వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల గురువారం నుంచి జిల్లాలో మూడు రోజులపాటు పర్యటించనున్నారు.
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల గురువారం నుంచి జిల్లాలో మూడు రోజులపాటు పర్యటించనున్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె నెల్లూరు జిల్లా కావలి నుంచి మధ్యాహ్నం 3 గంటలకు చీమకుర్తి చేరుకుని అక్కడ సభలో ప్రసంగించిన తరువాత, సాయంత్రం 6 గంటలకు కనిగిరి వెళ్లి ప్రజలనుద్దేశించి మాట్లాడతారు. రాత్రి అక్కడే బస చేస్తారు. ఈమేరకు జిల్లా కన్వీనరు డాక్టర్ నూకసాని బాలాజీ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 21వ తేదీ ఉదయం ఆమె కనిగిరి నుంచి బయలుదేరి గిద్దలూరు చేరుకుంటారు. అక్కడ ఉదయం 10.30 గంటలకు బహిరంగ సభలో ప్రసంగిస్తారు. సాయంత్రం 4 గంటలకు మార్కాపురం వచ్చి అక్కడ ప్రసంగించిన తరువాత, గుంటూరు జిల్లా వినుకొండకు వెళతారు.
రాత్రి అక్కడే బస చేసి, 22వ తేదీన ఉదయం పది గంటలకు అద్దంకి చేరుకుని ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. మధ్యాహ్నం గుంటూరు జిల్లా చిలకలూరిపేట చేరుకుని, అక్కడ ఎన్నికల ప్రచారం చేపట్టి, తిరిగి సాయంత్రం 6 గంటలకు చీరాల వచ్చి సభలో మాట్లాడతారు. షర్మిల రాక కోసం పార్టీ కార్యకర్తలు భారీగా స్వాగత ఏర్పాట్లు చే స్తున్నారు. ఈ సందర్భంగా నూకసాని బాలాజీ మాట్లాడుతూ షర్మిల సభలకు ప్రజలు భారీగా తరలి రావాలని పిలుపునిచ్చారు. జిల్లాలోని ఆరు మునిసిపాలిటీల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయ పతాకం ఎగుర వేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. షర్మిల పర్యటన సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు, నాయకులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని తెలిపారు. ప్రచార సభలను విజయవంతం చేయడానికి ప్రతి కార్యకర్త ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.