
అధికార పార్టీ నాయకుల ఆక్రమణల పర్వం
పట్టపగలే ఆక్రమించి సాగుకు అనువుగా చేసిన వైనం
తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండలంలో ఘటన
దొరవారిసత్రం: తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండలంలోని నెలబల్లి గ్రామ సమీపంలో జాతీయ రహదారి పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిని స్థానిక అధికార టీడీపీ నేతలు చెరబట్టారు. ఎకరం రూ.50 లక్షలు విలువచేసే సుమారు పదెకరాల భూముని చదునుచేసి సాగుకు అనువుగా మార్చుకున్న ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. వివరాలివీ..
నెలబల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబరు 7లో 71 ఎకరాల భూమిలో బీసీ, ఎస్సీ కాలనీలు, వివిధ ప్రభుత్వ భవనాలు, పాఠశాల నిర్మాణాలకు పోనూ రహదారి వెంబడే 20 ఎకరాలకు పైబడి ప్రభుత్వ భూమి ఖాళీగా ఉంది. ఈ ప్రాంతంలో రోడ్డుపక్క భూములు ఎకరా రూ.50 లక్షల వరకు ధర పలుకుతున్నాయి. గతంలో ఈ భూముల దురాక్రమణను అప్పటి రెవెన్యూ అధికారులు గుర్తించి పీఓబీ (ప్రొహిబిటెడ్ ఆర్డర్ బుక్)లో నమోదు చేశారు. అయినా ఐదెకరాలు వరకు ఆక్రమణకు గురైంది.
నాలుగు నెలలు కిందట సూళ్లూరుపేట నియోజకవర్గంలోని మాజీ ప్రజాప్రతినిధి కనుసన్నల్లో స్థానిక అధికార పార్టీ నాయకులు కొందరు సుమారు పదెకరాల భూమిని ఆక్ర మించేందుకు ప్రయత్నం చేశారు. రెవెన్యూ అధికారులు ఇది గుర్తించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటుచేశారు.
మళ్లీ అదే మాజీ ప్రజాప్రతినిధి సహకారం, సూచనలతో మూడ్రోజుల నుంచి పట్టపగలే పీఓబీ కింద ఉన్న పదెకరాల ప్రభుత్వ భూమిని యంత్రాలతో హద్దులు నిర్ణయించి ట్రాక్టర్లతో దున్ని సాగుకు అనువుగా మార్చుకుంటున్నారు. ఈ దందాలో సూళ్లూరుపేట నియోజకవర్గం మాజీ ప్రజాప్రతినిధికి కూడా వాటా ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. రెవెన్యూ అధికారులు తెలిసినా చోద్యం చూస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.