మృత్యుపిడుగుతో నలుగురు రైతులు దుర్మరణం | Thunderbolt killed four farmers | Sakshi
Sakshi News home page

మృత్యుపిడుగుతో నలుగురు రైతులు దుర్మరణం

Oct 9 2013 4:17 AM | Updated on Oct 1 2018 2:00 PM

‘రెక్కాడితేగానీ డొక్కాడని బతుకులు వారివి..’ పోడుకొట్టుకుంటే గానీ పూటగడవని దయనీయం వారిది. అందుకే రెక్కలుముక్కలు చేసుకొని పోడుకొట్టుకున్నారు.

పినపాక, న్యూస్‌లైన్‌: ‘రెక్కాడితేగానీ డొక్కాడని బతుకులు వారివి..’ పోడుకొట్టుకుంటే గానీ పూటగడవని దయనీయం వారిది. అందుకే రెక్కలుముక్కలు చేసుకొని పోడుకొట్టుకున్నారు. ఒక్కొక్కరు రెండెకరాల చొప్పున పత్తి సాగుచేస్తున్నారు. ఎప్పటిలాగే మంగళవారం కూడా చేలకు వెళ్లారు. సాగుచేస్తున్న చేలల్లో కలుపుతీస్తున్నారు. ఇంతలో ఆకాశంలో మబ్బులు కమ్ముకున్నాయి. ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురవసాగింది. రైతులు, కూలీలు ఇలా మొత్తం పదిమంది సమీపంలోని ఓ పూరిపాక కిందకు వెళ్లారు. దురదృష్టం వెంటాడింది.. మృత్యువు తరుముకొచ్చింది..భారీ శబ్ధంతో ఉరుము ఉరిమింది. పిడుగు వచ్చి రైతులు, కూలీలు తలదాచుకున్న ఆ పూరిపాకపై పడింది.

అంతే తాటి లకిష్మ(35), శర్పా సత్యనారాయణ (25), చందా యశోద(50), చందా లకిష్మ(60) అనే గిరిజన రైతులు అక్కడికక్కడే మృతి చెందారు. శర్పా రాంబాయి, శర్పా సత్యం, శర్పా ఆదిలకిష్మ, చందా సుభం, మైపతి విజయలకిష్మ, చందా సీతారాములమ్మ అనే ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులందరూ మండలంలోని చిరుమళ్ల గ్రామానికి చెందినవారే. పైగా సమీప బంధువులు కావడంతో ఆ గ్రామమంతా శోకసంద్రంలో మునిగింది. పిడుగు వార్తవిని...

గ్రామశివారున ఉన్న మీదిచెరువు వద్ద పిడుగుపడి నలుగురు మృతిచెందారన్న వార్త తెలియగానే ఊరుఊరంతా అటువైపుగా పరుగులు తీసింది. ‘అయ్యో బిడ్డలారా...ఎంత ఘోరం జరిగిపోయిందే..’అంటూ గ్రామస్తులంతా కన్నీరుమున్నీరయ్యారు. ఓవైపు తీవ్రగాయాలు...మరోవైపు కుమారుడి మరణం...శర్ప సత్యనారాయణ తల్లి ఆదిలకిష్మ పరిస్థితి హృదయవిదారకంగా మారింది. గాయాలతో సతమతమవుతూ ఆమె ఏడుస్తున్న తీరు కంటతడి పెట్టించింది.

ఈ ఘటనలో మృతిచెందిన మరో ఇద్దరు చందా లకిష్మ, చందా యశోద కుటుంబాలకు ప్రధాన ఆదరువు కావడంతో వారి కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో పడ్డాయి. రెక్కలు ముక్కలు చేసుకుని కుటుంబాలను పోషిస్తున్న వీరి మరణం వారి కుటుంబాలను ఏకాకులను చేసింది. చిరుమళ్ల గ్రామంలో పిడుగుపడి నలుగురు మృతిచెందిన విషయం తెలిసి సమీపంలోని కరకగూడెం, మోతె, అనంతారం, సమత్‌భట్టుపల్లి, భట్టుపల్లి గ్రామాల ప్రజలు తండోపతండాలుగా వచ్చి మృతులు, బాధితులను చూసి కన్నీరుమున్నీరవుతున్నారు. మృతదేహాలను కావడిలో తీసుకెళ్లి గ్రామస్తులు దహనసంస్కారాలకు ఏర్పాట్లు చేస్తున్నారు.

స్పందించిన గ్రామీణ వైద్యులు
చిరుమళ్ల గ్రామంలో పిడుగుపడి నలుగురు మృతిచెందారని, ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారనే విషయం తెలిసిన వెంటనే పినపాక మండలం గ్రామీణ వైద్యుల సంఘం స్పందించింది. హుటాహుటిన వైద్యులు ఆ గ్రామానికి వెళ్లి క్షతగాత్రులకు వైద్యసేవలు అందిస్తున్నారు. బీపీ పరీక్షించి సెలైన్‌ ఎక్కిస్తున్నారు. పిడుగుపాటుకు విద్యుత్‌ సరఫరా కూడా నిలిచిపోవడంతో గ్రామంలో అంధకారం నెలకొంది. అయినా దీపాలు, టార్చీలైట్ల వెలుతురులో ఆర్‌ఎంపీలు వైద్యసేవలు అందించారు. రెండుగంటలపాటు వైద్యసేవలందించిన అనంతరం క్షతగాత్రులను కరకగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సకాలంలో స్పందించిన గ్రామీణ వైద్యులను పలువురు అభినందించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement