
జగదీష్ మృతదేహం వద్ద విచారిస్తున్న మిత్రులు.. ఇన్‌సెట్లో జగదీష్ (ఫైల్)
సాక్షి, కవిటి/శ్రీకాకుళం : ఉత్సాహంగా పదో తరగతి పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న తమ సహచరుడు అర్ధంతరంగా మృతి చెందడాన్ని ఆ స్నేహితులు జీర్ణించుకోలేకపోయారు. తమతో ఆడుతూ పాడుతూ కలివిడిగా తిరిగిన బాల్యమిత్రుడు ఇక లేడన్న చేదు నిజం వారిని శోకసాగరంలో ముంచింది. మండలంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదోతరగతి చదివిన బలగ జగదీష్(16) శుక్రవారం రాత్రి తీవ్ర అనారోగ్యం కారణంగా మరణించాడు. ఇతడు సికిల్‌సెల్ ఎనీమియా అనే వ్యాధితో బాధపడుతూ గత కొంతకాలంగా చికిత్స పొందుతున్నాడు. ఇతడిని ఎంతో ఆప్యాయతా అనురాగాలతో చూసుకునే జగదీష్ తాతయ్య ఇటీవల ఆకస్మికంగా మృతిచెందాడు.
దీంతో ఆ రోజు నుంచే తీవ్రంగా కుంగిపోయిన జగదీష్ ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. తన తండ్రికి తలకొరివి పెట్టిన కారణంగా జగదీష్‌ను వైద్యానికి తీసుకువెళ్లలేకపోయిన బలగ నారాయణ, అతని భార్య తన కన్నకొడుకు కళ్లేదుటే మృతిచెందడంతో తీవ్రంగా రోదిస్తున్నారు. శుక్రవారం సాయంత్రానికి జగదీష్ ఆరోగ్యం తీవ్రంగా క్షీణించడంతో ఉద్దానం ఫౌండేషన్ అంబులెన్స్‌ను రప్పించారు. ఎందుకైనా మంచిదని స్థానిక ఆర్‌ఎంపీ బాలుడిని పరీక్షించారు. అప్పటికే అతని గుండె ఆగిపోయి మృతిచెందినట్టు నిర్ధారించడంతో వారంతా హతాశులయ్యారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.