రాజ్యాధికారం కోసం పోరాటం | Sakshi
Sakshi News home page

రాజ్యాధికారం కోసం పోరాటం

Published Tue, Nov 11 2014 2:53 AM

రాజ్యాధికారం కోసం పోరాటం - Sakshi

కడప అగ్రికల్చర్:
 రాజ్యాధికారం కోసం పేదలు పోరాటాలు చేయాల్సిన సమయం ఆసన్నమైందని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు వి.శ్రీనివాసరావు పేర్కొన్నారు. సీపీఎం 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సోమవారం సాయంత్రం కడపలో జిల్లా సదస్సు నిర్వహించారు. ముందుగా ఐటీఐ సర్కిల్‌లో పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం అక్కడి కల్యాణ మండపంలో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలు ఎన్నో వస్తున్నాయి, పోతున్నాయి కానీ సీపీఎం మాత్రం ప్రజల పక్షాన నిలుస్తూ సమస్యలపై నిత్యం పోరాడుతూ ప్రజల మధ్యనే ఉంటోందన్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడిదారులు, కార్పొరేట్ శక్తుల చేతుల్లో ఉంటున్నాయని తెలిపారు. కేంద్ర మంత్రివర్గంలో చేరిన సుజనా చౌదరి ఏనాడైనా రాష్ట్ర పరిస్థితులపై పెద్దల సభలో చర్చించాడా? అని ప్రశ్నించారు. డబ్బు, సంస్థలు, పెట్టుబడులు పెడితే ఏ పార్టీలోనైనా పెత్తనం చలాయించవచ్చనేది సుజనా చౌదరే ఉదాహరణ అని అన్నారు. రాష్ట్రానికి ఉన్న అవసరాలు ఏమిటి? కేంద్రం నుంచి ఎలా రాబట్టుకోవాలి? అనే ఆలోచన ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఏ కోశాన లేదని విమర్శించారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీపీఎంనాయకులు పేదల పక్షాన పోరాడుతుంటే కేసులు పెట్టి జైళ్లకు పంపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు కనీస సౌకార్యలు కల్పించాలని అడిగితే కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం  చేశారు. పేదల పక్షాన మరో స్వాతంత్య్ర పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.

రైతులు, డ్వాక్రా మహిళలు తీసుకున్న బ్యాంకు రుణాలు మాఫీ చేస్తామని చెప్పి చివరకు మోసం చేశారని సీఎం చంద్రబాబును తీవ్రంగా విమర్శించారు. హామీలిచ్చి తప్పడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని అన్నారు.  భవిష్యత్ పోరాట  పంథాపై విశాఖపట్టణంలో వచ్చే ఏడాది జాతీయ సదస్సు నిర్వహించనున్నామని తెలిపారు.

ఆ సదస్సులో కీలక నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళతామన్నారు. ఈ సదస్సులో సీనియర్ పార్టీ సభ్యుడు వెంకటాద్రిని సన్మానించారు. సదస్సులో ఎమ్మెల్సీ గేయానంద్, పార్టీ జిల్లా కార్యదర్శి నారాయణ, జిల్లా నాయకులు ఆంజనేయులు, చంద్రశేఖర్, నగర కార్యదర్శి రవిశంకర్‌రెడ్డి తదితరులు పాల్గొని మాట్లాడారు.

Advertisement
Advertisement