నేడు మానవహారాలు

Today human chains - Sakshi

నియోజకవర్గ కేంద్రాల్లో నిరసనలు

అవిశ్వాసానికి సంఘీభావంగా ఆందోళనలు

వైఎస్సార్‌సీపీ నంద్యాల, కర్నూలు పార్లమెంటరీ

జిల్లా అధ్యక్షులు శిల్పా చక్రపాణిరెడ్డి, బీవై రామయ్య

కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో సోమవారం మానవహారాలు నిర్వహించనున్నట్లు ఆ పార్టీ నంద్యాల, కర్నూలు పార్లమెంటరీ జిల్లాల అధ్యక్షులు శిల్పా చక్రపాణిరెడ్డి, బీవై రామయ్య తెలిపారు. ప్రత్యేక హోదా కోసం సోమవారం పార్లమెంట్‌లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానం చర్చకు రానున్నదని, ఈ నేపథ్యంలో పార్టీ   ఎంపీల పోరాటానికి మద్దతుగా మానవహారాలు చేస్తున్నట్లు చెప్పారు. ఆదివారం వారు సాక్షితో మాట్లాడుతూ.. జిల్లాలోని 14 నిమోజకవర్గాల్లో సంఘీభావ మానవ హారాలు చేపట్టాలని, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

ఏపీకి ప్రత్యేక హోదా వచ్చే వరకు వైఎస్సార్‌సీపీ నిరంతర పోరాటాలతో ప్రజల్లో ఉంటుందన్నారు. ఐదు కోట్ల ఆంధ్రుల గుండె చప్పుడు ప్రత్యేక హోదా అని, దానిని ఇవ్వబోమని చెప్పడానికి ఎవరికీ హక్కు లేదన్నారు.  సీఎం చంద్రబాబునాయుడు స్వలాభం చూసుకోవడంతో హోదా నాలుగేళ్లు ఆలస్యమైందన్నారు. మూడేళ్ల క్రితమే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజ్‌ వద్దని, ప్రత్యేక హోదా ఇవ్వాలని అడిగి ఉంటే వచ్చేదన్నారు. అయితే సీఎం చంద్రబాబునాయుడు ఓటుకు ఓటు కేసులో ఇరుక్కోవడం, లక్షల కోట్లు అవినీతి చేయడం తదితర కారణాలతో కేంద్రం.. రాష్ట్రానికి అన్యాయం చేసిందన్నారు.

నాటి నుంచి నేటి వరకు తమ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక హోదా కోసమే పోరాడుతున్నారన్నారు. నాలుగేళ్లు తరువాత సీఎం చంద్రబాబునాయుడు ప్రత్యేక హోదా అంటూ యూటర్న్‌ తీసుకొని.. పోరాటం చేస్తున్నాని చెప్పితే నమ్మేందుకు ప్రజలెవరూ సిద్ధంగా లేరన్నారు. హోదాతో ఏమీ రావని, అది ముగిసిన అధ్యాయం అని చెప్పిన సీఎం.. ఊసరవెల్లిలా ఎన్నికలు దగ్గర పడడంతో మాటమార్చారన్నారు. కేంద్ర ప్రభుత్వంపై రెండోసారి వైఎస్‌ఆర్‌సీపీ ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానానికి తెలుగుదేశం పార్టీ మద్దతు ఇవ్వాలని, లేదంటే ప్రజలే వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారన్నారు.    
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top