తీగ లాగితే డొంక కదిలింది

Thieves Arrested In Anantapur - Sakshi

మద్యం దుకాణంలో చోరీ కేసులో ముగ్గురి అరెస్ట్‌ 

నిందితుల్లో ఇద్దరు మైనర్లు 

నగదు, వస్తువుల స్వాధీనం 

సాక్షి, అనంతపురం: తీగలాగితే డొంక కదిలింది. నెలన్నర క్రితం నల్లమాడ మండల కేంద్రంలో జరిగిన మద్యం దుకాణం చోరీ కేసును తాడిపత్రి, సీసీఎస్‌ పోలీసులు సంయుక్తంగా చేధించారు. ముగ్గురు నిందితులను అరెస్ట్‌ చేశారు. నిందితుల్లో ఒక యువకుడు, మరో ఇద్దరు మైనర్లు ఉన్నారు. వీరి నుంచి రూ. 10.84 లక్షల నగదు, రెండు ద్విచక్రవాహనాలు, 9 సెల్‌ఫోన్లు, ఒక డీవీఆర్, సీపీయూ, మూడు కెమెరాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ రూ.16 లక్షలు ఉంటుందని తెలిపారు. నిందితులను లోతుగా విచారిస్తే మరో రెండు దొంగతనాల కేసులు బయటపడ్డాయి. ఇందుకు సంబంధించిన వివరాలను మంగళవారం స్థానిక పోలీసు కాన్ఫరెన్స్‌ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ బూసారపు సత్యయేసుబాబు వెల్లడించారు.  

కదిరి పట్టణం గజ్జెలరెడ్డిపల్లికి చెందిన పోతుల శివకుమార్‌(23)తో పాటు మరో ఇద్దరు మైనర్లు ఈ ఏడాది జూన్‌ 20న అర్ధరాత్రి నల్లమాడలోని మద్యం దుకాణంలో చోరీకి పాల్పడ్డారు. ఆ దుకాణం పైకప్పు రేకును కత్తిరించి లోపలికి ప్రవేశించారు. అందులో రూ. 12లక్షల నగదు, డీవీఆర్‌ బాక్సును ఎత్తుకెళ్ళారు. దీంతో పాటు తాడిపత్రి పట్టణంలోని సీబీరోడ్డులో ఓ సెల్‌ఫోన్‌ దుకాణంలో ఈ ఏడాది జూన్‌ 6న దొంగతనానికి పాల్పడ్డారు. గతంలో 2017లో అనంతపురం మార్కెట్‌యార్డు సమీపంలో ఓ ఫొటో స్టుడియోలో కెమెరాలు దొంగిలించారు. చోరీ సొత్తును సమానంగా పంచుకొని జల్సాలు చేసేవారు.  

ప్రధాన నిందితుడు పాత నేరస్తుడు 

  • ప్రధాన నిందితుడు పోతుల శివకుమార్‌ పాత నేరస్తుడు. 2014 నుంచి చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. జిల్లాతో పాటు తిరుపతి, గుంటూరు, నరసరావుపేట ప్రాంతాల్లో నేరాలకు పాల్పడ్డాడు. ఈ కేసుల్లో రిమాండ్‌ అనుభవించి జైలు నుంచి బయటకు వచ్చాక తిరిగి నేరప్రవృత్తిని కొనసాగిస్తూ వస్తున్నాడు.  
  • నల్లమాడ, తాడిపత్రిలో జరిగిన దొంగతనాలపై ప్రత్యేక దృష్టి సారించిన సీసీఎస్, తాడిపత్రి పోలీసులు నిందితులను తాడిపత్రి పట్టణంలోని ఫ్లై ఓవర్‌ సమీపంలో అరెస్ట్‌ చేశారు. కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో అడిషనల్‌ ఎస్పీ చౌడేశ్వరి, తాడిపత్రి డీఎస్పీ శ్రీనివాసులు, సీసీఎస్‌ డీఎస్పీ శ్రీనివాసులు, అనంతపురం డీఎస్పీ వీరరాఘవరెడ్డి, సీఐలు తేజోమూర్తి, నరసింహారావు, శ్యాంరావు, ఎస్‌ఐలు శంకర్‌రెడ్డి, జగదీష్, జనార్దన్, చలపతి, సిబ్బంది రఘు, గోవిందు, ప్రవీణ్, ఫరూక్, శ్రీనివాసులు, రంజిత్, మల్లికార్జున, నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు.
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top