వాటర్‌ ట్యాంకులెక్కి నిరసన

TET Applicants were concerned on water tankers - Sakshi

     టెట్‌ పీఈటీ ప్రశ్నపత్రం లీకైందంటూ

    అవనిగడ్డ, ఒంగోలులో ఆందోళనలు

    చెన్నై సెంటర్‌ రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన కలెక్టర్‌

అవనిగడ్డ/ఒంగోలు: టెట్‌ పీఈటీ ప్రశ్నపత్రం లీకైందని, అందువల్ల ఈ నెల 19న జరగనున్న పరీక్షను రద్దు చేయాలని కోరుతూ కృష్ణా జిల్లా అవనిగడ్డ, ప్రకాశం జిల్లా ఒంగోలులో అభ్యర్థులు ఆదివారం వాటర్‌ ట్యాంకులు ఎక్కి ఆందోళన చేశారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన వందలాది మంది పీఈటీ అభ్యర్థులు అవనిగడ్డలో డీఎస్సీ శిక్షణ తీసుకుంటున్నారు. ఈ ఏడాది కొత్తగా పీఈటీ అభ్యర్థులకు టెట్‌ నిర్వహిస్తుండటంతో రెండు నెలల నుంచి ఇక్కడ శిక్షణ పొందుతున్నారు. స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియాలో అసిస్టెంట్‌ సెక్రటరీగా పనిచేస్తున్న తేళ్ల వంశీకృష్ణ విజయవాడలో బాసర ఇన్‌స్టిట్యూట్‌ నిర్వహిస్తున్నారు. ఒంగోలులోనూ ఆయనకు శిక్షణా కేంద్రం ఉంది. స్కూల్‌ గేమ్‌ ఫెడరేషన్‌లో సెక్రటరీగా పనిచేస్తున్న సయ్యద్‌ బాషా సహకారంతో వంశీకృష్ణ టెట్‌ పేపర్‌ లీక్‌ చేశారని ఆందోళనకారులు ఆరోపించారు.

వంశీకృష్ణ శిక్షణ ఇచ్చిన వారందరినీ చెన్నై సెంటర్‌లో వేయించుకున్నారని చెప్పారు. జాబ్‌ గ్యారెంటీ అంటూ 75 మందికి ఒక్కొక్కరి వద్ద రూ.4లక్షల నుంచి రూ.8లక్షలు తీసుకుని టెట్‌ పేపర్‌ లీక్‌ చేయించారని వారు ఆరోపించారు. టెట్‌ని రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ అవనిగడ్డలో మధ్యాహ్నం 1.15 గంటలకు స్ధానిక సంత వద్ద ఉన్న రెండు వాటర్‌ ట్యాంకులపై 28 మంది పీఈటీ అభ్యర్థులు ఎక్కారు. మరో రెండొందల మంది పీఈటీలు కింద నిలబడి టెట్‌ రద్దు చేయాలని నినాదాలు చేశారు. వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ కన్వీనర్‌ సింహాద్రి రమేష్‌బాబు ఘటనా స్ధలికి చేరుకుని పీఈటీలతో మాట్లాడారు. వైఎస్సార్‌సీపీ నేత అంబటి రాంబాబుతో వీరి సమస్యలపై మాట్లాడించారు. ఈ సందర్భంగా తమకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని అభ్యర్థులు అంబటిని కోరారు. ఇదిలా ఉండగా టెట్‌ను రద్దు చేయాలంటూ ఒంగోలు లోనూ సుమారు 50 మంది అభ్యర్థులు ఓవర్‌హెడ్‌ట్యాంక్‌ ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు నచ్చచెప్పడంతో రాత్రి 8 గంటలకు కిందికి దిగారు.  

టెట్‌ పీఈటీ పేపర్‌ యథాతథం: మంత్రి
ఈ నెల 19న నిర్వహించే టెట్‌ పీఈటీ పేపర్‌ లీకైందనే వార్తలను మంత్రి గంటా శ్రీనివాసరావు ఖండించారు. 19న పరీక్ష నిర్వహిస్తామని స్పష్టంచేశారు. ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహిస్తుందున ప్రశ్నపత్రం లీకయ్యే అవకాశం లేదన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యాయామ ఉపాధ్యాయుడు  వంశీకృష్ణను సస్పెండ్‌ చేస్తున్నామన్నారు.

టెట్‌ రద్దు చేయాలి
విజయవాడతో పాటు, ఒంగోలులో తేళ్ల వంశీకృష్ణ పీఈటీలకు టెట్‌కు శిక్షణ ఇచ్చారు. టెట్‌ పేపరు సెట్‌చేసే స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా సెక్రటరీ సయ్యద్‌బాషాకు ఇతనికి సన్నిహిత సంబం«ధాలున్నాయి. ఇతని ద్వారా తమ దగ్గర శిక్షణ తీసుకున్నవారికి టెట్‌ పేపర్‌ ముందుగానే లీక్‌ చేశారు. అందువల్ల టెట్‌ని రద్దు చేసి మరోసారి నిర్వహించాలి.
   – శ్రీరామకృష్ణ, పెద్దాపురం, తూర్పుగోదావరి

చెన్నై సెంటర్‌ రద్దు 
వివాదానికి కారణమైన చెన్నై పరీక్షా కేంద్రాన్ని రద్దు చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్‌ బి. లక్ష్మీకాంతం తహశీల్దార్‌ బి ఆశయ్య ద్వారా ఆందోళన చేస్తున్న అభ్యర్థులకు  తెలిపారు. ఈ సెంటర్‌లో పరీక్ష రాసేవారికి రాష్ట్రంలోని వేర్వేరు కేంద్రాలు కేటాయిస్తున్నట్లు చెప్పారు. ఉద్యోగం చేస్తూ కోచింగ్‌ సెంటర్‌ నిర్వహిస్తున్న తేళ్ల వంశీకృష్ణపై విచారణకు ఆదేశించినట్టు తెలిపారు. ఈనెల 19వ తేదీన పీఈటీలకు టెట్‌ జరుగుతుందని, ఎలాంటి మాల్‌ప్రాక్టీస్‌ జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు కలెక్టర్‌ చెప్పారని తహశీల్దార్‌ వెల్లడించారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top