దేవుడి భూములపై దయ్యాల కన్ను

Temple Lands Grabbing in Prakasam - Sakshi

నూకల పరమేశ్వరి అమ్మవారి (గంగమ్మ దేవత) భూమి స్వాహా

భూములు అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న కబ్జాకోరులు

ఆస్తిని బ్యాంక్‌ల్లో తాకట్టు పెట్టి రూ.లక్షల్లో రుణాలు

ఆలస్యంగా వెలుగు చూసిన అక్రమార్కుల దుర్బుద్ధి

ప్రకాశం,మర్రిపూడి: వెనుకబడిన మర్రిపూడి మండలంలో దేవుడి భూములకు రక్షణ లేకుండా పోయింది. అక్రమార్కులకు మర్రిపూడి కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. కొందరు దేవదాయ భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేయించుకుని పాస్‌పుస్తకాలు సృష్టించుకున్నారు. భూములు యథేచ్ఛగా ఆక్రమించుకుని అనుభవిస్తున్న విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. దేవాలయ భూములను పలు బ్యాంక్‌ల్లో తాకట్టు పెట్టి రూ.లక్షల్లో రుణాలు తీసుకుని దర్జాగా తిరుగుతున్నారు. గ్రామ దేవతలకు చెందిన భూములను కూడా వదలడం లేదు. అక్రమార్కుల చెర నుంచి గ్రామ దేవతల భూమికి విముక్తి కల్పించాలని పలువురు భక్తులు కోరుతున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు స్థానిక తహసీల్దార్‌ ఎస్‌.సువర్ణరావు, దేవదాయశాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌కు సోమవారం వినితిపత్రం సమర్పించారు.  

ఇదీ..అక్రమార్కుల దుర్బుద్ధి
మండల కేంద్రం మర్రిపూడికి ఉత్తరం వైపున నూకల పరమేశ్వరి అమ్మవారి (గంగమ్మ) గుడి ఉంది. ఆ గుడిని పురాతన కాలంలో నిర్మించారని పెద్దలు చెబుతున్నారు. అమ్మవారికి ధూపదీప నైవేద్యం సమర్పిచేందుకు అప్పట్లో అమ్మవారికి 20 ఎకరాలను దాతలు కేటాయించారు. 20 ఎకరాల్లో 13 ఎకరాల భూమి పూజారి కింద ఉంది. మిగిలిన అమ్మ వారి భూమిపై భూకబ్జాదారుల  కన్ను పడింది. సర్వే నంబర్‌ 978–1లో 5.62 ఎకరాల భూమి, సర్వే నంబర్‌ 978–2లో 1.47 ఎకరాల భూమి ఉంది. ఆ భూమి ఎక్కడ ఉందో దేవదాయ శాఖ అధికారులకు సైతం తెలియదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

మర్రిపూడి, పొదిలికి చెందిన ఇద్దరు ఈ భూమిని గుర్తించి కైవసం చేసుకునేందుకు పన్నాగం పన్నారు. ఇదే అదునుగా భావించిన ఆ ఇద్దరు సీఎస్‌పురం మండలం పెదగోగులపల్లికి చెందిన ఆకుమళ్ల వెంకటేశ్వర్లును సంప్రదించి మర్రిపూడి రెవెన్యూ పరిధిలో మీ పూర్వికులకు చెందిన ఆస్తి ఉందని, ఆ భూమి తమకు విక్రయించాలని మాయమాటలు చెప్పారు. వారి మాటలు నమ్మిన వెంకటేశ్వర్లు పొదిలి సబ్‌రిజిస్ట్రార్‌ వద్దకు వెళ్లి 2011 ఏప్రిల్‌ 18న ఆ ఇద్దరు అక్రమార్కులకు రిజిస్ట్రేషన్‌ చేశాడు. అమ్మవారి భూమికి పట్టాదారు పాస్‌పుస్తకాలు సృష్టించి సిండికేట్‌ బ్యాంక్‌లో తాకట్టు పెట్టి దాదాపు రూ.6 లక్షలుపై చిలుకు రుణం తీసుకున్నారు. అది అమ్మ వారి భూమని తనకు తెలియదని, వారిద్దరు వచ్చి తనను ప్రలోభాలకు గురిచేసి తనతో రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారని, ఆ భూమి వెంటనే అమ్మవారికి చెందేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ఆకుమళ్ల వెంకటేశ్వర్లు కోరుతున్నాడు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top