బాదంపూడి చెక్ పోస్టు వద్ద ఉద్రిక్తత

Tension At Badampudi Check post - Sakshi

సాక్షి, తాడేపల్లిగూడెం: పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం బాదంపూడి చెక్ పోస్టు వద్ద ఉద్రిక్తత నెలకొంది. అన్నదాతల ఆక్రోశంతో జాతీయ రహదారిపై  ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఉంగుటూరు మండలానికి చెందిన రైతులు, కౌలు రైతులు బాదంపూడి జాతీయ రహదారిని నిర్బంధించారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ఇవ్వకుండా రైస్ మిల్లర్లు, అధికారులు కుమ్మక్కయి.. తమను ఇక్కట్ల పాలు చేస్తున్నారని  రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలంటూ పెద్దఎత్తున  నిరసన ప్రదర్శన నిర్వహించారు. దీంతో దాదాపు నాలుగు గంటల పాటు ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. పంటకు మద్దతు ధర ఇవ్వాలంటూ, ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా వాటిని కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. గతంలో బస్తా రూ. 1300 కొనేవారని,  ఇప్పుడు బస్తాకు రూ.1100కి మించి గిట్టుబాటు ధర ఇవ్వటం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు.

1010 రకం ధాన్యాన్ని తాము పండిస్తుండగా.. వ్యవసాయ అధికారులు తమ వద్దకు వచ్చి 1026, 1056 రకం ధాన్యం పండించాలని తమకు చెప్పారని, ఇప్పుడు ప్రభుత్వం కానీ, రైస్ మిల్లర్లు కానీ ఆ ధాన్యాన్ని కొనడం లేదని రైతులు తెలిపారు. ఇదేమిటని అధికారులను ప్రశ్నిస్తే నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఇప్పుడు తమకు వేరేదారి లేదని, ప్రభుత్వం పట్టించుకోకపోవడంతోనే రహదారిని నిర్బంధించి నిరసన తెలిపామని చెప్పారు. నిరసన చేపట్టిన రైతులపై పోలీసులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. దీంతో రైతులకు, పోలీసులకు మధ్య తీవ్ర  వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా పోలీస్ గోబ్యాక్ అన్న నినాదాలతో జాతీయ రహదారి కొంతసేపు మార్మోగింది. ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు ఆందోళనకారులను చెల్లాచెదురుచేసి  కొంతమంది రైతునాయకులు  అదుపులోకి తీసుకుని  చేబ్రోలు పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో ఉంగుటూరు మండలంలో  ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top