గమ్యం చేరని ప్రయాణాలు | The destination of the trips included | Sakshi
Sakshi News home page

గమ్యం చేరని ప్రయాణాలు

Feb 14 2014 3:28 AM | Updated on Aug 29 2018 1:59 PM

బాతుల లోడుతో వెళుతున్న మినీ వ్యాన్ బోల్తా పడటంతో పట్టణంలోని బాలకృష్ణారెడ్డినగర్‌కు చెందిన తల్లీ కూతుర్లు మృతి చెందిగా, తండ్రీకొడుకులు గాయపడ్డారు.

జాతీయ రహదారిపై ప్రయాణం ప్రమాదకరంగా మారింది. రోడ్డెక్కిన ప్రయాణం గమ్యం చేరే పరిస్థితి కనిపించడం లేదు. గురువారం జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం చెందగా, పది మంది గాయపడ్డారు.
 
 జీవన పోరాటంలో కావలి సమీపంలో ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం చేవూరు క్రాస్ రోడ్డు వద్ద జాతీయ రహదారిపై బాతుల లారీ బోల్తాపడి కావలికి చెందిన సంచార కుటుంబానికి చెందిన తల్లీ కూతురు మృతి చెందారు. నాయుడుపేటలో జరిగే బంధువు కర్మక్రియలకు వెళుతూ ఒకే కుటుంబంలోని అవ్వ, మనుమరాలు మృత్యు ఒడికి చేరారు.
 
 కావలి, న్యూస్‌లైన్ : బాతుల లోడుతో వెళుతున్న మినీ వ్యాన్ బోల్తా పడటంతో పట్టణంలోని బాలకృష్ణారెడ్డినగర్‌కు చెందిన తల్లీ కూతుర్లు మృతి చెందిగా, తండ్రీకొడుకులు గాయపడ్డారు. ఈ సంఘటన జిల్లా సరిహద్దు ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం చేవూరు క్రాస్‌రోడ్డు వద్ద జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. పట్టణంలోని బాలకృష్ణారెడ్డినగర్‌కు చెందిన గిరిజనులు మొగిలి రమణయ్య, అంజమ్మ (35) దంపతులు బాతులు పెంచుతూ సంచార జీవనం చేస్తుంటారు. వీరికి కుమార్తె భవాని(12), కుమారుడు చెన్నకేశవులు ఉన్నారు. గుంటూరు జిల్లా వినుకొండ సమీపంలో బాతులను పెంచి సూళ్లూరుపేటలో అమ్మేందుకు బుధవారం అర్ధరాత్రి మినీ వ్యాన్‌లో బయలుదేరారు. చేవూరు రోడ్డు సమీపంలో జాతీయ రహదారి విస్తరణ పనులు జరుగుతున్నాయి.
 
 వ్యాన్ డ్రైవర్ ఫోన్‌లో మాట్లాడుతూ చేవూరు రోడ్డు వద్ద జాతీయ రహదారి డివైడర్ పక్కన ఉన్న మట్టి బస్తాను ఢీకొన్నాడు. దీంతో వ్యాన్ అదుపు తప్పి డివైడర్ వైపునకు దూసుకెళ్లి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో అంజమ్మ, భవాని అక్కడికక్కడే మృతి చెందారు. రమణయ్య, చెన్నకేశవులకు గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో బాతులు కూడా మృతి చెందాయి. ప్రమాదం జరిగిన వెంటనే వ్యాన్‌డ్రైవర్ పరారయ్యాడు. క్షతగాత్రులిద్దరిని 108 అంబులెన్స్ సిబ్బంది కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు. తల్లీకూతుళ్ల మృతదేహాలను పోస్టుమార్టం కోసం స్థానిక ఏరియా వైద్యశాలకు తరలించారు.
 
 మినీవ్యాన్ ప్రకాశం జిల్లా సింగరాయకొండకు చెందినదిగా పోలీసులు గుర్తించారు. ఈ సంఘటనపై గుడ్లూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సంచార జీవనం చేస్తున్న కుటుంబానికి చెందిన తల్లీకూతుర్లు అంజమ్మ, భవానీ మృతి చెందటంతో బాలకృషారెడ్డినగర్‌లో విషాదం నెలకొంది. విషయం తెలుసుకున్న వారి బంధువులు, స్థానికులు కావలి ఏరియా వైద్యశాలకు తరలివచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement