పీపీఈ కిట్లు, మాస్కులకు కొరత లేదు

There is no shortage of PPE kits and masks says Kanna Babu - Sakshi

ఉద్దేశపూర్వకంగానే కొంతమంది దుష్ప్రచారం

వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు

సాక్షి, విశాఖపట్నం: కరోనా వైరస్‌ బాధితులకు వైద్యం అందిస్తున్న వైద్యులకు, పారామెడికల్‌ సిబ్బందికి పీపీఈ కిట్‌లు, మాస్కులకు ఎలాంటి కొరత లేదని వ్యవసాయ శాఖ మంత్రి, విశాఖ జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి కురసాల కన్నబాబు వెల్లడించారు. విశాఖ జిల్లాలో కరోనా వైరస్‌ కట్టడికి చేపట్టిన చర్యలపై ప్రభుత్వాధికారులు, వైద్యులు, ప్రత్యేక కమిటీల సభ్యులతో శుక్రవారం విశాఖలో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, మంత్రులు బొత్స సత్యనారాయణ, ముత్తంశెట్టి శ్రీనివాస్‌లతోపాటు ఎంపీలు సత్యనారాయణ, సత్యవతి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇందులో పాల్గొన్నారు. 

► సమీక్ష అనంతరం కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ.. వైద్యులకు, వైద్య సిబ్బందికి, పారిశుధ్య కార్మికులందరికీ తగిన రక్షణ ఏర్పాట్లు ఉన్నాయని తెలిపారు. 
► కొరత ఉన్నట్లుగా కొంతమంది సామాజిక మాధ్యమాల్లో ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి చర్యలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందన్నారు.
► రాష్ట్రంలో అర్హులైన వారందరికీ రేషన్‌ సరుకులు అందిస్తున్నట్లు చెప్పారు. 
► రైతులకు మద్దతు ధరలు అందేలా పంటల కొనుగోలుకు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. దళారులు, ప్రైవేటు వ్యాపారులు తక్కువ ధరకు రైతుల నుంచి పంటలను కొంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 
► అన్యాయం జరిగితే రైతులు 1902, 1907 టోల్‌ ఫ్రీ నంబర్లకు ఫోన్‌ చేయాలని సూచించారు. 
► అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకు చర్యలు చేపట్టామన్నారు. 
► కాగా, లాక్‌డౌన్‌తో విశాఖ జిల్లాలో ప్రజలెవరూ ఇబ్బంది పడకుండా తీసుకుంటున్న సహాయ చర్యల్లో పారిశ్రామికవేత్తలను మరింత భాగస్వాములను చేయడానికి ప్రయత్నిస్తున్నామని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి చెప్పారు. 
► రాష్ట్రంలో ఎక్కువగా విశాఖ జిల్లాలోనే పరిశ్రమలు ఉన్నాయని, కరోనా వైరస్‌ కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ఇప్పటికే పలు పరిశ్రమల యాజమాన్యాలు విరాళాలు ఇచ్చాయన్నారు. 
► ఆయా పరిశ్రమల కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్స్‌బిలిటీ (సీఎస్‌ఆర్‌) నిధులను ప్రజలకు సహాయం చేయడానికి వినియోగించాలని కోరారు. 
► ఇందుకోసం ఆయా పరిశ్రమల యాజమాన్యాలతో త్వరలోనే సమావేశం నిర్వహించాలని యోచిస్తున్నామన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top