కర్నూలు టీడీపీలో లోకేష్‌ చిచ్చు

TG Venkatesh Fires On Nara Lokesh Over Candidate Announcement - Sakshi

అభ్యర్థుల ప్రకటనపై టీజీ అసంతృప్తి

లోకేష్‌ను హిప్నటైజ్‌ చేశారంటూ వ్యంగ్యాస్త్రాలు

సాక్షి, అమరావతి : తెలుగుదేశం పార్టీలో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. కర్నూలు జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేష్‌ తెలుగుదేశం పార్టీ తరపున కర్నూలు ఎమ్మెల్యే, ఎంపీల అభ్యర్థుల పేర్లు ప్రకటించారు. ఈనేపథ్యంలో ఒక్కసారిగా జిల్లాలో రాజకీయ వేడి రాజుకుంది. దీంతో ఆ రెండు స్థానాలకు టికెట్లు ఆశిస్తున్న వారిలో అసంతృప్తి రేగింది. వివరాల్లోకి వెళ్తే.. కర్నూలు జిల్లా పర్యటన సందర్భంగా ఓ అధికారిక కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్‌, రానున్న ఎన్నికల్లో టీడీపీ నుంచి కర్నూలు శాసనసభ స్థానానికి ఎస్వీ మోహన్‌ రెడ్డి,  లోక్‌సభ స్థానానికి వైఎస్సార్‌సీపీ ఫిరాయింపు ఎంపీ బుట్టారేణుక పోటీ చేస్తారంటూ ప్రకటించారు. 

అయితే చాలా కాలంగా ఆ రెండు స్థానాలు తమవే అనుకుంటున్న టీజీ వెంకటేష్‌కు లోకేష్‌ ప్రకటన రుచించలేదు. దీంతో ఆయన వర్గంలో తీవ్ర అసంతృప్తి చెలరేగింది. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడుగా కొనసాగుతున్నా.. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎంపీ ఎమ్మెల్యే స్థానాలపై టీజీ అండ్‌ కో ఆశలు పెట్టుకుంది. అయితే అకస్మాత్తుగా మంత్రి 2019 ఎన్నికల్లో అభ్యర్థులు వీళ్లేనంటూ ప్రకటించడంతో టీజీ తీవ్ర అసహనానికి గురయ్యారు. మంత్రి చేసిన వ్యాఖ్యలను బహిరంగంగానే  వ్యతిరేకిస్తూ విమర్శలు ఎక్కుపెట్టారు. ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో అభ్యర్థులను ఎలా ప్రకటిస్తారంటూ మండిపడ్డారు. మంత్రి ప్రకటన తమను ఆశ్చర్యానికి గురిచేసిందని అన్నారు. 

లోకేష్‌ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కాదని, ముఖ్యమంత్రి కూడా కాదని అలాంటిది అభ్యర్థుల పేర్లు ఎలా ప్రకటిస్తారంటూ ప్రశ్నించారు. లోకేష్‌ ఏ ప్రాతిపదికన అభ్యర్థలను నిర్ణయించారో తనకు అంతపట్టడం లేదని అన్నారు. తెలుగుదేశం పార్టీకి అర్ధరాత్రి నిర్ణయాలు తీసుకుంటుందని.. మంత్రి నిర్ణయం కూడా ఇలాంటిదేమోనని ఎద్దేవా చేశారు. ఎస్వీ మోహన్‌ రెడ్డి ఏమైనా చేయగలరని.. అదే విధంగా లోకేష్‌ను ఎమైనా హిప్నటైజ్‌ చేశారేమో అంటూ టీజీ వెంకటేష్‌ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సర్వేలో అనుకూలంగా ఉన్నవారికే టికెట్లు ఇస్తామని ముఖ్యమంత్రి తనతో చాలాసార్లు చెప్పారని అన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top