి స్థలాలు కేటాయించారు. వారిక్కడ ఇళ్లు నిర్మించుకోలేదు. ఈ స్థలంపై కన్నుపడిన కొంత మంది దళారులు.. నిరుపేదలకు పట్టాలు ఇవ్వాలన్న పేరుతో మధ్యవర్తిత్వం వహించి రెవెన్యూ అధికారులను మచ్చిక చేసుకున్నారు. దీంతో అధికారులు ఏకంగా 280 వరకు బోగస్ పట్టాలు సృష్టించి నేరుగా దళారులకు అందజేశారు.  పోలింగ్ బూత్ అధికారులు (బీఎల్‌ఓలు)గా  పనిచేసిన సుమారు 185 మంది పేర్లతోనూ పట్టాలు జారీ చేశారు. ఈ వ్యవహారమంతా సాధారణ ఎన్నికల ముందు గుట్టుచప్పుడు కాకుండా కానిచ్చేశారు. ఈ పట్టాలను దళారులు రూ.వెయ్యి మొదలుకుని అంతకంటే ఎక్కువ మొత్తానికి అమ్మడం ప్రారంభించారు.
 
 ఈ విషయం చిన్నపొలమడ గ్రామస్తులకు తెలియడంతో తమ గ్రామంలోని నిరుపేదలకు కాకుండా ఇతరులకు ఎలా పట్టాలు ఇస్తారంటూ స్థలాన్ని ఆక్రమించేశారు. అలాగే  విషయాన్ని ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. నాలుగు రోజుల క్రితం ఎమ్మెల్యే..  తహశీల్దార్ రామకృష్ణారెడ్డిని, రెవెన్యూ అధికారులను పిలిపించి తనకు కానీ, అప్పట్లో ఉన్న ఎమ్మెల్మేకు కానీ తెలియకుండా ఇన్ని పట్టాలు ఎలా ఇచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తం పట్టాలన్నీ రద్దు చేయాలని ఆదేశించారు.  
 
 పట్టాలు మా వద్దే ఉన్నాయి
 ఇళ్ల పట్టాలు తయారు చేసిన మాట వాస్తవమే. అయితే.. వాటిని ఇంకా లబ్ధిదారులకు ఇవ్వలేదు. మా వద్దనే ఉన్నాయి. లబ్ధిదారుల జాబితాను ఎమ్మెల్యే పరిశీలించిన తర్వాత, ఆయన ఆమోదం మేరకు అర్హులకు మాత్రమే పంపిణీ చేస్తాం.               
 - తహశీల్దార్ రామకృష్ణారెడ్డి
 

 
Advertisement
 
Advertisement