విచారణ తూతూమంత్రం

There are Many criticisms on SIT Inquiry - Sakshi

జగన్‌పై హత్యాయత్నం జరిగి ఆరు రోజులైనా నిగ్గుతేలని నిజాలు 

నిందితుడు శ్రీనివాసరావు నేపథ్యంపై దృష్టి పెట్టని ‘సిట్‌’ 

శ్రీనివాసరావు రాసినట్టు చెబుతున్న లేఖ, కాల్‌డేటా చుట్టూనే దర్యాప్తు 

కీలక అంశాలను విస్మరిస్తున్న అధికారులు 

సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నానికి ఒడిగట్టిన శ్రీనివాసరావు నేపథ్యం గురించి ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) లోతుగా విచారణ చేపట్టడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జగన్‌పై హత్యాయత్నం ఘటన జరిగి మంగళవారం నాటికి ఆరు రోజులు గడిచిపోయింది. ఇంతవరకు విచారణ శ్రీనివాసరావు రాసినట్టు చెబుతున్న లేఖ, అతడి కాల్‌డేటా చుట్టూనే తిరుగుతోంది తప్ప నిందితుడి స్వగ్రామం తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం ఠానేల్లంక పరిసర గ్రామాల్లో అతడి వ్యవహారాలపై లోతైన పరిశీలన జరగకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఠానేల్లంక, ముమ్మిడివరం పరిసర ప్రాంతాల్లో శ్రీనివాసరావు ఇటీవల సాగించిన కార్యకలాపాల గురించి సీరియస్‌గా పరిశోధిస్తే కుట్రకు సంబంధించిన పక్కా ఆధారాలు లభించే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. 

 శ్రీనివాసరావు లీలలు 
నిందితుడు శ్రీనివాసరావు అక్టోబర్‌ 16న విశాఖపట్నం నుంచి ఠానేల్లంక వచ్చి సోదరుడి కుమారుడి పుట్టిన రోజు సందర్భంగా స్నేహితులకు భారీ స్థాయిలో విందు ఇచ్చాడు. ఇక వెనక్కి చూసుకోవాల్సిన పని లేదని, జీవితంలో స్థిరపడ్డట్టేనని, మంచి పార్టీ దొరికిందని అతడు తన స్నేహితులతో చెప్పినట్లు సమాచారం. శ్రీనివాసరావు ఇచ్చిన విందులో పాల్గొన్న స్నేహితులు ఎవరు? ఆ రోజు ఏయే అంశాలు చర్చకు వచ్చాయి? అనే అంశాలపై ఆరా తీస్తే హత్యాయత్నం కేసుకు సంబంధించిన విలువైన సమాచారం లభించనుంది. ఇటీవల లంక ఆఫ్‌ ఠానేల్లంకలో 4 ఎకరాలు లంక భూమి రూ.కోటికి కొనేందుకు శ్రీనివాసరావు ముందుకొచ్చాడని, అక్కడి భూ స్వామితో బేరం కూడా చేశాడని స్థానికులు బహిరంగంగానే చెబుతున్నారు. ఈ డీల్‌ వ్యవహారంపై దర్యాప్తు జరిపితే పలు కీలక  అంశాలు వెలుగులోకి వస్తాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నేర చరిత్ర కలిగిన శ్రీనివాసరావుకు విశాఖ ఎయిర్‌పోర్టులో తెలుగుదేశం పార్టీ నేత హర్షవర్దన్‌ ప్రసాద్‌ చౌదరి రెస్టారెంట్‌లో ఉద్యోగానికి సిఫార్సు చేయడానికి కారణమేమిటి? ఆ సిఫార్సు చేసింది ఎవరు? శ్రీనివాసరావుకు నిరభ్యంతర పత్రం(ఎన్‌ఓసీ) ఇవ్వడంలో ఎవరి ఒత్తిళ్లు ఉన్నాయనేది తేల్చే దిశగా విచారణ సాగితే కుట్రదారులు బయటపడతారంటున్నారు. 

 ఠానేల్లంకలో అలుముకున్న నిశ్శబ్దం 
శ్రీనివాసరావు స్వగ్రామం ముమ్మిడివరం మండలం ఠానేల్లంకలో నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. 4,000 ఓట్లు కలిగిన ఈ గ్రామ పంచాయతీలో శ్రీనివాసరావు నివాసం ఉండేది పెద్దపేట. ఆ పేటతోపాటు మిగిలిన శివారు గ్రామాల్లో స్థానికులు ఈ ఘటన చోటుచేసుకున్న దగ్గర నుంచి ఒక రకమైన భయంతో బతుకుతున్నారు. అధికార పార్టీ నేతలు జారీ చేసిన హుకుంతో స్థానికులు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి కూడా వెనుకంజ వేస్తున్న వాతావరణం కనిపిస్తోంది. ఎవరితో ఏమి మాట్లాడితే ఏమవుతుందోననే ఆందోళన నెలకొంది. చివరకు మొబైల్‌ ఫోన్లకు వచ్చే కాల్స్‌కు ఒకటికి, రెండుసార్లు సరి చూసుకున్న తరువాతే సమాధానం చెబుతున్నారు. బంధువులు, సన్నిహితులు సైతం ఠానేల్లంక రావడం మానుకున్నారు.  

3 నెలలుగా లేనిది ఆ రోజే ఎందుకు? 
ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మూడు నెలలుగా ప్రతి గురువారం హైదరాబాద్‌ వెళ్లడానికి విశాఖ ఎయిర్‌పోర్టు నుంచే ప్రయాణం చేస్తున్నారు. జగన్‌మోహన్‌రెడ్డికి శ్రీనివాసరావు వీరాభిమాని అయితే ఇన్ని నెలల్లో ఏ ఒక్క రోజైనా ఆయన్ను కనీసం చూసేందుకు, మాట్లాడేందుకు, ఫొటో దిగేందుకు రాకపోవడం గమనార్హం. ఇతరుల సాయంతోనైనా ఇందుకోసం ప్రయత్నం చేసే వాడే కదా! సెల్ఫీ అంటూ దగ్గరకు వచ్చిన తొలిసారే హత్యాయత్నానికి పాల్పడ్డాడంటే దీని వెనుక కుట్ర ఉన్నట్లేనని నిపుణులు పేర్కొంటున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top