
సరిహద్దు తగాదాలో వ్యక్తి దారుణ హత్య
స్థల సరిహద్దు తగాదా వివాదంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. రామచంద్రపురం మండలం
యనమదల(రామచంద్రపురం) : స్థల సరిహద్దు తగాదా వివాదంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. రామచంద్రపురం మండలం యనమదలలో ఆదివారం ఈ సంఘటన చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన సాదే జనార్దనరావు(45)కు అదే గ్రామానికి చెందిన దారా అప్పారావుకు సరిహద్దు గొడవలున్నాయి. జనార్దనరావు ఇంటి వెనుక గల ఖాళీ ప్రదేశాన్ని రెండు నెలల క్రితం కొనుగోలు చేశారు.
దారా అప్పారావు ఇదే స్థలం పక్కన గల మరొకరి స్థలాన్ని కౌలుకు తీసుకుని పశువుల పాక వేసుకున్నాడు. జనార్దనరావు కొన ్న స్థలం పక్క నుంచే అప్పారావు పశువులను తీసుకు వెళుతుండేవాడు. దీంతో వీరి మధ్య ఇటీవల తరచూ గొడవలు జరుగుతుండేవి. ఇదిలా ఉండగా ఈ రెండు స్థలాల మధ్యలోని చింత చెట్టును దారా అప్పారావు తొలగించే ప్రయత్నం చేయగా జనార్దనరావు అడ్డుకున్నాడు.
వీరి మధ్య వివాదం ముదరడంతో అప్పారావు, అతడి కుమారులు సింహాద్రి, చంటిబాబు, రాజశేఖర్‌లు కత్తితో జనార్దనరావుపై దాడి చేయడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. నిందితులు పరారయ్యారు. విషయం తెలుసుకున్న మృతుడు జనార్దనరావు చిన్న కుమారుడు దుర్గాప్రసాద్ సంఘటనా స్థలానికి చేరుకుని స్థానికులకు పోలీసులకు సమాచారం అందించాడు. ద్రాక్షారామ, కె.గంగవరం ఎస్సైలు వంశీధర్, దుర్గారావు, సీఐ పి.కాశీవిశ్వనాథ్, రామచంద్రపురం డీఎస్పీ బి.రవీంద్రనాథ్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ చేశారు.
గ్రామంలో విషాదఛాయలు
సౌమ్యుడిగా పేరొందిన జనార్దనరావు హత్యకు గురికావడంతో యనమదల గ్రామంలో విషాదం నెలకొంది. జనార్దనరావుకు భార్య సత్యవతి, తల్లి వెంకమ్మ, కుమారులు వెంకటేష్, దుర్గాప్రసాద్ ఉన్నారు. మృతదేహాన్ని రామచంద్రపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.