వేట ముమ్మరం | The deployment of greyhounds from AP | Sakshi
Sakshi News home page

వేట ముమ్మరం

Mar 29 2016 12:38 AM | Updated on Mar 23 2019 9:10 PM

ఆంధ్ర-ఓడిశా సరిహద్దు(ఏవోబీ)ని బలగాలు జల్లెడపడుతున్నాయి. ఓడిశాలో బీఎస్‌ఎఫ్ బలగాలు కూంబింగ్ ప్రారంభిస్తే.. ఆంధ్ర నుంచి గ్రేహౌండ్స్ బలగాలు గాలింపు చేపడుతున్నాయి.

ఏవోబీని జల్లెడ పడుతున్న బలగాలు
ఒడిశా నుంచి బీఎస్‌ఎఫ్
ఏపీ నుంచి గ్రేహౌండ్స్ మోహరింపు



కొయ్యూరు: ఆంధ్ర-ఓడిశా సరిహద్దు(ఏవోబీ)ని బలగాలు జల్లెడపడుతున్నాయి. ఓడిశాలో బీఎస్‌ఎఫ్ బలగాలు కూంబింగ్ ప్రారంభిస్తే.. ఆంధ్ర నుంచి గ్రేహౌండ్స్ బలగాలు గాలింపు చేపడుతున్నాయి. తూర్పు కనుమల్లో ఆకు రాల్చే చెట్లు అధికం. ప్రస్తుతం చెట్లన్నీ ఆకురాల్చి మోడుగా కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితి కూంబింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. అడవిలో ఎవరున్నది దూరం నుంచే తెలిసిపోతుంది. దీంతో వేటను పోలీసులు ముమ్మరం చేశారు. ఒడిశాను ఆనుకుని ఉన్న జిల్లాలోని మూడు మండలాలల్లో నలువైపుల నుంచి కూంబింగ్ ఉధృతం చేశారు. చింతపల్లి, గూడెంకొత్తవీధి,జి.మాడుగుల మండలాలు సరిహద్దులో ఉన్నాయి. మావోయిస్టుల  స్థావరాలుగా భావించే ఈ ప్రాంతాల్లో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. కొద్ది రోజులుగా మావోయిస్టులు మౌనంగా ఉన్నారు. అంటే కేడర్‌ను బలోపేతం చేసుకుంటున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లో కూంబింగ్ చేపట్టారు. ఇదే రోజుల్లో గతేడాది పెదలంక కొత్తూరు ప్రాంతంలో మావోయిస్టు అగ్రనేత ఒకరు శిక్షణ నిర్వహించారు. కేంద్ర కమిటీ సభ్యులు లేదా ఏవోబీకి చెందిన అగ్రనేతలు ఎక్కువగా మార్చి లేదా ఏప్రిల్‌లో ఇటువైపుగా వస్తుంటారు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని పోలీసులు అప్రమత్తమయ్యాయి. గతేడాది కేంద్ర మిలటరీ కమిషన్ నేత నంబళ్ల కేశవరావు ఏవోబీలో సంచరించారు.


అతని రాకను తెలసుకున్న బలగాలు అప్పట్లో పెద్ద ఎత్తున కూంబింగ్ చేపట్టాయి. తాజాగా పెదలంక కొత్తూరు ప్రాంతంపై నిఘా పెంచినట్టు తెలుస్తోంది.మల్కన్‌గిరి ప్రాంతంలో కూడా బీఎస్‌ఎఫ్ బలగాలు అటువైపుగా కూంబింగ్ చేపట్టాయి. రెండు రాష్ట్రాల బలగాలు సంయుక్తంగా వేట కొనసాగించడం సులువుగా ఉంటోంది. మరోవైపు జిల్లా పోలీసు యంత్రాంగం ఏర్పాటు చేసిన ఔట్ పోస్టులు కూడా రెండు రాష్ట్రాల మధ్య దళసభ్యుల రాకపోకలను నియంత్రిస్తున్నాయి. ఇదంతా మావోయిస్టుల కార్యకలాపాలను తగ్గించేందుకు వీలుగా ఉంటుందని పోలీసు అధికారులు భావిస్తున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement