
రియల్ కంపెనీకి నామమాత్రపు ధరకు ఇవ్వడం చట్టవిరుద్ధం
సత్వా గ్రూపునకు భూ కేటాయింపులను రద్దు చేయండి
హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం
సాక్షి, అమరావతి: విశాఖపట్నం, మధురవాడలోని అత్యంత విలువైన 30 ఎకరాల ప్రభుత్వ భూమిని చట్ట విరుద్ధంగా నామమాత్రపు ధరకే రియల్ ఎస్టేట్ కంపెనీ సత్వా గ్రూపునకు కేటాయించడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. మార్కెట్‌లో ఎకరా రూ.12 కోట్లు ఉన్న భూమి కేవలం రూ.1.5 కోట్లకే కేటాయించారని, వీటిని రద్దు చేయాలని కోరుతూ జీవీఎంసీ కౌన్సిలర్ మేడపాటి వెంకటరెడ్డి ఈ పిల్‌ను దాఖలు చేశారు.
ఈ వ్యాజ్యంపై బుధవారం హైకోర్టు విచారణ జరిపింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. సత్వా గ్రూపునకు రూ.360 కోట్ల విలువైన భూమిని రూ.45 కోట్లకే ఆ కంపెనీకి ఇచ్చేశారని తెలిపారు. ఆ భూమిలో రియల్ కంపెనీ ఆఫీసు కార్యాలయాలను నిర్మించి లీజుకిచ్చి సొమ్ము చేసుకుంటుందని పొన్నవోలు చెప్పారు.
అనంతరం భూ కేటాయింపుల విధానాన్నే సవాలు చేస్తామని, అందుకు అనుగుణంగా ఈ వ్యాజ్యంలో సవరణలకు అనుమతివ్వాలని ధర్మాసనాన్ని కోరారు. ఇందుకు ధర్మాసనం అంగీకరిస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది.